Burning Topic: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 కండిషన్లు!

Burning Topic: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్ ముందు 7 డిమాండ్లు ఉంచిన ఇరాన్, షరతులు తీర్చకపోతే హర్మూజ్ జలసంధి మూసేస్తామని హెచ్చరించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 Sept 2026 7:21 AM IST
Burning Topic
X

Burning Topic: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 కండిషన్లు!

Burning Topic: పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తుండగా.. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకే దిశగా ఇరాన్ 7 డిమాండ్లను ముందుకు తెచ్చింది ఇరాన్.

అమెరికా తనంతట తానుగా సృష్టించుకున్న ఈ చిక్కుముడి నుంచి బయటపడాలంటే తమ హక్కులను గౌరవించాల్సిందేనని అందులో స్పష్టం చేశారు. ఇరాన్ సమీపంలో మోహరింపులు, యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఇరాన్ సముద్ర తీరాలపై కొనసాగుతున్న నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయయాలని షరతు విధించారు.

ఇలాంటి ఏడు డిమాండ్లను అమెరికా ముందు ఉంచినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయి చెప్పారు. ట్రంప్ బెదిరింపులు తమపై ఎటువంటి ప్రభావం చూపవని, తాము హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని తేల్చిచెప్పారు.

అమెరికాతో ఇరాన్‌ దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించేందుకు ఖతార్, పాకిస్థాన్‌ దేశాలు కొంతకాలంగా తీవ్రంగా కృషిచేయడం తెలిసిందే. ఖతార్ ద్వారా షరతులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ డిమాండ్లను పంపినట్లు మొహ్సెన్ రెజాయి ప్రకటించారు.

ఒకవేళ ఆయన ఈ డిమాండ్లను తిరస్కరిస్తే, తాము ఏ క్షణంలోనైనా నిర్ణాత్మక యుద్ధానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమెరికా వైపు నుంచి మరో విడత దాడులు జరిగే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది.

గత అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన సైనిక వ్యూహాలను పూర్తిగా మార్చుకున్నట్లు రెజాయి తెలిపారు. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఓమన్ మీదుగా అరేబియా సముద్రం వరకు మోహరించిన అమెరికా నౌకాదళ స్థావరాలు, విమాన వాహక నౌకల కదలికలపైనే తాము ఫోకస్ పెట్టామన్నారు. ఇటీవల అమెరికా నౌక సమీపంలోనే ఒక బహుళ-వార్‌హెడ్ యాంటీ షిప్ క్షిపణిని పరీక్షించినట్లు రెజాయ్ చెప్పుకొచ్చారు.

మరోవైపుఅమెరికాకు తమ సందేశాలు, షరతులు స్పష్టంగా చేరాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్‌ బాగేర్‌ గాలిబఫ్‌ తెలిపారు. ఇరాన్ ప్రజల హక్కులను గుర్తించడం, అమెరికా తన హామీలను నెరవేర్చడం వంటి అంశాలపై తమ వైఖరి స్పష్టంగా ఉందన్నారు.

ఆ షరతులు నెరవేరే వరకు పాత చర్చల విధానానికి తిరిగి వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నారు. అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోమని, గతంలో కొనసాగిన చర్చల ప్రక్రియలోకి వెళ్లబోమని స్పష్టం చేశారు.

ప్రపంచంలోని ముఖ్యమైన ఇంధన రవాణా మార్గాల్లో హర్మూజ్ జలసంధి ఒకటి. ఆ ప్రాంతంలో నౌకల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడితే అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అందుకే ఇరాన్ దృష్టిలో హర్మూజ్ ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఒకవేళ మళ్లీ దాడులు పునరావృతమైతేఅమెరికన్ కంపెనీలు, వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా భారీ ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరిస్తోంది

అమెరికా చర్యలకు సహకరించే పశ్చిమాసియా దేశాలనూ ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సైనిక చర్యకు మద్దతు ఇచ్చే దేశాలను కూడా ఈ ఘర్షణలో భాగస్వాములుగా పరిగణిస్తామని తెలిపింది. అలాంటి దేశాలపై కూడా ఇరాన్ దళాలు ఎలాంటి వెనుకంజ లేకుండా స్పందించే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇరాన్ నుంచి ఈ స్థాయి హెచ్చరికలు రావడం వెనుక అమెరికా కొనసాగిస్తున్న సముద్ర చర్యలు కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, సెప్టెంబర్ 20 నాటికి తమ బలగాలు 109 వాణిజ్య నౌకలను మళ్లించాయి.

