Off The Record: సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన అరవింద్?

Off The Record: తెలంగాణ బీజేపీలో ధర్మపురి అరవింద్ దూకుడు పెంచారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Jun 2026 6:39 AM IST
Off The Record
X

Off The Record: సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన అరవింద్?

Off The Record: తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఒక పేరు ఎక్కువగా వినిపిస్తోందట. అదే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు మాట్లాడినా వార్తే. కానీ అర్వింద్ మాట్లాడితే హెడ్‌లైనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజామాబాద్ జిల్లా రాజకీయాలపై పట్టు కొనసాగిస్తూనే... రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు, కేడర్ యాక్టివేషన్, పార్టీ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారట. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి, మరోవైపు బీఆర్ఎస్‌పై సెటైర్లు... అవసరమైతే సొంత పార్టీ నేతలపైనా ముక్కు సూటిగా వ్యాఖ్యలు.

అవును.. ఇటీవల మున్సిపల్ ఎన్నికల తరువాత ఎవరైనా కోవర్ట్ వుంటే పార్టీ నుంచి వెళ్ళిపోండి అనడం అప్పట్లో చర్చకు దారితీసిందట. ఇప్పుడు బీజేపీలో కొందరు నేతలు నెమ్మదిగా రాజకీయాలు చేస్తుంటే.. అర్వింద్ మాత్రం "సింహం సింగిల్‌గా వస్తుంది" అన్న సినిమా డైలాగ్ మోడ్‌లో కనిపిస్తున్నారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. అర్వింద్ మాత్రం ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాజకీయ అజెండాను సెట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోందట. ఒకవైపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్ ఎపిసోడ్ తో పార్లమెంట్ పరిధికే పరిమితం కాగా.. మరోవైపు ఈటల రాజేందర్ పై ఇటీవల ప్లెక్సీ వివాదం పెద్ద దుమారమే రేగింది.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో కిషన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డికి కౌంటర్లు ఇస్తున్నారట.. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వేదికపై మాత్రం ధర్మపురి అర్వింద్ స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. .రాష్ట్రంలో ఏ అంశం జరిగినా... వెంటనే స్పందిస్తూ అధికార పార్టీని ప్రశ్నించడం, ప్రతిపక్షాన్ని నిలదీయడం, తనదైన రాజకీయ భాషలో కౌంటర్లు ఇవ్వడం ఆయనకు ట్రెండ్‌గా మారిందట.

కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్వింద్ స్పీడ్ కు బ్రేకులే లేవట. ధాన్యం కొనుగోలు నుంచి రైతు సమస్యల వరకు.. ఆరు గ్యారంటీల నుంచి అభివృద్ధి పనుల వరకు.. సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తున్నారట. "బల్ల గుద్ది చెబుతున్నా" అంటూ పసుపు ధరల పెరుగుదల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ.. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారట. అలాగే మాధవ్ నగర్ రైల్వే హైవే పనుల జాప్యంపై సెల్ఫీ వీడియోతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడటం.

మరోవైపు మెట్రో ఫేజ్-2, రైల్వే హైవే ప్రాజెక్టు, కేంద్ర నిధుల అంశాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారట. "ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు"... మూసీ, మెట్రో విషయంలో కేంద్రానికి సరైన డీపీఆర్ పంపకపోగా తర్వాత బీజేపీపై మీద ఏడిస్తే ఏమి వస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు."సొమ్ము కేంద్రానిది.. సోకు ఫ్లెక్సీలు సుట్టినోడిది" అంటూ జగిత్యాల రాజకీయాల్లో వేసిన పంచ్ అయితే మరింత వైరల్ అయిందట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో సాగుతున్న రాజకీయ పోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిందట. కేంద్రీయ విద్యాలయం భూమి వ్యవహారం నుంచి అమృత్ పథకం నిధుల వరకు.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇంకా చల్లారలేదట.

