Burning Topic: పాకిస్తాన్ చైనాకు భారత్ డెడ్లీ వార్నింగ్
Burning Topic: భారత భూభాగాలైన జమ్మూ కాశ్మీర్, లదాక్ అంశాల్లో చైనా-పాకిస్థాన్‌ల జోక్యాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
Burning Topic: పాకిస్తాన్ చైనాకు భారత్ డెడ్లీ వార్నింగ్
Burning Topic: చైనా, పాకిస్థాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ బీజింగ్ పర్యటనకు వెళ్లారు. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వారు భేటీ అయ్యారు. అమెరికా-ఇరాన్ వివాదంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ప్రాంతీయ స్థిరత్వం, మరియు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ రక్షణపై ఇరు దేశాల నేతలు ప్రత్యేకంగా చర్చించారు. శాంతి పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్న ఇస్లామాబాద్‌ను జిన్‌పింగ్ అభినందించారు. పాకిస్థాన్‌తో తమకు ఉన్న విడదీయలేని మైత్రి బంధాన్ని గుర్తు చేస్తూ షెహబాజ్‌ను తన పాత మిత్రుడిగా అభివర్ణించారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసం, ఆచరణాత్మక సహకారాలు పాక్, చైనాల అభివృద్ధిని బలపరిచాయి. స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాక్‌కు చైనా మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఈ చర్చల్లో షి జిన్‌పింగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా, పాకిస్థాన్‌తో చైనాకు ఉన్న విడదీయరాని సాంప్రదాయ స్నేహంఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం పాకిస్థాన్, చైనాల మధ్య మొత్తం 15 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ, వ్యవసాయం, ఇండస్ట్రియలైజేషన్, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలలో ఇరు దేశాల కంపెనీల మధ్య బలమైన ఒప్పందాలు జరిగాయి. పాకిస్థాన్-చైనా B2B ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్' ద్వారా సుమారు 7 బిలియన్ డాలర్ల విలువైన కొత్త పెట్టుబడుల అవగాహన ఒప్పందాలు కుదిరాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ - CPEC రెండో దశను మరింత వేగవంతం చేయడంపై చర్చించారు. చైనా యొక్క 15వ పంచవర్ష ప్రణాళికను పాకిస్థాన్ ప్రణాళికలతో అనుసంధానించాలని నిర్ణయించారు. పాకిస్థాన్‌లో పనిచేస్తున్న చైనా కార్మికులు, ప్రాజెక్టులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసే అంశంపై ఇరుపక్షాలు చర్చించాయి.
ఇంత వరకూ బాగానే ఉన్నా.. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరి నాయకులు ఉమ్మడి ప్రకటనలో జమ్మూకశ్మీర్ ప్రస్తావనను తీసుకురావడమే ఇందుకు కారణం. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల విషయానికొస్తే, వాటిలో కొన్ని భారత్ భూభాగంలో ఉన్నాయి. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు గతంలోనూ, ఇప్పుడు కూడా భారతదేశంలో అంతర్భాగంగా, విడదీయరాని భాగంగానే ఉంటాయి. దీనిపై వ్యాఖ్యానించే హక్కు మరే దేశానికీ లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తూ ఈ భూభాగాలపై పాకిస్థాన్ అక్రమ, బలవంతపు ఆక్రమణను బలపరిచే లేదా చట్టబద్ధం చేసే ఏ చర్యలనైనా గట్టిగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ అనేది చైనా 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్' లో భాగమైన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఇది పాకిస్థాన్‌లోని గ్వాదర్ ఓడరేవును చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతూ 3,000 కిలోమీటర్ల రోడ్లు, రైల్వేల ఇంధన ప్రాజెక్టుల నెట్‌వర్క్. దీని ఉద్దేశ్యం పాకిస్థాన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, చైనాకు అరేబియా సముద్రానికి ప్రత్యక్ష మార్గాన్ని అనుసంధానించడం 3,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ భారీ కారిడార్ పనులు 2015లో ప్రారంభమయ్యాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో స్థానిక ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత, చైనా పౌరులపై జరుగుతున్న ఉగ్రవాద దాడులు ప్రధాన అడ్డంకిగా మారాయి.. ఈ కారిడార్ భారతదేశ అంతర్భాగమైన, ప్రస్తుతం పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళుతుంది. ఇది ఈ కారణంగా భారత్ మొదటి నుంచీ చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను వ్యతిరేకిస్తోంది.
చైనా, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు జలవనరుల సహకారం అనే ప్రస్థావనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రెండు దేశాల మధ్య ఎలాంటి సరిహద్దు లేనప్పుడు 'సరిహద్దు జలవనరుల సహకారం' అనే ప్రశ్నే తలెత్తదు. పాకిస్థాన్, చైనాల మధ్య జరిగిన 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ గుర్తించలేదని తెలిపింది స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై పాకిస్థాన్ ప్రతినిధులు చైనాకు వివరించారు. దీనిపై చైనా స్పందిస్తూ.. ఇది చరిత్ర వదిలివెళ్లిన సమస్య అని.. దీన్ని ఐక్యరాజ్యసమతి, భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పేర్కొంది. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని భారత్ మొదటి నుండి తిప్పికొడుతూనే ఉంది. ఈ అంశం పూర్తిగా భారత్-పాక్ మధ్య ఉన్న ద్వైపాక్షిక విషయమని, ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ తన స్థిరమైన వైఖరిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ గౌరవించాలని పాకిస్థాన్ కోరింది. తజికిస్థాన్ రాజధాని దుషాన్బేలో జరిగిన అంతర్జాతీయ జల సదస్సులో పాకిస్థాన్ వాతావరణ, పర్యావరణ సమన్వయ శాఖ మంత్రి డాక్టర్ ముసాదిక్ మాలిక్ మాట్లాడుతూ ఉమ్మడి జల వనరులను రాజకీయం చేయడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సరిహద్దు నదులను ప్రభావితం చేసే ఏకపక్ష చర్యలు జల భద్రత, ఆహార ఉత్పత్తి, వాతావరణ స్థితిస్థాపకతకు సంబంధించిన తీవ్రమైన ప్రపంచ సవాళ్లను సృష్టించగలవని అన్నారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా, పాకిస్థాన్‌పై భారత్ పలు ప్రతీకార చర్యలు తీసుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని పాకిస్థాన్ తిరస్కరించింది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన నీటి ప్రవాహాన్ని ఆపే ఏ చర్యలనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొంది.




