Burning Topic: ఏఐని నమ్మితే జరిగేవి అనర్థాలే!
Burning Topic: ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికాపై మండిపడిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. ఏఐ సాంకేతిక లోపంతో పాఠశాలపై జరిగిన క్షిపణి దాడి ఘటన కలకలం.
Burning Topic: ఏఐని నమ్మితే జరిగేవి అనర్థాలే!
Burning Topic: ఇటీవల ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన ప్రసంగంలోని ఓ అంశం అందరి దృష్టినీ ఆకర్శించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై చేపట్టిన యుద్ధాన్ని ప్రస్థావించారు. మాపై ఉగ్రవాదం ముద్ర వేస్తున్నారు. వాస్తవానికి మేము ఉగ్రవాద బాధితులం. గత 2 శతాబ్దాలుగా ఇరాన్ ఏ దేశంపైనా, ఏ భూభాగంపైనా దాడి చేయలేదు, మమ్మల్ని మేం దృఢంగా రక్షించుకున్నాం. ఆ ప్రాంతంలో అస్థిరతకు మేమే కారణమని మాపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పెజెష్కియాన్.
మా మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలను లక్ష్యంగా చేసుకున్నారు. మా శాస్త్రవేత్తలను, పౌరులను హత్య చేశారు. ఎలాంటి నేరాలు, పాపాలు చేయని అమాయక పిల్లలను బలి తీసుకున్నారు అంటూ యుద్ధంలో దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతోపాటు యుద్ధంలో మరణించిన పాఠశాల విద్యార్థుల ఫొటోలను ఆయన ప్రదర్శించారు.
దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న షాజరెహ్ తయ్యెబెహ్ ప్రాథమిక పాఠశాల పై అమెరికా సైన్యం జరిపిన క్షిపణి దాడిలో పాఠశాల పిల్లలతో సహా మొత్తం 156 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 2026 ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుననేఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. అమెరికా సైన్యం ప్రయోగించిన తోమాహాక్ క్షిపణి నేరుగా పాఠశాలపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దాడిలో 73 మంది బాలురు, 47 మంది బాలికలు, 26 మంది మహిళా ఉపాధ్యాయులు, 7 గురు తల్లిదండ్రులు, స్కూల్ బస్సు డ్రైవర్, క్లినిక్ ఉద్యోగి, ఒక గర్భిణీ స్త్రీతో పాటు ఆమె కడుపులోని శిశువు మరణించారు. 21వ శతాబ్దంలో పౌరులపై అమెరికా జరిపిన అత్యంత ఘోరమైన దాడిగా ఇది నమోదైంది. ఐక్యరాజ్యసమితి విద్యా సంస్థ UNESCO ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. విద్యా సంస్థలపై దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
మినాబ్ పాఠశాల దాడి విషయంలో అమెరికాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే దాడి జరిగిన తొలినాళ్లలోఈ ఘటనకు ఇరాన్ దేశమే కారణమంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపించారు. ఇరాన్ తన సొంత పేలుడు పదార్థాలను సరిగ్గా లక్ష్యంగా చేసుకోలేక ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యమే ఈ దాడికి పాల్పడిందనే కథనాలు, విమర్శలు వెల్లువెత్తినప్పుడు, తనకు పూర్తి వివరాలు తెలియవని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు జూన్ 2026 లో ఫ్రాన్స్‌లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, యుద్ధంలో కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయని, ఎవరూ దీనిని ఉద్దేశపూర్వకంగా చేయలేదుఅని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం బహిరంగంగా తన పొరపాటును అంగీకరించకపోవడానికి రాజకీయ, సైనిక చట్టపరమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. అధికారికంగా బాధ్యత వహిస్తే, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో చట్టపరమైన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనే భయమే కారణం.
కాగా మీనాబ్ పాఠశాలపై దాడిపై జరిగిన దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగు చూసింది. 2026 ఫిబ్రవరిలో ప్రాథమిక పాఠశాల ప్రాంతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నిఘా డేటాబేస్ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGCకి చెందిన సైనిక స్థావరంగా గుర్తించడమే కారణమని తాజాగా దర్యాప్తులో బయటపడింది. అయితే కాలక్రమంలో ఆ ప్రాంతంలో చాలా మార్పులు జరిగాయి. పాత సైనిక స్థావరం ఉన్న ప్రదేశంలో తర్వాత పాఠశాల నిర్వహిస్తున్నప్పటికీ.. నిఘా డేటాబేస్‌లో ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారం అప్‌డేట్ కాలేదు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ మేవెన్ వ్యవస్థను అమెరికా సైన్యం వాడింది. సైనిక ప్రణాళికాదారులు సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ AI మోడల్‌ను మేవెన్ స్మార్ట్ సిస్టమ్‌లో ఉపయోగించారు.
