Burning Topic: భారత్‌ అమెరికా మధ్య బిగ్ డీల్!

Burning Topic: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరింది. రష్యా ఆయిల్, టారిఫ్ చట్టాల నేపథ్యంలో మోదీ-ట్రంప్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది!

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Sept 2026 6:53 AM IST
Burning Topic
X

Burning Topic: భారత్‌ అమెరికా మధ్య బిగ్ డీల్!

Burning Topic: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన కొన్ని చివరి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఇరు దేశాల మధ్య సమగ్ర ఒప్పందం కోసం అధికారిక చర్చలు 2025 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ప్రారంభించారు. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 6న ఇరు దేశాలు ఒక 'మధ్యంతర వాణిజ్య ఒప్పందం' కింద ఒక ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రకటించాయి.

దీని ప్రకారం భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా తన సుంకాలను 25% నుండి 18%కి తగ్గించడానికి అంగీకరించింది. అలాగే రాబోయే ఐదేళ్లలో అమెరికా నుండి 500 బిలియన్ల డాలర్ల విలువైన ఇంధనం, రక్షణ, సాంకేతికత కొనుగోలు చేయడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఈ ఒప్పందాన్ని మొదట 2025 చివరికల్లా లేదా 2026 ఏప్రిల్-మే నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికీ.. రష్యా నుండి భారత్ తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేయడంపై అమెరికా గుర్రుగా ఉండటంతో అనేక అవరోధాలు వచ్చి పడ్డాయి. ఇటీవల రష్యన్ ఇంధనాన్ని ఎత్తున ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే "లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026" భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.

మన దేశ ముడి చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ఇటీవలి నెలల్లో భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 50%కి చేరువైంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. 140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రత కల్పించడం తమ బాధ్యత అని స్పష్టం చేస్తోంది.

అమెరికా తెచ్చిన కొత్త చట్టం మన దేశ ద్వైపాక్షిక సంబంధాలకు సవాలుగా మారింది. తక్కువ ధరకు లభించే రష్యా చమురు భారత దిగుమతి వ్యయాన్ని అదుపులో ఉంచుతోంది. అలాంటి పరిస్థితిలో అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గిస్తే దేశీయంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. రష్యా యుద్ధానికి అందుతున్న ఆదాయాన్ని అడ్డుకోవాలని అమెరికా చూస్తుండగా, భారత్ తన పౌరుల ఇంధన అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ నెలలో ఫ్లోరిడాలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేదికపై మోడీ, ట్రంప్ సమావేశమై వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్తారని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. మోదీ పర్యటన సందర్భంగా కొన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని అమెరికా అధికారులు వెల్లడించారు.

మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ప్రాధాన్యతకు, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొనసాగుతున్న సహకారానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తుది ముసాయిదాపై ఈ పర్యటనలో కీలక ముందడుగు పడే అవకాశం ఉందని చెప్పారు.

గత కొన్ని దశాబ్దాలుగా భారత్-అమెరికా మధ్య వాణిజ్యం అత్యంత క్లిష్టమైన సవాలుతో కూడిన అంశంగా కొనసాగిందన్నారు. ప్రతిపాదిత ఒప్పందం విజయవంతమైతే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మరో స్థాయికి చేరుకుంటాయని చెబుతున్నారు. భారత్‌కు భారీ స్థాయిలో ఇంధన అవసరాలు ఉన్నందున, ఆ అవసరాలను తీర్చేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అంటున్నారు. మోదీ అమెరికా పర్యటనకు ముందే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది

కాగా అమెరికాతో జరగనున్న ఒప్పందంలో మన దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాజీ పడేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేసిన ప్రకారం—పాకిస్తాన్, శ్రీలంక, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో పోలిస్తే, అమెరికా మార్కెట్‌లో భారతీయ ఎగుమతిదారులకు మరింత ప్రాధాన్యత లభించేలా అమెరికా ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని పట్టుబడుతున్నాం.

