Off The Record: జగన్ తలకు కొత్త తలనొప్పి
Off The Record: కర్నూలు జిల్లా వైసీపీలో పెరిగిన గ్రూపు రాజకీయాలు మరియు పార్టీ అంతర్గత పరిస్థితులపై విశ్లేషణ.
Off The Record: జగన్ తలకు కొత్త తలనొప్పి
Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోటగా చెప్పవచ్చు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో వైసీపీకి తిరుగులేదు. 2014, 19 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి కర్నూలు జిల్లాను స్వీప్ చేసింది. అయితే 2024 ఎన్నికల్లో అంతటి ప్రభావం చూపించలేకపోయింది. ఎన్నికల సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా పార్టీని దెబ్బ తీశాయంటారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో కర్నూలులో అనుకున్న స్థానాలు గెలవలేకపోయింది. ఎన్నికల తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయాలు సొంత పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తెరతీసింది.
కర్నూలు అసెంబ్లీలో వైసీపీ నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి ఇంచార్జీగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక ఎస్వీ మోహన్ రెడ్డి.. కర్నూలు నియోజకవర్గం అభివృద్ధి కోసం అని టీడీపీలో చేరారు. 2019 టీడీపీలో టికెట్ రాకపోవడంతో మోహన్ రెడ్డి తిరిగి వైసీపీలో చేరారు. అప్పటికే హఫీజ్ ఖాన్‌కు జగన్ టికెట్ ప్రకటించడంతో ఆయన గెలుపు కోసం మోహన్ రెడ్డి పనిచేయాల్సివచ్చింది. 2019 హఫీజ్ ఖాన్ కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన పనితీరు సరిగా లేదని చెప్పి 2024 ఎన్నికల సమయంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అహమ్మద్ అలీ ఖాన్ వైసీపీలో చేరారు. అలీఖాన్ కూడా కర్నూలు ఎమ్మెల్యే సీటు కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే ఐఎఎస్ అధికారి ఇంతియాజ్‌ను కర్నూలు అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. అప్పటికే మూడు గ్రూపులుగా విడిపోయిన నాయకులు ఇంతియాజ్‌కు పూర్తి స్థాయిలో సహకరించలేదన్న టాక్ లేకపోలేదు.
ఎన్నికలు ముగిశాక ఇంతియాజ్‌ను ఇంచార్జీగా కొనసాగించారు. అయితే కొద్ది నెలల్లోనే ఇంచార్జీ పదవికి, పార్టీకీ ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత కర్నూలు ఇంచార్జీగా ఎస్వీ మోహన్ రెడ్డిని నియమించారు. అలీ ఖాన్‌ను కర్నూలు నగర అధ్యక్షుడుగా నియమించారు. మొదట్లో ఈ నాయకులు కలిసి పనిచేసినట్లు కనిపించినప్పటికీ.. రానురాను మైనారిటీ నాయకులను మోహన్ రెడ్డి దూరం పెట్టారని, పార్టీ కార్యక్రమాలకు కూడా తమను పిలవడం లేదన్న ప్రచారం నడిచింది. మైనారిటీలు ఎక్కువగా ఉన్న కర్నూలులో తమను దూరం పెట్టడం కరెక్ట్ కాదని, తాము కూడా నియోజకవర్గంలో తిరుగుతామని బహిరంగంగా మాట్లాడారు. దీనిపై మోహన్ రెడ్డి లైట్ తీసుకోవాలని చెప్పారు. దీంతో కర్నూలులో ఎస్వీ, హఫీజ్, అలీ ఖాన్.. ఇలా మూడు వర్గాలు తయారు అయ్యాయి.
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎన్నికల సమయం నుంచి గ్రూప్ రాజకీయాలు చూడవచ్చు. ఈ నియోజకవర్గంపై జగన్ చేసిన ప్రయోగం బెడిసికొట్టిందట. పార్టీ సీనియర్ నేత చెన్నకేశవ రెడ్డికి వయసు మీద పడడంతో ఆయనను పక్కన పెట్టారు. మొదట మచాని ఆ తర్వాత బుట్ట రేణుకను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల సమయంలో చెన్నకేశవ రెడ్డి వర్గం బుట్ట రేణుకకు సహకరించలేదని అందరూ చెప్పుకుంటారు. ఎన్నికలు ముగిశాక బుట్ట రేణుక ఇంచార్జిగా కొనసాగారు. ఆమె ఇంచార్జీగా ఉన్న సమయంలో బీజేపీలో ఉన్న మురహరి రెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చారు. అయితే చెన్నకేశవ రెడ్డి తన మనవడు రాజీవ్ రెడ్డికి నియోజకవర్గం ఇంచార్జీ బాధ్యతలు సాధించుకొచ్చారు. బుట్ట రేణుకను కర్నూలు పార్లమెంట్ ఇంచార్జీగా నియమించారు.
అయితే బుట్ట రేణుక మాత్రం ఎమ్మిగనూరుపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు నియోజకవర్గం ఇంచార్జీ రాజీవ్ రెడ్డి యువకుడు కావడంతో సొంత పార్టీ నాయకులు ముఖ్యంగా చెన్నకేశవ రెడ్డి వర్గం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధ పడడం లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో బుట్టా రేణుక వర్గం రాజీవ్ రెడ్డి వర్గం విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ఉండగా సీనియర్ నేత వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మురహరి రెడ్డి అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని టాక్. ఫలితంగా ఆయా పార్టీల నాయకులు కూడా మురహరి రెడ్డితో టచ్‌లో ఉన్నారు. ఒకవేళ మురహరి రెడ్డికి పార్టీ ముఖ్యమైన పదవి ఇస్తే రాజకీయం ఒక్కసారిగా మారిపోయే అవకాశం లేకపోలేదు. గ్రూప్ రాజకీయాలు వల్ల ఎమ్మిగనూరు వైసీపీకి నష్టం జరుగుతుందని ఇలానే ఉంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు.
నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలపై ఇప్పటివరకు వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైపైన అందరితో మాట్లాడుతున్నాం అంతా బాగానే ఉందని చెపుతున్నారు. అయితే గ్రౌండ్ రియాల్టీలో మాత్రం చాలా నియోజకవర్గాల్లో మూడు నాలుగు గ్రూపులు ఉండడం వాస్తవం. అన్ని తెలిసిన పార్టీ ముఖ్య నాయకులు కూడా జిల్లాలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. నేతలను పిలిచి మాట్లాడవలసిన జగన్ ఆ పని చేయడం లేదట. ఇలానే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు.. మిగతా ఎన్నికల్లో కావచ్చు.. పార్టీ అనుకున్న స్థాయిలో ప్రభావితం చూపడంలో విఫలమయ్య అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికైనా జగన్ గ్రూపు నాయకులను పిలిపించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులతోపాటు సొంత పార్టీ నాయకులు సైతం చెబుతున్నారు.




