Off The Record: నెల్లూరు మేయర్ పీఠం దక్కేది ఎవరికి!
Off The Record: నెల్లూరు మేయర్ పీఠం రేసులో అధికార కూటమి, వైసీపీ మధ్య తీవ్ర ఉత్కంఠ. తెరపైకి వస్తున్న పలువురు నేతల పేర్లు, వ్యూహ ప్రతివ్యూహాలు.
Off The Record: నెల్లూరు మేయర్ పీఠం దక్కేది ఎవరికి!
Off The Record: రాజకీయ రాజధానిగా భావించే నెల్లూరులో మేయర్ అభ్యర్ధిత్వం.. అధికార, ప్రతిపక్షంలో తీవ్ర ఉత్కంఠను రేపుతోందట. నెల్లూరు ప్రథమ పౌరుడు అంటే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినంత. దీంతో మేయర్ పీఠం కోసం కూటమి, వైసీపీ నాయకులు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నారట. రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ.. ఓసీ జనరల్ అయినప్పటికీ తమ అభ్యర్థి, ప్రస్తుత నెల్లూరు డిప్యూటీ మేయర్ బీసీ నాయకుడు రూప్ కుమార్ యాదవ్‌కే మేయర్ సీటు అంటూ అధికార పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిందట. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మేయర్ అభ్యర్థిత్వం తమ పార్టీకే దక్కాలని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారట. నగరానికి ప్రాతినిత్యం వహిస్తున్న మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతోపాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు కూడా తమకున్నాయంటూ రూప్ కుమార్ అనుచరులు చెబుతున్నారట.
ఇదే సమయంలో మరో ప్రధాన నేత మరో పొలిటికల్ మైండ్ గేమ్ మొదలు పెట్టారట. అధికార పార్టీ మేయర్ అభ్యర్థి రూప్ కుమార్‌తో సాన్నిహిత్యం కలిగినప్పటికీ.. రాజకీయ లక్ష్యసాధనలో అధినేత నుంచి కొన్ని అడ్డంకులను తొలగించుకునేందుకు మరికొందరు అభ్యర్థులను తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోందట. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ రూప్ కుమారే రానున్న ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా అధికార పార్టీ ప్రధాన నేతలు భావిస్తున్నప్పటికీ.. మొదలైన ట్విస్ట్ ఎలాంటి పరిణామానికి దారితీస్తుందో అనే చర్చ అధికార పార్టీ నేతల్లో కొనసాగుతోందట. ఇక కొత్తగా మేయర్ పోటీకి పలువురి పేర్లు పొలిటికల్ కారిదార్లో వినిపిస్తున్నాయట. ఇందులో డాక్టర్ జెడ్ శివప్రసాద్, కోడూరు కమలాకర్ రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి రెండో కుమారుడు రంగమయూర్ రెడ్డితోపాటు నారాయణ విద్యాసంస్థల నిర్వహకులుగా ఉన్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న వేమిరెడ్డి పట్టాభిరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయట. ప్రస్తుత నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా చెబుతున్న కేతన్‌రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చిందట. ఇదే సమయంలో మైనార్టీ వర్గాలకు చెందిన కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు తమకే ఈసారి పీఠం దక్కేలా చూడాలంటూ రాజకీయ వేదికలపై తమ వాదనలు వినిపిస్తున్నారట. దీంతో అధికార పార్టీలో ప్రధానంగా ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తున్నప్పటికీ కొత్తగా మరికొందరి పేర్లు తెరపైకి రావడంతో ఇప్పుడు అధికార పార్టీలోనూ మేయరు పీఠంపై ఉత్కంఠ నెలకొందట.
నెల్లూరు మేయర్ పీఠం జనరల్ అయితే దివంగత ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఏసీగా పిలిచే ఆనం చెంచు సుబ్బారెడ్డి అంటూ వైసీపీలో విస్తృత ప్రచారం జరుగుతోందట. ఏసీ అభ్యర్థిత్వం కోసం ఇప్పటికే పలువురు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనూ చర్చించారట. నెల్లూరు నగర రాజకీయాలలో ఏసీ సుబ్బారెడ్డి విస్తృత ప్రజా సంబంధాలు కలిగి ఉన్నారట. ఏసీ మేయర్ అభ్యర్థి అయితే పార్టీలకతీతంగా నగరంలో సానుభూతి వస్తుందని వైసీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోందట. ఇప్పటివరకు వైసీపీలో పలువురు అభ్యర్థుల పేర్లు వినిపించినప్పటికీ ప్రధాన నేతలు ఏసీ అభ్యర్థిపై మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు నెల్లూరు నగర మేయర్ పీఠంపై ఈసారి సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులు రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో ప్రముఖులు పలువురు పారిశ్రామికవేత్తల పిల్లలతోపాటు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు నేరుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు చెందిన ఓ నాయకుడు కచ్చితంగా తాను పోటీ చేస్తానంటూ ఇటీవల పలువురు మైనార్టీ వర్గాల నేతలతో చెబుతున్నారట. కూటమిలో ఉన్న కొందరు యువ నేతలు.. మేయర్ అభ్యర్థి రేసులో తాము కూడా ఉన్నామని సంకేతాలు పంపుతున్నారట. కూటమి పొత్తులో అవకాశం వస్తే జనసేన, బీజేపీకి చెందిన పలువురు యువ నాయకులు ప్రధాన నేతలు సైతం అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. మేయర్ పదవికి రిజర్వేషన్ల ఖరారు కానప్పటికీ... ఆ పీఠం కోసం వ్యూహాత్మక రాజకీయ పరిణామాలు సర్వత్ర ఉత్కంఠను రేపుతున్నాయట. ఇంతకీ అధికార కూటమిలో మేయర్ అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందో..? ప్రతిపక్ష వైసీపీ నుంచి పోటీలో ఎవరు ఉంటారోనన్నది ఉత్కంఠగా మారింది.




