Burning Topic: ట్రంప్ నిర్ణయాలతో భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్!

Burning Topic: ట్రంప్ కఠిన వలస, వీసా నిబంధనలతో భారతీయ విద్యార్థుల డాలర్ కలలు కరుగుతున్నాయి. అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు, దరఖాస్తులు భారీగా పడిపోతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Aug 2026 6:58 AM IST
Burning Topic
X

Burning Topic: ట్రంప్ నిర్ణయాలతో భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్!

Burning Topic: అగ్రరాజ్యంలో చదువుకోవాలని సగటు భారతీయ విద్యార్థి ఆశ. అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ ఉంటారు. అయితే డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని డాలర్ డ్రీమ్స్ కరుగుతున్నాయి... ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యత‌లు స్వీక‌రించిన త‌ర్వాత అమలు చేస్తున్న కఠిన వలస నియంత్రణ విధానాల కారణంగా అమెరికా అంటేనే వెగటు పుడుతోంది..

ఈ నేపథ్యంలో అక్కడి విద్యాసంస్థల్లో ప్రవేశం కోరే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని కామన్‌ ఆప్‌’అనే సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. మునుపటి ఏడాదితో పోలిస్తే 2025–26లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్లలో 15 శాతం తగ్గుదల నమోదయింది.

ఈ సంస్థ సుమారు 1100 అమెరికన్‌ వర్శిటీల్లో అడ్మిషన్ల వ్యవహారాన్ని పరిశీలించి ఈ నివేదిక రూపొందించింది. 2026–27లో మాత్రం అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్లలో పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదిక తెలిపింది. ఇదే మయంలో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులు మార్చి ఒకటి తరువాత పది శాతం పడిపోయినట్లు తెలిసింది.

అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో అగ్రగామిగా ఉన్న భారత్​ నుంచి వచ్చే దరఖాస్తుదారుల తగ్గిపోవడం అక్కడి యూనివర్సిటీలు, కాలేజీలను కూడా కలవరపస్తోంది. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో అత్యధికంగా 3,63,019 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో నమోదయ్యారు.

యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజా డేటా ప్రకారం, కఠినమైన వీసా నిబంధనల వల్ల గత కొన్ని నెలలుగా కొత్త విద్యార్థుల రాక తగ్గడంతో, జూలై నాటికి ఈ సంఖ్య 3,38,230 కి చేరింది. అమెరికాలో చదువుకుంటున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 30 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు.

ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వీసా నియమ నిబంధనలు కఠినతరం కావడంతో ఈ ఏడాది అమెరికా చదువుల కోసం విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులు 1.1 లక్షలు తగ్గిపోతాయని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేటర్స్, జేబీ ఇంటర్నేషనల్‌లు ఇటీవల ప్రకటించాయి.

ఈ సంస్థల అంచనాల ప్రకారం 2025–26 ఫాల్‌ అడ్మిషన్లకు 11.69 లక్షల దరఖాస్తులు అందితే.. ఈ ఏడాది అది 10.57 లక్షలకు పడిపోనుంది. 2025–26లో విదేశీ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందించిన తోడ్పాటు విలువ ఏకంగా 4177 కోట్ల డాలర్లు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 3837 కోట్ల డాలర్లకు పడిపోనుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటంతో అమెరికాలో చదువు, వసతి ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఫీజులు పెరగడంతో విద్యార్థులు పెద్ద మొత్తంలో అప్పులు చేయాల్సి వస్తోంది.

చదువు అయ్యాక ఉద్యోగం దొరకడంపై ఉన్న అనిశ్చితి వల్ల ఇంత రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. అమెరికాలో నిబంధనలు కఠినం కావడంతో భారతీయ విద్యార్థులు జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, బ్రిటన్ వంటి యూరోప్ దేశాల వైపు చూస్తున్నారు.

దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా సుమారు 3.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, అలాగే వేలాది ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణుల నివేదికలు హెచ్చరిస్తున్నాయి అమెరికా ప్రధానంగా భారతదేశం, చైనా నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడంలో అగ్రగామిగా ఉంది.

విద్యార్థులను కోల్పోవడం వలన అమెరికాలో 40,000 ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థి వీసాపై వచ్చి గ్రాడ్యుయేషన్‌ తరువాత అక్కడే కొంతకాలం పనిచేసేందుకు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ - ఓపీటీ అవకాశమిస్తుంది.

ఇందులో భాగంగా పన్నెండు నుంచి 24 నెలలపాటు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. చదువు తరువాత అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పించిన ఓపీటీ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో సవరించింది.

విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. అంతేకాకుండా.. ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు వసూలు చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. ఇది అమల్లోకి వస్తే అగ్రరాజ్యలోకి వచ్చే మధ్యతరగతి విద్యార్థులకు భారంగా మారనుంది

మరోవైపు అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న వారి విషయంలో ట్రంప్ యంత్రాంగం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హెచ్‌1బీ వీసా దరఖాస్తుదారుల నుంచి 1,03,265 డాలర్లు.. అంటే సుమారు రూ.86 లక్షలకు పైగారుసుమును వసూలు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదిత అదనపు రుసుమును దరఖాస్తు దాఖలు చేసే సమయంలో చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.. ఈ ప్రతిపాదలకు తాజాగా ఈ నిర్ణయానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మద్దతు తెలిపారు. ఒక అమెరికన్ సంస్థకు కార్మికులు అవసరమైతే అమెరికన్లనే నియమించుకుని, వారికి శిక్షణ ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించారు.

అమెరికన్ కంపెనీలు భారత్ నుంచి ఏటా వేలాది మంది ఉద్యోగులను నియమించుకోవడానికి సాంకేతిక రంగ సంస్థలు హెచ్‌1బీ మీదే ఆధారపడతాయి. రోజు రోజుకీ కఠినంగా మారుతున్న నిబంధనలు భారతీయులకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టనున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story