Burning Topic: భారత్ జోలికి వస్తే బూడిదే.. షాక్ లో ప్రపంచ దేశాలు?
Burning Topic: భారత్ అమ్ములపొదిలో 190 అణ్వాయుధాలు. సిప్రీ తాజా నివేదిక ప్రకారం భారత్ రక్షణ సంసిద్ధతలో కీలక మార్పులు.
Burning Topic: భారత్ జోలికి వస్తే బూడిదే.. షాక్ లో ప్రపంచ దేశాలు?
Burning Topic: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి దేశం సైనిక పరంగా సామర్థ్యాన్ని పెంచుకునే అంశంపై దృష్టి సారించాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ మీద అమెరికా- ఇరాన్ దాడులతో అనిశ్చిత వాతావరణం పెరగడం తెలిసిందే. ప్రపంచ భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్, చైనాతో మన దేశానికి ఘర్షణలు పెరిగాయి. భారత్ కూడా అణ్వాయుధ విధానానికి సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలో స్వీడన్‌కు చెందిన ఆయుధ నియంత్రణ పరిశోధనా సంస్థ 'స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - సిప్రి' కీలక నివేదిక విడుదల చేసింది. సిప్రి ఇయర్‌బుక్ 2026 రిపోర్ట్ ప్రకారం భారత్ దగ్గర ఉన్న అణ్యాయుధాలలో 12 మోహరింపు స్థితిలో ఉన్నాయి.. అంతే కాదు మన దేశం దగ్గర ఇప్పటికే 190 అణ్వాయుధాలు ఉన్నాయని ఈ నివేదిక విడుదల చేసింది.
భారత్ ఇప్పటి వరకూ అణ్వాయుధాల విషయంలో "నో ఫస్ట్ యూజ్" అంటూ మొదటగా అణు దాడి చేయకూడదు అనే విధానానికి కట్టుబడి ఉంది. శత్రు దేశాలు అణు దాడికి పాల్పడితే మాత్రమే, ప్రతీకార చర్యగా మాత్రమే, భారత్ తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుంది. కానీ దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు పక్కన పెట్టింది మన దేశం. ఇప్పటి వరకూ అణు వార్‌హెడ్‌లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేర్వేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానాన్ని ఉండేది. భారత అణు చరిత్రలో ఈ వార్‌హెడ్‌లను కేవలం నిల్వ ఉంచడమే కాకుండా, ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు వర్గీకరించడం ఇదే మొదటిసారి. శాంతిసమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచడం, సముద్రంలో నిరంతర నిఘా లాంటి చర్యలు భారతదేశ రక్షణ సంసిద్ధతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయని సిప్రి నివేదిక చెబుతోంది. ఇప్పుడు ఆ వ్యూహాన్ని మార్చిన భారత్ కొన్నింటిని నేరుగా సంసిద్ధంగా ఉంచిందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలు, పొరుగు దేశాలతో ముప్పును దృష్టిలో పెట్టుకోని భారత్ తన అణ్వాయుధ సామర్థ్యానికి మరింత పదును పెట్టింది. మన దేశం దగ్గర పమర్థవంతమైన అణ్వాయుధాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆయుధ పోటీలో పాల్గొనడానికి కాకుండా, దురాక్రమణదారులను నిరోధించడానికే ప్రాధాన్యత ఇచ్చాం. మన అణుసామర్థ్యం పరిమితమైనప్పటికీ, దీన్ని ఆయుధాల పోటీ కోసం కాకుండా, దేశ రక్షణ కవచంగా మాత్రమే భావిస్తుంది. మన దేశ త్రివిధ దళాలకు అణు సామర్థ్యం ఉంది. అంటే భూమి, ఆకాశం, సముద్రం- ఈ 3 మార్గాల ద్వారా అణుదాడి చేయగల శక్తి ఉందన్నమాట. భారత నౌకదళంలో అరిహంత్ తరగతి అణు జలాంతర్గాములు, వైమానిక దళంలో మిరాజ్- 2000, జాగ్వార్ సహా రఫేల్, సుఖోయ్- 30 MKI యుద్ధవిమానాలు అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలవు. ఇక భూ ఉపరితలం నుంచి అగ్ని, పృథ్వీ, నిర్భయ్, బ్రహ్మోస్ వంటి క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి.
