Burning topic: పాక్ డబుల్ గేమ్.. యుద్ధంలో ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్..!

Burning topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వెనుక అసలు రహస్యం ఏంటి?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 April 2026 6:51 AM IST
Burning topic
X

Burning topic: పాక్ డబుల్ గేమ్.. యుద్ధంలో ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్..!

Burning topic: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగడం తెలిసిందే. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ వేదికగా మారింది. వాస్తవానికి పశ్చిమాసియాలో ఎలాంటి సంక్షోభం వచ్చినా అమెరికా తన ఇతర మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, జోర్దాన్, టర్కీల మీద ఆధారపడుతుంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ తన మీద యుద్ధానికి దిగినప్పుడు ఇరాన్ ఈ దేశాల మీద దాడి చేసింది. దీంతో మధ్యవర్తిత్వ పాత్ర స్వీకరించడానికి ఈ దేశాలు ముందుకు రాలేదు. ఈ అవకాశాన్ని మన పొరుగు దేశం చక్కగా ఉపయోగించుకుంది. పాకిస్థాన్ స్వయాన ఉగ్రవాదాన్ని, యుద్ధాన్ని ప్రోత్సహించే దేశం. భారత్, అఫ్ఘానిస్తాన్ తో ఘర్షణలతో పాటు స్వదేశంలోనూ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పోరాడుతోంది. అంతే కాకుండా పీకలోతు అప్పులు, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతోంది. ఇలాంటి దేశం మీద మధ్యవర్తిత్వ బాధ్యత మోపడంపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి.

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పాకిస్థాన్‌ను మధ్యవర్తిత్వ పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇందుకు కారణం ఆ దేశ నాయకులతో వ్యక్తిగతం సంబంధాలే కారణం అనేది బహిరంగ రహస్యం. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ గౌరవనీయ వ్యక్తులని పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రశంసలు కురిపించారు ట్రంప్. ఇదే సమయంలో ప్రత్యేకించి అసిమ్ మునీర్‌తో డొనాల్డ్ ట్రంప్ స్నేహం చేయడం విమర్శలకు తావిస్తోంది. పాకిస్థాన్‌లో పౌర ప్రభుత్వం కన్నా సైన్యమే అత్యంత కీలకం. అందుకే అమెరికా అధ్యక్షుడు మునీర్‌కు అతి ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రంప్ ఆయన్ని ప్రియమైన ఫీల్డ్ మార్షల్ అని పిలుస్తారు. ప్రపంచ ప్రజాస్వామ్య రక్షకునిగా చెప్పుకునే అమెరికా ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రికన్నా సైన్యాధిపతికి ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ నాయకుల మధ్య సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి.

గత సంవత్సరం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ -WLF పాకిస్తాన్ నేషనల్ క్రిప్టో కౌన్సిల్ తో భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ సంస్థలో ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ లకు 60% దాకావాటా ఉంది. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ సంస్థకు "చీఫ్ క్రిప్టో అడ్వకేట్"గా ఉన్నారు. పాకిస్థాన్‌ను దక్షిణ ఆసియా క్రిప్టో హబ్‌గా మార్చడం, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. పాకిస్థాన్‌లో క్రిప్టో మైనింగ్, డిజిటల్ ఆస్తుల నియంత్రణకు అవసరమైన మౌలిక సదుపాయాలను ట్రంప్ సంస్థ కల్పించనుంది. ఇది పాకిస్తాన్‌లో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని వేగవంతం చేస్తుందని, ట్రంప్ కుటుంబానికి చెందిన వ్యాపార ప్రయోజనాలను పెంపొందిస్తుందని అంచనా. ఈ వ్యాపార ఒప్పందంపై సంతకాలు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు జనరల్ ఆసిమ్ మునీర్ సమక్షంలో జరగడం గమనించవచ్చు. ఇందు కోసం పాకిస్థాన్ ప్రభుత్వం క్రిప్టో బ్యాంకింగ్ నిషేధాన్ని ఎత్తివేసింది.

ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయంలో ఏమిటంటే పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల దాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. దీంతో ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల కోసం భారత్‌ లాంటి మిత్ర దేశాలతో ఉన్న సంబంధాలను పణంగా పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. భారత్, పాకిస్తాన్ ల మధ్య తాను అణు యుద్ధాన్ని నివారించానని డొనాల్డ్ ట్రంప్ పదే పదే గొప్పలు చెప్పుకోవడబం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ట్రంప్ వాదనను భారత్ ఖండించగా, పాకిస్థాన్ మాత్రం సమర్థించింది. అంతే కాదు అమెరికా అధ్యక్షుని నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ ప్రధాని షరీఫ్ సిఫార్స్ చేశారు. ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల ప్రయోజనాల కోసం భారత్‌తో ఉన్న సంబంధాలను త్యాగం చేశారని జో బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సల్లివన్ బహిరంగంగానే ఆరోపించారు. పాకిస్థాన్‌తో ఉన్న క్రిప్టో వ్యాపార సంబంధాలను ఆయన ప్రస్తావించారు

గతేడాది జూన్‌లో డొనాల్డ్ ట్రంప్ తన అధికార నివాసం వైట్ హౌస్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను ఆహ్వానించి విందు ఇచ్చారు. ఒక విదేశీ ఆర్మీ చీఫ్‌కు అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వడం అరుదు. గతంలో ఆయూబ్ ఖాన్, జియా-ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి పాక్ సైనిక నేతలకు మాత్రమే ఇలాంటి గౌరవం లభించింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు, భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన సంఘర్షణల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కలిసి మరోసారి మునీర్ అమెరికా అధ్యక్షునితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మునీర్ ఓ డెమో కూడా ఇచ్చారు. పాకిస్థాన్‌లోని భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేసేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు.ఈ ప్రాజెక్టులో అమెరికా చమురు కంపెనీలు పాల్గొంటాన్నారు. అంతే కాకుండా పాక్ లో రియల్ ఎస్టేట్, ఖనిజ నిక్షేపాల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ సైన్యాధిపతితో దోస్తీ చేయడం అమెరికా నిఘా వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ స్నేహం తమ దేశానికి ప్రమాదకరమని చెబుతున్నాయి. అసిఫ్ మునీర్ ఇప్పుడు అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ద్వంద్వ సంబంధాలు ఒకవైపు అమెరికాకు ఉపయోగపడవచ్చు. కానీ వ్యూహాత్మక ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మునీర్‌కు ఎప్పటి ఇరాన్‌ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులతో, ఐఆర్‌జీసీతో బలమైన సంబంధాలున్నాయని పాక్ మాజీ జనరల్‌ అహ్మద్‌ సయీద్‌ చెబుతున్నారు. ముఖ్యంగా దాని ఖుద్స్‌ ఫోర్స్‌ నేత ఖాసీం సులేమానీ, ఐఆర్‌జీసీ కమాండర్‌ హోస్సెన్‌ సలామీతో సంబంధాలున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ పరిచయాలు అమెరికా విధాన నిర్ణేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

వాస్తవానికి పాకిస్థాన్ మీద అమెరికా విధాన నిర్ణేతల అనుమానాలు కొత్తేమీ కాదు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా సహాయం పొందుతూ, తాలిబాన్‌కి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. తమ దేశంలో తాలిబాన్ కార్యకలాపాలను చూసీ చూడనట్లు వదిలేసింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికా మీద దాడి చేసి వేలాది మంది ప్రజల ప్రాణాలను తీసుకున్న అల్ ఖైదా చీఫ్ బిల్ లాడెన్ కు కూడా అమెరికా ఆశ్రయం ఇచ్చింది. అమెరికా సైన్యం కీలక ఆపరేషన్ నిర్వహించి పాకిస్తాన్ గడ్డ మీదే లాడెన్ ను మట్టు బెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ సంస్థ పాకిస్థాన్ విశ్వసనీయతపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. అమెరికా వ్యూహాత్మక ప్రయోజానాలు కాపాడేందుకు పాక్‌ పనిచేస్తుందన్న గ్యారెంటీ ఏమాత్రం లేదని ఆ సంస్థ సీనియర్‌ ఫెలో బిల్‌ రోజియో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ పాకిస్థాన్ తో తన వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించాలా, నిఘా హెచ్చరికలు పరిగణనలోకి తీసుకోవాలా అనేది తేల్చుకోవాల్సి ఉంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story