ఈ ప్రక్రియ ఖరారయ్యే వరకు ఒప్పందం పూర్తి కావడం ఆలస్యమవుతోంది. భారత రైతులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం పాక్షికంగానైనా విదేశీ వస్తువుల కోసం ద్వారాలను తెరవడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ కారణంగా చర్చలు ముందుకు సాగడానికి కొంత సమయం పట్టింది.

అమెరికాకు చెందిన వైద్య పరికరాలు, ఐటీ వస్తువులపై భారత్ లో ఉన్న లైసెన్సింగ్ నిబంధనలను సరళీకృతం చేయడంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. అమెరికా-భారత్‌ ల ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగితే, మన ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా సామాన్య పౌరులు, ఉద్యోగులు, వ్యాపారులకు నేరుగా పలు కీలక ప్రయోజనాలు చేకూరతాయని భావిస్తున్నారు.

2025లో రెండు దేశాల మధ్య వస్తువులు, సేవల మొత్తం వాణిజ్యం ఏకంగా $239.6 బిలియన్ డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. ఇందులో ఒక్క సేవల రంగం వాణిజ్యమే ఏకంగా $90.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అమెరికా మార్కెట్ లో మన దేశానికి చెందిన వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడు, ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచాల్సి వస్తుంది.

ముఖ్యంగా టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్వెలరీ, ఫార్మా, ఇంజినీరింగ్ రంగాల్లో ఆర్డర్లు వెల్లువలా వస్తాయి. దీనివల్ల కంపెనీలు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయడం లేదా ఉన్న ప్లాంట్లను విస్తరించడం ద్వారా నియామకాలను వేగవంతం చేస్తాయి. దీంతో దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరిస్తాయి.

ఎగుమతులను మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రత్యేకంగా ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్ ద్వారా MSMEలకు, ఎగుమతిదారులకు మద్దతు అందిస్తోంది. అమెరికా సుంకాలు తగ్గడం వల్ల మన దేశీయ ఎగుమతులు చైనా, వియత్నాం వంటి ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీపడి భారీ ఆర్డర్లను సాధించగలుగుతాయి.

భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతుల్లో సర్వీసెస్ రంగానిది అత్యంత కీలక పాత్ర. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు టెక్ స్టార్టప్‌లకు అమెరికన్ కార్పొరేట్ కంపెనీల నుంచే ఎక్కువ ప్రాజెక్టులు వస్తుంటాయి. అమెరికాతో ఒప్పంద కుదిరితే కొత్త ప్రాజెక్టుల కాంట్రాక్టులు సులభంగా దక్కుతాయి.

దీని ప్రభావం హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి ఐటీ హబ్‌లలో పనిచేసే డెవలపర్లు, ఇంజినీర్లపై స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త నియామకాలు, మరింతగా వేతనాలు, అమెరికా వెళ్లే అవకాశాలు మెరుగవడం వంటి స్పష్టమైన మార్పులు ఉంటాయి. రెండు దేశాల నడుమ కుదిరే మధ్యంతర వాణిజ్య ఒప్పందాల వల్ల దిగుమతి పన్నులు గణనీయంగా తగ్గుతాయి.

అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెడికల్ పరికరాలు, కొన్ని రకాల వ్యవసాయ ఆధారిత ఆహార పదార్థాలపై పన్నులను సడలించినప్పుడు, ఆ ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌లో తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన నాణ్యత కలిగిన అంతర్జాతీయ ఉత్పత్తులు తక్కువ వ్యయానికే అందుబాటులోకి వస్తాయి.

కాగా విదేశీ ఉత్పత్తులు ఎక్కువగా దేశంలోకి వస్తే కొన్ని రకాల స్థానిక చిన్న పరిశ్రమలకు పోటీ పెరుగుతుంది. ఏయే రంగానికి పన్ను మినహాయింపులు లభిస్తాయనే దానిపైనే వ్యాపారుల లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం మీద ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్