అదే విధంగా రాజకీయ పంచ్ లకు పదునుపెట్టారట. తెలంగాణ ఎవరి జాగీరు కాదంటూనే.. రేవంత్ రెడ్డి జాగీరు అసలే కాదని, ఇదీ ప్రజల జాగీరు అంటూ కుండబద్దలు కొట్టారట. కాక్రోచ్ పార్టీ లేదు.. ఆక్రోచ్ లేదంటూనే.. పట్టున 100 మంది కూడా లేరు.. మా కార్పోరేటర్ మీటింగ్ పెడితే తండోప తండాలుగా జనాలు వస్తారని సైటైర్లు వేశారు. రాజకీయాల్లో మాటకు మాట ఉంటేనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అర్వింద్ వ్యాఖ్యలు అదే పరిస్థితిని తీసుకొచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకీ అర్వింద్ రాజకీయ దూకుడు వెనుక అసలు వ్యూహమేంటి..? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటీవల ప్రధాని మోదీ, రేవంత్ మధ్య ఏమైనా లింక్ ఉందేమో.. సువేందు అధికారి లాగా ఏదైనా జరగొచ్చు.. పార్టీలో నేను చిన్న కార్యకర్తను" అంటూ వేసిన సెటైర్ అప్పట్లో రీసౌండ్ చేసింది. మరోవైపు రేవంత్ రెడ్డిపై అర్వింద్ దాడి రోజురోజుకూ పదునెక్కుతోందట.

ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. మరోవైపు బీఆర్ఎస్‌పై ఎదురుదాడి చేస్తూ... కమలం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారట. "బల్ల గుద్ది చెబుతున్నా" అంటూ రైతుల అంశాలపై గళమెత్తడం.. కిందా మీదా చేస్తాం.. 2029లో బీజేపీని అధికారంలోకి తెస్తామంటూ సవాల్ విసరడంతో ఇప్పుడు బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపుతోందట. ఇదీ అర్వింద్ రాజకీయ స్టైల్‌కు నిదర్శనంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో "ధైర్యం అర్థ విజయమైతే.. దూకుడు పూర్తి విజయానికి దారి" అన్నట్టుగా ఆయన అడుగులు పడుతున్నాయని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది‌.

ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ కాలేదు కానీ కమ్యూనిస్టు ముక్త్ భారత్ అయింది, అలాగే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ పత్రం మేము నింపినామా..? కాంగ్రెస్ వాళ్ళకు ఫాం రాయడం కూడా రాదా..? అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ రాజకీయ వేడి పెంచేశారు. ఇక బీజేపీ శ్రేణుల్లో మాత్రం మరో చర్చ నడుస్తోందట. అర్వింద్ దూకుడు చూస్తుంటే.. తెలంగాణ బీజేపీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడుతోందా..? రాజకీయాల్లో మరింత పెద్ద పాత్ర కోసం గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారా..? లేక 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే బలమైన నరేటివ్ బిల్డ్ చేస్తున్నారా..? అనే చర్చ జోరందుకుందట.

బీజేపీ కీలక నేతలంతా అర్వింద్ తరహాలో దూకుడు స్వభావంతో ఎటాక్ మోడ్‌లో పనిచేస్తే తెలంగాణలో అధికార పీఠం నల్లేరు మీద నడక లాగే సులువు అవుతుందంటూ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ముందు మబ్బులు కనిపిస్తేనే వర్షం వస్తుంది" అంటారు. అయితే ఇప్పుడు రాజకీయ ఆకాశంలో కనిపిస్తున్న ఈ దూకుడు మబ్బులు.. ఇటు తెలంగాణ బీజేపీలో అటు రాజకీయాల్లో ఎలాంటి పిడుగులు పడేలా చేస్తాయో అన్నది ఉత్కంఠగా మారింది.

ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. ధర్మపురి అర్వింద్ దూకుడుతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా..? ఇది కేవలం ప్రత్యర్థులపై రాజకీయ దాడేనా..? లేక ఎన్నికల ముందు కేడర్‌లో జోష్ నింపే మాస్టర్ ప్లానా..? లేక తెలంగాణ బీజేపీలో కొత్త పవర్ ఈక్వేషన్‌కు సంకేతమా..? ప్రతి అంశంపై స్పందిస్తున్న అర్వంద్.. కేవలం ఎంపీగానే కొనసాగుతారా..? లేక భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు గేమ్ షురూ చేశారా..? "సైలెంట్‌గా కనిపించే చెస్ బోర్డులో.. అసలు ఆట చివరి ఎత్తులోనే తెలుస్తుంది" అంటారు. వచ్చే జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేళ.. అర్వింద్ దూకుడుతో బీజేపీకి ఎలాంటి మైలేజ్ వస్తుందో.. చూడాలి.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story