Burning Topic: సుంకాలు తగ్గిస్తేనే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం!

Burning Topic: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భారతీయ ఎగుమతిదారులకు మెరుగైన సుంకాలు లభిస్తేనే ఒప్పందం ఖరారవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Sept 2026 8:37 AM IST
Burning Topic
X

Burning Topic: సుంకాలు తగ్గిస్తేనే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం!

Burning Topic: భారత్-అమెరికా మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందంపై దాదాపు ఏడాదిన్నర కాలంగా చర్చలు కొనసాగుతున్నా ఇప్పటి వరకూ రెండు దేశాలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఇరు దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందపు రూపకల్పనను ప్రకటించినప్పటికీ, సుంకాల విధానాలు, ఇతర నిబంధనల కారణంగా చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఆరంభంలో అమెరికా మన దేశం మీద విధించిన భారీ సుంకాలు చర్చలకు కొంత అవరోధంగా మారాయి. గత ఏడాది ఏప్రిల్ 1న లిబరేషన్ డే పేరుతో భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన అమెరికా.. రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తుందనే సాకుతో మరో 25 శాతం సుంకాలను పెంచి మొత్తం 50 శాతం దాకా తీసుకెళ్లింది.

ఆ తర్వాత ప్రతిష్టంభనకు తెరదించుతూ భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై అంగీకారానికి వచ్చాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని చరిత్రాత్మక ముందడుగుగా ట్రంప్ యంత్రాంగం అభివర్ణించింది. భారతీయ మార్కెట్ తలుపులు అమెరికా ఉత్పత్తుల కోసం తెరుచుకుంటాయన్నారు.

కాగా అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ కీలక డిమాండ్లను తెర మీదకు తెచ్చింది. ప్రధానంగా భారత రైతుల ప్రయోజనాలకు కాపాలన్నదే లక్ష్యంగా ఈ ఒప్పందం ఉండాలని భావిస్తోంది. అమెరికా మార్కెట్‌లో చైనా, వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే భారతీయ ఉత్పత్తులకు తక్కువ సుంకాలు ఉండాలని భారత్ పట్టుబడుతోంది.

గతంలో అమెరికా రద్దు చేసిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లేదా దానికి సమానమైన ప్రత్యేక వాణిజ్య హోదాను భారత్ తిరిగి ఆశిస్తోంది. దీనివల్ల భారతీయ టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులపై అమెరికాలో పన్ను భారం భారీగా తగ్గుతుంది.

రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే ముడి చమురుపై అమెరికా విధించిన ఆంక్షలు మరియు పెనాల్టీ సుంకాల నుంచి శాశ్వత మినహాయింపు లభించాలని భారత్ కోరుతోంది. భౌగోళిక రాజకీయాలప్రభావం తమ ద్వైపాక్షిక వాణిజ్యంపై పడకూడదని వాదిస్తోంది.

భారత్-అమెరికా దేశాలు న్యాయమైన, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య సంబంధాన్ని నిర్మించేందుకు సన్నిహితంగా పనిచేస్తున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య అవగాహనపై ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించామని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 66వ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు.

ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే వాణిజ్య సంబంధాన్ని నిర్మించేందుకు మా రెండు ప్రభుత్వాలు సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని గోర్ వెల్లడించారు. ఇరు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే కుదుర్చుకున్న వాణిజ్య అవగాహనతో పాటు పలు అంశాల్లో వాస్తవమైన పురోగతి సాధించామని చెప్పారాయన. భారత్-అమెరికా మధ్య పురోగతి కేవలం వస్తువుల వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాలేదని గోర్ అన్నారు. ఇరు దేశాలు దాదాపు అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

కాగా దాదాపు ఏడాది కాలంగా వాణిజ్య ఒప్పందం పేరుతో ఊరిస్తూ వస్తున్న అమెరికాకు మన దేశం ఝలక్ ఇస్తోంది. అగ్రరాజ్యం ముందు కొన్ని షరతులు ఉంచబోతోంది. వీరికి అంగీకరిస్తేనే వాణిజ్య ఒప్పందం ఖరారు చేస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్నారు.

అమెరికాతో కుదుర్చుకోబోయే ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా, ఇతర పోటీ దేశాల కంటే మెరుగైన ప్రాధాన్యత సుంకాలను అంగీకరిస్తేనే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వ్యాపార రంగంలో ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న పోటీతో పోలిస్తే, అమెరికా భారత్‌కు తక్కువ సుంకాలను లేదా అనుకూలమైన పన్ను రేట్లను అందించిన వెంటనే ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఖరారు చేస్తామన్నారు. వాణిజ్య ఒప్పందానికి తుది రూపం ఇచ్చే క్రమంలో పీయూష్ గోయల్ ఈ నెలాఖరులో అమెరికా వెళ్లనున్నారు.

భారత్- అమెరికాల మధ్య మార్కెట్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం, వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే వాణిజ్య ఒప్పందం ప్రధాన ఉద్దేశం.

ఈ సుదీర్ఘ చర్చలు ఎగుమతి రంగంలో భారతీయ వ్యాపారులకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికాకు వెళ్లే దేశీయ ఉత్పత్తులపై పన్నుల భారం తగ్గితేనే ఇక్కడి వ్యాపారాలు పుంజుకుంటాయి.

గత జూలైలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా పత్రాలు సిద్ధమయ్యాయని, కేవలం కొన్ని సాంకేతిక కారణాల వల్లే సంతకాల ప్రక్రియ ఆలస్యమవుతోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు.

ముఖ్యంగా అమెరికా 'సెక్షన్ 301' వాణిజ్య విచారణలే ప్రస్తుత అడ్డంకిగా మారాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఎలాంటి విధానపరమైన భేదాలు లేవని, వచ్చే మూడు నాలుగు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చని అమెరికా అప్పట్లో వెల్లడించింది.

కాగా ఇరాన్‌తో భారత్ కొనసాగిస్తున్న సంబంధాలపై అమెరికా గుర్రుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపడం తెలిసిందే..

వివిధ రంగాల్లో ఇరాన్‌తో ఉన్న సుదీర్ఘ మైత్రీబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సంబర్భంగా మోదీ తెలిపారు. దీనిపై అమెరికా విదేశంగా కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు.

ప్రతి దేశానికీ ఒక స్వతంత్ర విదేశాంగ విధానం ఉంటుందని, ప్రపంచంలోని చాలాదేశాలు ఇరాన్‌తో మాట్లాడుతాయని చెప్పారు. అయితే అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్‌కు ఏ దేశమూ సాయం చేయకూడదన్నారు.

తమ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్‌కు ఏ దేశమైనా సహకరిస్తే ఉపేక్షించేది లేదని రూబియో హెచ్చరించారు. భారత్- ఇరాన్ మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందని భావించడం లేదని అభిప్రాయపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story