Burning Topic: ఇరాన్ ను చుట్టేసిన అమెరికా నేవీ.. రంగంలోకి చైనా
Burning Topic: ఇరాన్ మరియు అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు ఇస్లామాబాద్‌లో జరగనున్నాయి.
Burning Topic: ఇరాన్ ను చుట్టేసిన అమెరికా నేవీ.. రంగంలోకి చైనా
Burning Topic: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా శాంతి చర్చల దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే, మరోవైపు హర్మూస్ జలసంధిని ముట్టడించే దిశగా నౌకలను మొహరించింది అగ్రరాజ్యం. పరిస్థితులను పరిశీలిస్తే ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందని స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధం దాదాపు ముగిసినట్టే కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పూర్తి స్థాయి పరిష్కారం కోసం చర్చలు కొనసాగాల్సి ఉందని తెలిపారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్‌తో కలిసి తాముచేసిన ఆపరేషన్ల వల్ల ఇరాన్‌లో మౌలిక వసతులకు భారీ నష్టం జరిగిందని, పునర్నిర్మాణానికి దాదాపు 20 ఏళ్లు పట్టవచ్చని తెలిపారు ట్రంప్. కాగా ఈనెల 21తో ముగుస్తున్న ఇరాన్‌తో కాల్పుల విరమణ గడువును పొడగించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. శాశ్వతమైన ఒప్పందం వైపే తాము మొగ్గు చూపుతున్నామని తెలిపారు.
యుద్ధం ముగించే దిశగా ఇరాన్‌తో మరో రెండు రోజుల్లో ఈ సంప్రదింపులు జరగొచ్చని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే ఈసారి చర్చల కోసం అమెరికా రెండు షరతులు విధించినట్లు చెబుతున్నారు. అందులో మొదటిది హర్మూజ్ జలసంధిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా దాన్ని పూర్తిగా తెరవాలి. రెండోది.. చర్చలకు వచ్చే ఇరాన్ ప్రతినిధులు ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఐఆర్‌జీసీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. ఈ రెండు నిబంధనలకు టెహ్రాన్ అంగీకరిస్తే శాంతి చర్చలకు తాము సిద్ధమేనని అమెరికా తెలిపింది. శాంతి చర్చలకు సంబంధించి ఇరాన్ పాలకవర్గంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. చర్చల సమయంలో అమెరికా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఇరాన్ ప్రతినిధుల బృందానికి ఐఆర్‌జీసీ అనుమతినివ్వలేదని సమాచారం. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అసంతృప్తిగా ఉన్నట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కారణంగానే డీల్ కోసం ఐఆర్‌జీసీ అనుమతి తీసుకోవాలనే రెండో షరతును అమెరికా పెట్టినట్లు తెలుస్తోంది.
కాగా రెండో విడత చర్చలు యూరోప్‌లో నిర్వహించాలని భావించినా.. ఇస్లామాబాద్‌లోనే జరపాలని అమెరికా అధ్యక్షుడు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. అధికారికంగా తేదీలు ఖరాలు కానున్నా ఈ నెల 17 నుంచి 19 తేదీల మధ్య చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ శాంతి చర్చల్లో పాల్గొనే అమెరికా బృందానికి మరోసారి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహించనున్నారు. ఈ బృందంలో ఎప్పటిలాగే ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్ ఉంటారు. చర్చలకు వచ్చేందుకు ఇరాన్ ఇప్పటికే అంగీకారం తెలిపింది. చర్చలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే వాన్స్ బృందం మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అధికారిక చర్చల్లో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావడానికి సులభంగా ఉంటుందని అమెరికా భావిస్తోంది. కాల్పుల విరమణ గడువు ముగింపులోనే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ప్రధానంగా అడ్డంకిగా మారిన అంశం యూరేనియం శుద్ధి. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి విడత చర్చల్లో దాదాపు 80శాతం అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. ఒప్పందం దాదాపు కుదిరినట్లుగానే కన్పించింది. కానీ కాసేపటికే అవి విఫలమయ్యాయి.. 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధి నిలిపివేయాలని యూఎస్ ప్రతిపాదన పెట్టగా, అందుకు ఇరాన్ నిరాకరించింది. యురేనియం శుద్ధిని తాము ఐదేళ్ల పాటు మాత్రమే నిలిపివేస్తామని ఇరాన్ చెప్పగా ఇందుకు అగ్రరాజ్యం సమ్మతించకపోవడంతోనే చర్చలు ఆగిపోయాయి. వాస్తవానికి టెహ్రాన్ శాశ్వతంగా యురేనియం శుద్ధిని నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం ముందునుంచీ డిమాండ్ చేసింది. ఈ గడువు ఇస్తే ఒక రకకంగా అది ఇరాన్ 'విజయం'గా మారుతుందని ట్రంప్ భావిస్తున్నారు. కానీ చర్చల సమయంలో దాన్ని 20 ఏళ్లకు తగ్గించడం గమనార్హం. రెండో విడత చర్చల సందర్భంగా అయినా ఇరువైపులా పట్టువిడుపులు పాటించాలని అంతా కోరుకుంటున్నారు.
