Burning Topic: అభివృద్ధిలో ఆగని భారత్.. దూసుకెళ్తున్న జీడీపీ!

Burning Topic: ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8 శాతానికి భారత జీడీపీ వృద్ధి రేటు. ప్రపంచంలోనే టాప్‌లో నిలిచిన భారత్. ప్రధాని మోదీ హర్షం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Sept 2026 8:16 AM IST
Burning Topic
X

Burning Topic: అభివృద్ధిలో ఆగని భారత్.. దూసుకెళ్తున్న జీడీపీ!

Burning Topic: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి మధ్య కూడా భారత్ అత్యంత వేగంగా దూసుకుపోతోంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, భౌగోళిక-రాజకీయ అస్థిరతలు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పురోగతిని సాధించింది ఇదేదో రాజకీయ ప్రకటన కాదు.. జాతీయ గణాంకాల కార్యాలయం - ఎన్‌ఎస్‌వో విడుదల చేసిన తాజా నివేదికలోని విశేషాలు.

ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 7.8 శాతంగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. గత ఏడాది ఇదే మొదటి త్రైమాసికంలో జీడీపీ గ్రోత్ 6.9 శాతంగా మాత్రమే ఉంది.

2025-26 మొదటి త్రైమాసికంలో రూ.75.46 లక్షల కోట్లుగా ఉన్న రియల్ జీడీపీ, ఈ ఏడాది రూ. 81.36 లక్షల కోట్లకు చేరిందని ఎన్‌ఎస్‌వో తెలిపింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా సేవల రంగం, తయారీ రంగం చూపించిన ప్రతిభ భారత ఆర్థిక రథాన్ని పరుగులు తీయించింది.

2026 తొలి త్రైమాసికంలో ప్రపంచ సగటు ఆర్థిక వృద్ధి రేటు 3.1% గా నమోదైంది. ఇదే సమయంలో భారత్ 7.8%.. అంటే ప్రపంచంలో మన దేశమే టాప్. ఇతర పెద్ద దేశాలు మనకన్నా వెనుకంజలో ఉన్నాయి. చైనా 4.3%.. అమెరికా 2.1%.. బ్రిటన్ 1.2%.. యూరోజోన్ 0.4% కాగా జర్మనీ - 0.2% ఆర్థిక మందగమనంలో ఉంది..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ తొలి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవచ్చని అంచనా వేసింది. ఈ అంచనాలను సైతం తలకిందులు చేస్తూ 7.8 శాతంతో రికార్డు స్థాయి వృద్ధిని సాధించాం.

పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం, ప్రైవేట్ వినియోగం పెరగడం, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయడమే ఈ ఊహించని వృద్ధికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ మందగమనాన్ని ఎదుర్కొంటున్న వేళ, ఈ ఫలితాలు దేశ ఆర్థిక పునాదుల బలానికి, పెట్టుబడిదారుల్లో నెలకొన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మన జీడీపీ అంచనాలకు మించి వృద్ధి నమోదు చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

దేశ ప్రజల సంకల్ప బలం, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందంటూ కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సదస్సు నుంచి వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

కొవిడ్‌ కాలం 2020 నుంచి ఇప్పటి వరకు ఎక్కడా పూర్తి స్థాయిలో స్థిరత్వం కనిపించలేదని, సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది.

అయినా భారత్‌ పురోగమిస్తోందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 7.8% వృద్ధి గొప్ప విషయం. ఇది దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు మోదీ. కాగా దేశంలో జూట్‌ కీ గూంజ్‌ వ్యాప్తి చేస్తున్నవారి మాటలు నమ్మొద్దని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.

మరోవైపు ప్రజలు దేశీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ కోరారు. మనం స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటే.. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనే విశ్వాసం ఉందని తెలిపారు మోదీ పేర్కొన్నారు.. విధానం సరైనది.. సంకల్పం స్పష్టంగా ఉంది..

స్థానికంగా తయారైన వస్తువులు, సేవలు ఎంత ఎక్కువగా ఎంచుకుంటే.. దేశం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుందన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఐక్య శక్తితో దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని తన సందేశంలో తెలిపారు.

ఈ సందర్భంగా ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ నినాదాన్ని పాటించాలని కోరారు ప్రధాని మోదీ. పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా ఉండండి. ‘భారత్‌లోనే వివాహం చేసుకోండి’ అనే మంత్రాన్నే మనం పాటిద్దాం. అవసరం లేకపోతే బంగారాన్ని కొనడం మానుకోండి అంటూ పిలుపునిచ్చారు

భారత జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 7.8 శాతంగా నమోదు కావడంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బలమైన పనితీరుకు కారణం భారత ప్రజల కృషి అని తెలిపారు. దేశ ప్రజల కృషి.. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ చురుకైన నిర్వహణతో కలిసి ఫలితాలనిస్తున్నాయన్నారు.

మన పౌరులందరికీ ఆర్థిక అవకాశాలను మరింతగా విస్తరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే వల్లే 7.8 శాతం జీడీపీ వృద్ధి సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్.​

దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాని తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను మార్చేశాయన్నారు. దేశాన్ని తయారీ రంగానికి కేంద్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన విధానపరమైన సంస్కరణలు, వ్యాపార నిర్వహణను సులభతరం చేసేలా కల్పించిన అనుకూల వాతావరణం పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మార్చాయన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story