Burning Topic: ట్రంప్ యుద్ధం ఆపినా వెనక్కి తగ్గని ఇరాన్

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను హతమార్చిన వారికి ఇరాన్ ప్రభుత్వం రూ. 558 కోట్ల భారీ బహుమతిని ప్రకటించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 May 2026 6:50 AM IST
Burning Topic
X

Burning Topic: ట్రంప్ యుద్ధం ఆపినా వెనక్కి తగ్గని ఇరాన్

Burning Topic: నిన్నటి దాకా వదిలేదేలే అటూ టెహ్రాన్‌ను హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై చేయాలనుకున్న దాడులు తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్రకటించారు.

సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల అధినేతలు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతానికి ఇరాన్‌పై ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన దాడిని తాత్కాలికంగా వాయిదా వేశామని.. అవసరమైతే భారీ స్థాయి దాడికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సోషల్​ మీడియా ట్రూత్​లో పోస్ట్ చేశారు. "ఇరాన్‌తో ప్రస్తుతం కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. దీంతో మేము తలపెట్టిన సైనిక దాడిని వాయిదా వేయమని ఖతార్ అమీర్ షేక్ తమీమ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌లు నన్ను కోరారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు లేకుండా చేస్తామమని" అని ట్రంప్ అందులో రాసుకొచ్చారు.

ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో జాతీయ భద్రతా బృందం, అధ్యక్షుడితో సమావేశం కావాల్సి ఉందని ఇద్దరు అధికారులు తెలిపారు. సౌదీ, ఖతార్, యూఏఈ పాలకులు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు వైట్‌ హౌస్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఇరాన్‌తో సీరియస్‌గా చర్చలు జరుగుతున్నాయన్నారు డొనాల్డ్ ట్రంప్. అవి ఒప్పందంగా మారే అవకాశం ఉందని అరబ్ దేశాల పాలకులు భావిస్తున్నామన్నారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాలకు కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారుమిత్రదేశాల నేతలపై ఉన్న గౌరవంతోనే ఇరాన్‌పై దాడులను వాయిదా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. దాడుల నిలిపివేతపై రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డేనియల్ కేన్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే చర్చలు విఫలమై, ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై దాడులకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు.

ఇరాన్ విషయంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ భిన్నమైన వైఖరులతో ఉన్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు సఫలం కాకపోతే భారీ దాడి చేస్తామని ట్రంప్ ఇటీవలే మరోసారి హెచ్చరించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే మొత్తం తమ ప్రాంతమే అతలాకుతలం అవుతుందని భావించిన గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఒకవేళ అమెరికా మళ్లీ దూకుడు ప్రదర్శిస్తే తాము అత్యంత వేగంగా, శక్తివంతంగా సమాధానం ఇస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ఒక ప్రకటనలో, మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహి అమెరికాను హెచ్చరించారు. తమ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా, సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ బలాన్ని అభివర్ణిస్తూ తమ సైన్యం ట్రిగ్గర్‌పై వేలు పెట్టి సిద్ధంగా ఉందని వెల్లడించారు.

మరోవైపు తమ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చిన అమెరికా, ఇరాన్‌లపై పగతో రగిలిపోతోంది ఇరాన్. ఇందుకు కారణమైనఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చిన వారికి 50 మిలియన్ యూరోలు బహుమతిగా ఇచ్చే ప్రకటన చేసేందుకు సిద్దమవుతుంది. ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపు 558 కోట్ల రూపాయలు. ఈ ప్రకటన కోసం ఇరాన్ పార్లమెంట్ ద్వారా చట్టం చేసేందుకు ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. ఇరాన్ పార్లమెంట్‌కు చెందిన 'నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిటీ' చైర్మన్ ఇబ్రహీం అజీజీ సిద్ధం చేస్తున్న ఈ బిల్లుకు "కౌంటర్-యాక్షన్ బై ది మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్" అని పేరు పెట్టారుఈ బిల్లు ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలను హత్య చేసే ఏ వ్యక్తికైనా లేదా సంస్థకైనా రూ.560 కోట్ల బహుమతిని అధికారికంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ వార్త అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిగిన వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇతనితోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. ప్రస్తుత సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేమీ తీవ్ర గాయాలు పాలుకావడానికి కూడా ఈ దాడులే కారణం. ఈ దాడులకు ప్రతీకారంగా ట్రంప్, నెతన్యాహులను హతమార్చడానికి రివార్డులను ప్రతిపాదించే ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. ఖమేనీ హత్యలో పాత్ర ఉన్నందుకు గాను ట్రంప్, నెతన్యాహు, మరియు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ "ప్రతీకార చర్య" తీసుకోవాలని అజీజీ పేర్కొన్నట్లు ఇరాన్ తెలిపింది. ట్రంప్, నెతన్యాహులను "నరకానికి పంపే" ఎవరికైనా బహుమతులు ఇచ్చే బిల్లుపై తమ పార్లమెంట్ త్వరలోనే ఓటు వేస్తుందని ప్రకటించారు. ఇస్లామిక్ ప్రభుత్వం "కిల్ ట్రంప్" ప్రచారం కోసం 50 మిలియన్ల డాలర్లను సమకూర్చుకుందని ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ 'మాసఫ్' పేర్కొంది.

ఇరాన్ గతంలో కూడా ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని ప్రయత్నించడం కలకలం రేపుతోంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరిస్తూ.. తనపై ఇరాన్ ఎలాంటి దాడికి ప్రయత్నించినా, ఆ దేశాన్ని భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచి పెట్టేస్తామని వ్యాఖ్యానించారు.మరోవైపు ఇరాన్ మరో కొత్త ప్రతిపాదనను పంపినప్పటికీ.. అందులో ఎలాంటి సానుకూల మార్పులు లేవని అమెరికా వెల్లడించింది. "ప్రస్తుతం శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. సరైన రీతిలో స్పందించాల్సిన బాధ్యత పూర్తిగా ఇరాన్ పైనే ఉంది" అని అమెరికా ఉన్నతాధికారి ఒకరు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్‌ పోర్టులపై అమెరికా దిగ్బంధనాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story