Burning Topic: మొదలైన ఖమేనీ అంత్యక్రియలు
Burning Topic: అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు టెహ్రాన్‌లో ప్రారంభమయ్యాయి.
Burning Topic: మొదలైన ఖమేనీ అంత్యక్రియలు
Burning Topic: అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఆరురోజుల పాటు ఇవి కొనసాగుతాయి. టెహ్రాన్‌లోని 'గ్రాండ్ మొసల్లా' ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశం నిర్వహించారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తమ దివంగత నేతను స్మరించుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. జులై 9న ఇరాన్ రెండో అతిపెద్ద నగరమైన మషాద్‌లోని ప్రసిద్ధ 'ఇమామ్ రెజా' పవిత్ర క్షేత్రంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రభుత్వ ప్రతినిధులు హాజరై నివాళుల్పర్పించారు
దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు రాజధాని టెహ్రాన్‌లో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన మరణించడం తెలసిందే. నాలుగు నెలల అనంతరం అంతిమసంస్కారాలను నిర్వహిస్తున్నారు. గ్రాండ్ మొసల్లా వేదికపై అలీ ఖమేనీ భౌతిక కాయం ఉంచిన శవపేటికతోపాటు బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆయన కుటుంబసభ్యుల మృతదేహాల శవపేటికలను కూడా పెట్టారు ఖమేనీ అల్లుడు, ఆయన పెద్ద కుమార్తె, 14 నెలల మనవరాలు, ప్రస్తుతం సుప్రీం నేత మొజ్తబా భార్య కూడా నాటి దాడిలో చనిపోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కాగా భద్రతా కారణాలతో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు ప్రత్యక్షంగా హాజరుకావడం లేదని ఇరాన్ అధికారులు ప్రకటించారు.
అలీ ఖమేనీ అంతిమ సంస్కారాలు 6రోజుల పాటు సాగనున్నాయి. జులై 4 నుంచి 5వ తేదీ వరకు టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. జులై 6న టెహ్రాన్ వీధుల్లో ఇమామ్ హుస్సేన్ స్క్వేర్ నుంచి అజాది స్క్వేర్ వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర భారీ అంతిమ యాత్ర నిర్వహిస్తారు. జులై 7న ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన ఖోమ్‌కు భౌతికకాయాన్ని తరలించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
జులై 8న షియా ముస్లింల పవిత్ర నగరాలైన ఇరాక్‌లోని బగ్దాద్, కర్బలా, నజాఫ్ నగరాల్లోని పుణ్యక్షేత్రాలకు భౌతికకాయాన్ని తరలించి నివాళులర్పిస్తారు. జులై 9న ఇరాన్ రెండో అతిపెద్ద నగరమైన మషాద్‌లోని ప్రసిద్ధ 'ఇమామ్ రెజా' పవిత్ర క్షేత్రంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. దివంగత సుప్రీం లీడర్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు వేలాదిమంది తరలివచ్చారు. వారంతా ప్రతీకారానికి గుర్తుగా ఎర్రజెండాలను పట్టుకొని.. ‘డెత్ ఆఫ్ అమెరికా’ అంటూ నినాదాలు చేశారు
అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. ఇరాన్‌కు ఉన్న దౌత్యపరమైన సంబంధాల నేపథ్యంలో అంత్యక్రియలకు భారత్ తరఫున ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హాజరైంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ అంత్యక్రియలకు హాజరైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
వారు దివంగత నేత ఖమేనీ భౌతికకాయానికి నివాళులర్పించారు. భారత ప్రజల తరఫున వారు ఇరాన్ ప్రభుత్వానికి తమ తీవ్ర సానుభూతిని తెలియజేశారు. పశ్చిమాసియా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ పౌరుల కుటుంబాల పట్ల గవర్నర్ హస్నైన్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ దివంగత నేతను స్మరించుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఖమేనీ మరణం తర్వాత టెహ్రాన్‌లో అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం ఇదే
కాగా దివంగత సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు దాదాపు నాలుగు నెలలు ఆలస్యమయ్యాయి. ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అదే సమయంలో మృతదేహాన్ని తాత్కాలికంగా ఖననం చేశారన్న వదంతులు కూడా వ్యాపించాయి. ఇరాన్ అధికారులు మాత్రం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు,
యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగడంతోనే మార్చిలో జరగాల్సిన అంత్యక్రియలు ఇప్పుడు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇస్లాం ఆచారాల ప్రకారమే సుప్రీం నేత పార్థివ దేహాన్ని భద్రపరిచామని పేర్కొంటున్నారు. భౌతికకాయానికి రసాయనాల పూయడం ఇస్లాం సంప్రదాయాల ప్రకారం నిషిద్ధం. దీంతో ఎలాంటి రసాయనాలు పూయకుండానే కోల్డ్ స్టోరేజీలోనే మృతదేహాన్ని ఈ నాలుగు నెలల పాటు ఉంచినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇస్లాం మతాచార్యుల అనుమతి కూడా తీసుకున్నారు
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వహీది చాలాకాలం తర్వాత బహిరంగంగా కనిపించారు. టెహ్రాన్‌లో ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక సంతాప కార్యక్రమానికి హాజరై ఖమేనీ భౌతికకాయాన్ని ఉంచిన శవపేటిక పక్కనే కూర్చొని నివాళులర్పించారు. వహీది ఫిబ్రవరి ప్రారంభం తర్వాత బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న కీలక బృందంలో ఆయన ఉన్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిలాగే తన సహజ ధోరణిలో ఇరాన్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇరాన్‌ను మేం చిత్తుగా ఓడించాం. దాంతో వారు రాజీకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మనం మంచివాళ్లం కాబట్టి.. అంత్యక్రియల కోసం వీకాఫ్ ఇచ్చాం’’ అని సౌత్ డకోటాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.