మరోవైపు ఇరాన్ ఓడరేవులపై పూర్తి దిగ్బంధించినట్లు అమెరికా ప్రకటించింది. హర్మూజ్ జలసంధితో సహా కీలక ప్రాంతీయ జలమార్గాలలో దాదాపు 10వేల మంది సైనికులు, మెరైనర్లు, వైమానిక దళ సిబ్బందిని మోహరించినట్టు సమాచారం. దిగ్బంధనాన్ని ప్రారంభించిన 36 గంటల్లోనే ఇరాన్ నుంచి వెళ్లే వాణిజ్య నౌకలను అమెరికా దళాలు పూర్తిగా నిలిపివేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మైరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. సముద్ర మార్గం ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్యం పైనే ఇరాన్ ఆర్థికవ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉందని, యూఎస్ నావికాదళ పర్యవేక్షణలో క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. అవి ఇరాన్ పోర్టుల నుంచి బయటకు వచ్చే, లోపలకు వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుంటాయి వెల్లడించారు. కాగా హర్మూజ్ మొత్తానికి కాకుండా ఇరాన్ పోర్టులను మాత్రమే అమెరికా దిగ్బంధించినట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే పశ్చిమాసియా ప్రాంత శాంతి, సుస్థిరతల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ నాలుగు పాయింట్లను ప్రతిపాదించారు. అవి.. శాంతియుత సహజీవన సూత్రానికి కట్టుబడి ఉండటం.. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం.. అంతర్జాతీయ చట్టాలను పాటించడం.. అభివృద్ధి - భద్రతలో దేశాలు పరస్పరం సమన్వయం చేసుకోవడం.. హర్మూజ్ జలసంధిని అమెరికా నౌకాదళం ముట్టడించే ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో యూఏఈ అబుధాబి యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ చైనా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మీరు చర్చిస్తున్నారు. చైనా వినియోగించే మొత్తం ముడి చమురులో 45 % హర్మూజ్ మీదుగానే ఆ దేశానికి సప్లై అవుతుంది.. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా శాంతి, సుస్థిరతల కోసం 4 పాయింట్లను జిన్‌పింగ్ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.
కాగా పశ్చిమాసియా యుద్ధం విషయంలో అమెరికా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఇప్సాస్-రాయిటర్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అగ్రరాజ్యం ఇప్పటికే చాలా నష్టపోయింది. ఈ యుద్ధంతో తమ దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదంటూ 54 % మంది అమెరికన్లు భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడాన్ని 54 % మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ దాడులతో ఆర్థికవ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అభిప్రాయం వ్యక్తంచేశారు. 65 % మంది డెమోక్రాట్లు, 56 % మంది ఇండిపెండెంట్లు, 40% రిపబ్లికన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య సరైందేనని 24 శాతం % మాత్రమే సమర్థించినట్లు సర్వే తెలిపింది. మరో 22 % మంది స్పందించడాకి ఇష్టపడలేదు. రిపబ్లికన్ పార్టీలోనూ 54 % మంది యుద్ధానికి అనుకూలంగా ఉండగా.. మిగతా వారు వ్యతిరేకిస్తున్నట్లు సర్వే పేర్కొంది. మొత్తానికి ఈ సర్వేతో రిపబ్లికన్ పార్టీలో చీలికలు ఏర్పడతాయనే అంచనాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇరాన్‌తో యుద్ధానికి, హర్మూజ్ జలసంధినితెరిపించే విషయంలో నాటో కూటమి నుంచి సాయం అందకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. నాటో ఎప్పుడూ అమెరికాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ మద్దతుగా నిలవలేదంటూ ఆరోపించారు భవిష్యత్తులోనూ దానినుంచి తమకు ఎలాంటి మద్దతు లభించదని మండిపడ్డారు. ఇక, గత కొన్నిరోజులుగా నాటోపై ట్రంప్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా ఈ కూటమిని ఓ కాగితపు పులిగా అభివర్ణించారు. కూటమి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు.ఒకవేళ అమెరికా కూటమి నుంచి వైదొలిగితే.. ప్రస్తుత సైనిక వ్యవస్థలను ఉపయోగించి తనను తాను రక్షించకోగలిగే ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను యూరప్ రూపొందిస్తుందని చెబుతున్నారు. యూరోపియన్ నాటో’ పేరుతో ఈ ప్రతిపాదనపై అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.




