Off The Record: కడప సైకిల్ పార్టీలో మేయర్ సెగ.. టికెట్ దక్కేదెవరికి?
Off The Record: కడప మేయర్ పీఠం కోసం టీడీపీలో ఆశావహుల పోటీ పెరిగింది; రిజర్వేషన్ల ఆధారంగా శ్రవణ్‌రాజ్ రెడ్డి, నజీముద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి.
Off The Record: కడప సైకిల్ పార్టీలో మేయర్ సెగ.. టికెట్ దక్కేదెవరికి?
Off The Record: కడప మేయర్ పీఠంపై టీడీపీలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుటుంబానికి చెందిన శ్రవణ్‌రాజ్ రెడ్డి ఒకరన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. అయితే.. తాను ఎవరిని అభ్యర్థిగా పార్టీ నిర్ణయిస్తే వారి గెలుపు కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెబుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. చివరకు అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఓసీ రిజర్వేషన్ వస్తే రెడ్డి సామాజికవర్గం నుంచి శ్రవణ్‌రాజ్ రెడ్డితోపాటు ఆలంఖాన్‌పల్లి లక్ష్మిరెడ్డి కుటుంబం నుంచి ఉమాదేవి పేరు కూడా ప్రధాననంగా ఉంది. ఇక మేయర్ పదవి కోసం ఆర్థిక, రాజకీయ, సామాజిక బలం ఉన్న అభ్యర్థికే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్న ప్రచారం కూడా ఉంది. ముస్లిం మైనారిటీలకు అవకాశం దక్కితే మాత్రం పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
టీడీపీ నేత, గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అమీర్ బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఆయన మేయర్ అభ్యర్థిత్వంపై ఎంతవరకు సీరియస్‌గా ముందుకు వస్తారన్న దానిపై కూడా పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే వర్గానికి దగ్గరగా ఉన్న పట్టణ టీడీపీ అధ్యక్షుడు మన్సూర్ కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు.
పార్టీలో సీనియర్టితోపాటు సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగా ఉన్న డాక్టర్ నజీముద్దీన్ ప్రయత్నాలు సీరియస్‌గా చేస్తున్నారు. డాక్టర్ షేక్ నజీముద్దీన్ పేరు కూడా మేయర్ రేసులో బలంగా వినిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నానని ఆయన అనుచరులు చెబుతున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్..
నజీముద్దీన్ తండ్రిని ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరగా ఆయన సి.రామచంద్రయ్యకు అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పటినుంచీ ఆ కుటుంబం నగర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. సంఘం బీడీ సంస్థ పేరుతో చేపడుతున్న సేవా కార్యక్రమాలతో నగరంలోని వివిధ వర్గాలతో సంబంధాలు ఉన్నాయని, మైనారిటీ వర్గాలతోపాటు అన్ని సామాజిక వర్గాల్లో తనకు పరిచయాలు సత్సంబంధాలు ఉన్నాయని నజీముద్దీన్ వర్గం చెబుతోంది.
అందుకే మేయర్ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్టానం తన వైపు మొగ్గు చూపుతుందన్న ధీమాతో నజీముద్దీన్ ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మిరెడ్డి కుటుంబం నుంచి ఉమాదేవి. ఇక కడప కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్‌గా నిలిచిన ఆలం ఖాన్ పల్లి లక్ష్మిరెడ్డి కుటుంబానికి కూడా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవి పేరు కూడా ఆశావహుల జాబితాలో బలంగానే వినిపిస్తోంది.
కార్పొరేషన్‌లో టీడీపీకి ఉన్న ప్రాతినిధ్యం, కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం తమకు అనుకూలంగా మారుతుందని ఆమె వర్గం భావిస్తోంది. ఇక మేయర్ పదవి ఎస్సీ రిజర్వేషన్‌కు కేటాయిస్తే మరో పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మాజీ శాప్ డైరెక్టర్ జైచంద్ర కుమార్తె దీప్తి కూడా పార్టీ అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
అంటే... రిజర్వేషన్ ఓసీ అయితే ఒక సమీకరణం. మైనారిటీలకు అవకాశం వస్తే మరో సమీకరణం. ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఇంకో కొత్త సమీకరణం! కడప మేయర్ పీఠం కోసం ఆశావహులు ఎవరికి వారు తమ రాజకీయ బలం, ప్రజా పరిచయాలు, పార్టీతో ఉన్న అనుబంధాన్ని అధిష్టానం ముందు ఉంచుతున్నారు. కానీ చివరి నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానానిదే. రిజర్వేషన్ ఏ వర్గానికి వస్తుంది..? ఆ తర్వాత పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుంది..? ఎమ్మెల్యే మాధవి అభిప్రాయం ఎంతవరకు ప్రభావం చూపుతుంది..?
అధిష్టానం రాజకీయ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తుందా..? లేక ప్రత్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక, రాజకీయ, ప్రజాబలం ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తుందా..? కడప మేయర్ పీఠం కోసం మొదలైన ఈ పోటీ.. రిజర్వేషన్ ప్రకటనతో మరింత రసవత్తరంగా మారే అవకాశముంది. ఎవరి పేరు ఖరారవుతుంది..? ఎవరి రాజకీయ అదృష్టం మారుతుంది..? కడప మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది..? తుది నిర్ణయం వరకు... సస్పెన్స్ తప్పదు మరి.