సముద్ర ఆంక్షలను పూర్తిగా అమలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా చెబుతోంది. దీంతో హర్మూజ్ జలసంధి చుట్టూ పరిస్థితి మరింత సున్నితంగా మారింది.

ప్రపంచ ఇంధన సరఫరాలో ఆ మార్గానికి ఉన్న ప్రాధాన్యం కారణంగా, ఇక్కడ నౌకల రాకపోకలు ప్రభావితమైతే దాని ప్రభావం ఇతర దేశాలపైనా పడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూయార్క్ వెళ్లనున్నారు.

అయితే ఈ బృందంలో కిందరికి వీసాలు ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. దీంతో పెజెష్కియాన్ పరిమిత ప్రతినిధులతో పెజెష్కియాన్ యూఎస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సహా కీలక అధికారులు ఉన్నారు.

కమ్యూనికేషన్స్ బృందంలోని కొంతమంది సభ్యులకు అమెరికా వీసాలు నిరాకరించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఐక్యరాజ్య సమతి అతిథ్య దేశంగా ఉన్న అమెరికా దౌత్య నిబంధనల ప్రకారం ఇరాన్‌ ప్రభుత్వ బృందానికి వీసాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఐరాస ప్రధాన కార్యాలయంతో పాటు కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకే ఇరాన్ బృందం కదలికను పరిమితం చేస్తోంది అమెరికా మరోవైపు సౌదీ అరేబియాపై దాడులు చేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులపై నేరుగా ఎటువంటి సైనిక చర్యలు తీసుకోరాదని అమెరికా నిర్ణయించింది.

ఇటీవలి కాలంలో హౌతీలు సౌదీ రాజధాని రియాద్‌తో పాటు అక్కడి చమురు సంస్థ 'అరామ్‌కో' లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు తీవ్రతరం చేశారు.

ఈ నేపథ్యంలో తమకు మద్దతుగా హౌతీలపై వైమానిక దాడులు చేయాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాను కోరారు. దీనికి స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హౌతీలపై దాడులు చేయడానికి మొదట వైమానిక దళాన్ని సిద్ధం చేసినప్పటికీ, చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు.

అమెరికా సైనిక స్థావరాలపై గానీ, వారి నౌకలపై గానీ తాము దాడులు చేయబోమని, కేవలం సౌదీ అరేబియాను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు అమెరికాకు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో వారితో మరో కొత్త యుద్ధాన్ని ప్రారంభించడం అమెరికా సైన్యానికి అదనపు భారం అవుతుందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగకపోయినప్పటికీ, సౌదీ అరేబియా తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన అత్యాధునిక F-35 ఫైటర్ జెట్ల అమ్మకానికి ఇటీవల ఆమోదం తెలిపింది.

మరోవైపు అమెరికా పశ్చిమాసియాలోని తమ పౌరులను అప్రమత్తం చేసింది. అనుకోనిస్థాయిలో దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇక్కడి 11 అమెరికా రాయబార కార్యాలయాలు భద్రతా హెచ్చరిక జారీచేశాయి.

పరిస్థితులు ఎప్పుడైనా చేయి దాటే ప్రమాదం ఉన్నందున విమానాల రద్దు, గగనతలాల మూసివేత, ఇతర ప్రయాణ అంతరాయాలకు అమెరికన్లు సిద్ధంగా ఉండాలని సూచించింది.

ఇరాన్ మద్దతు ఉన్న హూతీ రెబల్స్, సౌదీ అరేబియా మధ్య దాడులు తీవ్రమవుతున్నాయని ముఖ్యంగా విమానాశ్రయాలపై జరుగుతున్న దాడులను ప్రధానంగా ప్రస్తావించింది.

ఈ సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. పశ్చిమాసియా గుండా ప్రయాణించాలనుకునేవారు తమ ప్రయాణాలను పునరాలోచించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ సలహా ఇచ్చింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్