సిప్రి వార్షిక నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్ వద్ద అణు వార్‌హెడ్‌ల సంఖ్య 190. మన పొరుగు దేశం పాకిస్థాన్ దగ్గర వద్ద 170 ఉన్నాయి. 2025లో ఇరు దేశాలు తమ అణ్వాయుధాలను మరింత ఆధునీకరించుకున్నాయి. చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. ప్రస్తుతం రష్యా వద్ద 5,420, అమెరికా వద్ద 5,042 అణు వార్‌హెడ్లు ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు తొమ్మిది కాగా, వాటి వద్ద మొత్తం 12,187 అణ్వాయుధాలు ఉన్నట్లు నివేదిక వివరించింది. వీటిలో 4,012 వార్ హెడ్స్ మోహరించిన స్థితిలో ఉన్నాయి. ఫ్రాన్స్ 370, యూకే 225, ఇజ్రాయెల్ 90, ఉత్తరకొరియా 60 అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. అణ్వాయుధాల విషయంలో ప్రధానంగా చైనాను భారత్ దృష్టిలో ఉంచుకున్నప్పటికీ ప్రత్యర్థి పాకిస్థాన్ ద్వారా కలిగే ముప్పును తక్కువగా అంచనా వేయడం లేదని నివేదిక విశ్లేషించింది.
గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ మీద భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఇరు దేశాలు ప్రత్యక్ష సైనిక ఘర్షణతో పాటు సైబర్ ఆపరేషన్లను కూడా ఏకకాలంలో ఉపయోగించాయని సిప్రి నివేదిక గుర్తుచేసింది. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని భారత్ ఇప్పుడు తన అణు సంసిద్ధతను పెంచిందని చెబుతున్నారు. దక్షిణాసియాలో సైనిక పోటీ కేవలం సంప్రదాయ ఆయుధాలకే పరిమితం కాలేదని లాంగ్ రేంజ్ మిస్సైళ్లు, ఆర్మ్‌డ్ డ్రోన్లు, ఏఐ ఆధారిత వ్యవస్థలు, సైబర్ సామర్థ్యాల వైపు వేగంగా మళ్లుతోందని సిప్రి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సిప్రి ఒక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు అణ్వాయుధాల్ని రక్షణ వలయాలుగా కాకుండా, బల ప్రదర్శనకు ఉపయోగిస్తున్నాయని పేర్కొంది. ఇక్కడే అణ్వాయుధ దేశాల మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు ప్రపంచ భద్రతకు కొత్త సవాళ్లను విసురుతున్నట్లు తెలిపింది.
మరోవైపు ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. రక్షణ వ్యయం విషయంలో భారత్ కంటే ముందు అమెరికా, చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. 2025లో భారత సైనిక వ్యయం 8.9 శాతం వృద్ధితో 92.1 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోని టాప్-15 సైనిక వ్యయ దేశాల్లో పాకిస్థాన్‌కు చోటు దక్కలేదు. 2021-25 మధ్య కాలంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ 8.2 శాతం వాటాతో నిలిచింది. పాకిస్థాన్ 4.2శాతం వాటాతో ఐదో స్థానంలో ఉంది. పాక్‌తో పోలిస్తే భారత్ దాదాపు రెట్టింపు పరిమాణంలో ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు నివేదికలో సిప్రీ వివరించింది.2021-25 కాలంలో ప్రధాన ఆయుధాలను పొందిన 162 దేశాలను కూడా SIPRI గుర్తించింది. ఇందులో ఉక్రెయిన్, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్ అతిపెద్ద దేశాలుగా ఉన్నాయి. ఈ కాలంలో జరిగిన మొత్తం ఆయుధ దిగుమతుల్లో వీటి వాటా 35 శాతంగా ఉందని పేర్కొంది.




