Global Defense Trends: ప్రపంచ రక్షణ వ్యయంలో భారత్‌ టాప్-5.. 'S-400'తో పాకిస్థాన్‌కు చుక్కలే!

Global Defense Trends: సిప్రీ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. రష్యా నుంచి నాలుగో విడత ఎస్-400 క్షిపణి వ్యవస్థలు మే నెలలో భారత్‌కు చేరనున్నాయి. రక్షణ రంగానికి రూ. 7.85 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపు.

Arun Chilukuri
Published on: 30 April 2026 7:21 AM IST
Global Defense Trends
X

Global Defense Trends: ప్రపంచ రక్షణ వ్యయంలో భారత్‌ టాప్-5.. 'S-400'తో పాకిస్థాన్‌కు చుక్కలే!

Global Defense Trends: మారుతున్న భౌగోళిక ఉద్రికతల వేళ మన దేశం సైన్యాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే ప్రపంచ దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - సిప్రీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాది భారత్ రక్షణ రంగ వ్యయం గణనీయంగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ 92.1 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.8.6 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు నివేదిక పేర్కొంది. అంతకు ముందు ఏడాది 2024తో పోల్చితే ఇది 8.9 శాతం అధికమని సిప్రీ నివేదిక పేర్కొంది. ప్రపంచం మొత్తం సైనిక వ్యయంలో భారత్ వాటా 3.2 శాతంగా ఉందని వివరించింది. పొరుగు దేశం పాకిస్థాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్, వంటి చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. ఈ కారణాలతోనే రక్షణ వ్యయం పెరిగినట్లు సిప్రీ నివేదిక స్పష్టం చేసింది.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ సైనిక వ్యయంలో కేవలం కొన్ని దేశాలే ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. వాటిలో అమెరికా 954 బిలియన్ డాలర్లతో అందరి కంటే చాలా ముందు వరుసలో ఉంది. చైనా 336 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. తద్వారా వరుసగా 31 ఏళ్లపాటు రక్షణ బడ్జెట్ పెంచిన దేశంగా తన రికార్డును అలాగే పదిలంగా కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా రక్షణ వ్యయం కోసం 190 బిలియన్ డాలర్లను కేటాయించింది. ఈ విధంగా అది ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. జర్మనీ తన సైనిక వ్యయాన్ని 24 శాతం మేర భారీగా పెంచింది. తద్వారా దాని రక్షణ వ్యయం 114 బిలియన్ డాలర్లకు చేరి నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు పాకిస్థాన్​కూడా తన సైనిక వ్యయాన్ని 11 శాతం పెంచి 11.9 బిలియన్ డాలర్లకు చేర్చింది. తద్వారా 40 దేశాల జాబితాలో 31వ స్థానంలో నిలిచింది.

సిప్రీ నివేదిక ప్రకారం గ్లోబల్ డిఫెన్స్ ట్రెండ్స్‌లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్‌తో పోలిస్తే భారత సైనిక వ్యయం దాదాపు 9 రెట్లు అధికంగా ఉంది.చైనా, పాకిస్థాన్‌తో ఉన్న ఉద్రిక్తతల వల్లే భారత్ ఆయుధ కొనుగోళ్లను వేగవంతం చేసిందని ఈ స్పష్టం చేసింది. 2016-20 నుంచి 2021-25 మధ్య భారతదేశ ఆయుధ దిగుమతులు 4 శాతం తగ్గాయని సిప్రీ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ

భారత్ ఇప్పటికీ ప్రపంచంలో రెండో అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతోంది. ప్రపంచ దిగుమతుల్లో ఇది 8.2 శాతం. అయితే, ఆయుధాల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 2011-15 మధ్య 70% ఉండగా.. 2016-20 నాటికి 51%, 2021-25 నాటికి 40% పడిపోయింది. రష్యా నుంచి దిగుమతులు క్రమంగా తగ్గిస్తూ ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల వైపు మొగ్గు చూపుతోంది. అయినప్పటికీ, ఇప్పటికీ భారత్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు రష్యాయే కావడం గమనార్హం.