మినాబ్ నగరం గతంలో IRGC సైనిక స్థావరంగా ఉండేది. కానీ 2017-18 నాటికే అది షాజరెహ్ తయ్యెబెహ్ ప్రాథమిక పాఠశాలగా మారిపోయింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అది ఇప్పటికీ యాక్టివ్ సైనిక స్థావరమే అని తప్పుగా అంచనా వేసింది. మేవెన్ స్మార్ట్ సిస్టమ్ సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే AI స్వయంగా గుర్తిస్తుందని సైనిక విశ్లేషకులు అతిగా నమ్మారు. అయితే పాత డేటాలోని లోపాలను AI సరిగ్గా పట్టుకోలేకపోయింది. మానవ పర్యవేక్షణ లోపం యుద్ధం ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే 1,000 కంటే ఎక్కువ లక్ష్యాలపై దాడి చేయాలనే తొందరలో, అమెరికా సైన్యం టార్గెట్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి తక్కువ సమయం కేటాయించింది. అమెరికా సైన్యం తన భవిష్యత్తు వ్యూహాల్లో మేవెన్ స్మార్ట్ సిస్టమ్ వంటి AI వ్యవస్థలను అత్యంత కీలకంగా భావిస్తోంది. ఈ క్రమంలో AI వల్లనే ఈ ఘోరం జరిగిందని ప్రకటిస్తే, మిలిటరీ ఆధునీకరణ ప్రాజెక్టులపై సాంకేతిక కంపెనీలపై నమ్మకం దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆధునిక యుద్ధాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతపై మితిమీరిన ఆధారపడటం వల్ల జరిగే వినాశనానికి ఒక హెచ్చరికగా నిలిచింది. సాధారణ యుద్ధాలలో తప్పు జరిగితే ఆదేశాలు ఇచ్చిన కమాండర్లనో లేదా దళాలనో బాధ్యులను చేస్తారు. కానీ AI జోక్యంతో జరిగిన ఈ దాడిలో తప్పు సాంకేతికతదా, డేటా అప్‌డేట్ చేయని విశ్లేషకులదా లేదా దాడికి ఆదేశించిన కమాండర్లదా అనే గందరగోళం ఏర్పడింది. మీనాబ్ స్కూల్ ఘటన నేర్పిన గుణ పాఠాలు ఏంటంటే..AI సిస్టమ్స్ ఇచ్చే సిఫార్సులను లేదా డేటాను మానవ అధికారులు గుడ్డిగా నమ్మకూడదు. మెషిన్ ఇచ్చిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించకుండా తీసుకునే నిర్ణయాలు ఘోరమైన మానవ తప్పిదాలకు దారితీస్తాయి. AI ఎంత అధునాతనమైనదైనా, దానికి ఇచ్చే ఇన్‌పుట్ పాతదైతే ఫలితాలు వినాశకరంగా ఉంటాయి. సైనిక డేటాబేస్‌లు, అంతర్గత సమాచార మార్పిడి వ్యవస్థలు నిరంతరం, ఖచ్చితత్వంతో అప్‌డేట్ అవుతూ ఉండాలి.
ప్రాణ నష్టంతో కూడిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముగింపునకు ఎలా వచ్చిందో విశ్లేషించగలిగే వివరణాత్మక వ్యవస్థలు మాత్రమే వాడాలి. అంతర్జాతీయ యుద్ధ చట్టాల ప్రకారం AI సిస్టమ్స్ వెనుక ఉండే మానవులదే పూర్తి బాధ్యత అని స్పష్టమైన నిబంధనలు రూపొందించుకోవాలి. యుద్ధ రంగంలో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి పౌర ప్రాంతాలను రక్షించే అంతర్జాతీయ మానవతా చట్టాలను ఏ ఉద్దేశంతోనూ బలహీనపరచకూడదు. మొత్తంగా, మినాబ్ ఉదంతం ప్రపంచానికి ఇచ్చిన అతిపెద్ద సందేశం ఏమిటంటే.. యుద్ధంలో సాంకేతికత ఎంత పెరిగినా, ప్రాణాలు తీసే లేదా కాపాడే తుది నిర్ణయం.. విచక్షణ పూర్తిగా మనుషుల చేతుల్లోనే ఉండాలి.మినాబ్‌లోని పాఠశాలపై దాడి ఘటనలో అమెరికా దాడులు యుద్ధ నేరాలుగా పరిగణించే స్థాయిలో ఉన్నాయనేందుకు ‘సహేతుకమైన ఆధారాలు’ ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దర్యాప్తు బృందం చెబుతున్నా అమెరికా దీన్ని అంగీకరించలేదు.