2026 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఏకంగా రూ.7.85 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతంతో పోలిస్తే 15 శాతానికి పైగా ఎక్కువ. ఇందులో 2.19 లక్షల కోట్లను ఫైటర్ జెట్లు, సబ్‌మెరైన్లు, డ్రోన్లు, స్మార్ట్ వెపన్స్ కొనుగోలు కోసం మూలధన వ్యయంగా కేటాయించారు. మరోవైపు ప్రపంచ సైనిక వ్యయం 2025 నాటికి 2,887 బిలియన్ డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. ఇది 2024తో పోలిస్తే 2.9 శాతం పెరుగుదల. ప్రపంచ జీడీపీలో 2.5 శాతానికి సమానం.. 2009 తర్వాత ఇదే అత్యధిక వాటా కావడం గమనార్హం. యూరోప్ వ్యయం 14% పెరిగి 864 బిలియన్ డాలర్లకు చేరింది. ఆసియా-ఓషియానియా వ్యయం 8.1% పెరిగి 681 బిలియన్ డాలర్లకు చేరింది. బెల్జియం, స్పెయిన్, నార్వే, డెన్మార్క్, పోలాండ్, కెనడా దేశాలలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరోప్ దేశాలు భారీగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. ఉక్రెయిన్ తన జీడీపీలో 40 శాతాన్ని రక్షణ రంగం కోసమే ఖర్చు చేస్తోంది.

ఇదిలా ఉంటే రష్యా నుంచి నాల్గో విడత అత్యాధునిక ఎస్‌-400 గగనతల వ్యవస్థలు భారత్‌కు చేరేందుకు సిద్ధమయ్యాయి. మే రెండో వారంలో ఇవి రానున్నాయి. గతవారమే రష్యాలో షిప్పింగ్‌కు సిద్ధంగా ఉన్న S-400 వ్యవస్థలను భారత వాయుసేన ఉన్నతాధికారులు తనిఖీ చేశారని పేర్కొన్నాయి. పాకిస్థాన్‌ నుంచి ముప్పును నిర్మూలించేందుకు రాజస్థాన్‌లోని సరిహద్దు వెంబడి వీటిని మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ప్రతీ ముప్పును ఈ ఎస్‌-400లోని క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో అడ్డుకున్నాయి. అందుకు గుర్తుగా ఆపరేషన్‌ సిందూర్‌ వార్షికోత్సవం రోజునే వీటిని భారత్‌కు డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు రచించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్ మొత్తం 11 దీర్ఘశ్రేణి ఎస్-400 క్షిపణులను ప్రయోగించి, పాక్‌ యుద్ధవిమానాలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రవాణా విమానాలతో సహా పలు వైమానిక ముప్పులను నిర్వీర్యం చేసినట్లు సమాచారం.

ఆపరేషన్‌ సిందూర్‌ వేళ ఓ పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని ఎస్‌-400 ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచే ధ్వంసం చేసింది. ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ ఊపరితలంపై నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించింది లేదు. అంతకు ముందు కూల్చిన లక్ష్యాల్లో 200 కిలోమీటర్ల దూరమే ఇప్పటి వరకు అత్యధికంగా ఉంది. కానీ, ఎస్‌-400 గగనతల వ్యవస్థలో వాడే నాలుగు రకాల క్షిపణుల్లో 40ఎన్‌6 రేంజి 400 కిలోమీటర్లు దూరం వెళ్లనుంది. ఈ వ్యవస్థకు భయపడి పాక్‌ తమ ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లు, చైనా నుంచి కొనుగోలు చేసిన విమానాలను సుదూర ప్రదేశాలకు తరలించిందంటేనే దీని ప్రభావం ఏ స్థాయి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వాయుసేన ఆధ్వర్యంలో పాక్, చైనా సరిహద్దుల్లో 1.5 రెజిమెంట్ల చొప్పున మోహరించారు.అప్పుడు ఇవి ప్రదర్శించిన సామర్థ్యాన్ని చూసిన తర్వాత రష్యా నుంచి మరో ఐదు ఎస్‌-400లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవి నవంబర్‌లో భారత్‌కు చేరనున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story