Off The Record: పవన్ కళ్యాణ్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా?
Off The Record: హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
Off The Record: పవన్ కళ్యాణ్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా?
Off The Record: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో పెట్టిన ప్రెస్‌మీట్.. తెలంగాణ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తోంది. గచ్చిబౌలిలో జరగాల్సిన పార్టీ సభను అడ్డుకున్న వారిపై పవన్ విరుచుకుపడటంతో పాటు.. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని అనౌన్స్ చేయడం మాటల యుద్ధానికి దారి తీసింది. పవన్ వ్యాఖ్యలతో తీవ్రంగా హర్ట్ అయిన హస్తం పార్టీ నేతలు.. 'తెలంగాణ మా అయ్య జాగీరే' అంటూ కౌంటర్ అటాక్‌కు దిగారు. మరోవైపు ఈ వివాదంలో దూరిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అత్యంత ఆచితూచి అడుగులు వేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహాలు రచిస్తున్నాయి.
పవన్ ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాక.. ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతారని అందరూ ఊహించారు. కానీ అందరి ఊహలు పటాపంచలు చేస్తూ తెలంగాణలోనూ పోటీకి సై అన్నారు జనసేనాని. ముందుగా..హైదరాబాద్‌లో నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు పవన్. దానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా సభకు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో పవన్ కళ్యాణ్ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇదంతా ఇలా ఉంటే.. రాష్ట్రంలో ఎంతో మంది ఎన్నో సభలు, సమావేశాలు పెట్టుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సభకి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ఒక చిన్న సభకి పర్మిషన్ ఇస్తే ఇంత చర్చ జరిగి ఉండేది కాదనే అభిప్రాయం అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తం అవుతోందట.
పవన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ఘాటుగా స్పందించారు. 'ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్.. ఈ తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే.. ఇక్కడి నాలుగు కోట్ల ప్రజల అయ్య జాగీరే తప్ప నీ అయ్య జాగీరు కాదు' అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్లను ఉండొద్దనడం లేదని, పెట్టుబడులను వద్దనడం లేదని.. కానీ ఇక్కడి గడ్డపై నిలబడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసిన చరిత్ర పవన్‌కు ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాత్రమే
పవన్ ఎపిసోడ్‌పై మాట్లాడారు. కానీ మిగతా పెద్ద నేతలు ఎవరూ స్పందించలేదు. దీంతో కాంగ్రెస్‌లో ఏమైన అభిప్రాయ బేదాలు ఉన్నాయా...? అన్న చర్చ తెరపైకి వస్తుంది. పవన్ విషయంలో ముఖ్యనేతలంతా స్పందిస్తే.. హైద్రబాద్‌లో పార్టీకి ఏమైన డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందనే ప్రతి విమర్శకు దిగలేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్‌కు ఉన్న ఫ్యాన్స్‌ను.. ఎందుకు దూరం చేసుకోవడం అని భావించారా..? లేక సీఎం రేవంత్‌కు.. ఏపీ ముఖ్యమంత్రితో అంతో ఇంతో సాన్నిహిత్యం ఉంది. కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామిగా ఉంది. దీంతో పవన్‌ను విమర్శించి.. సెటిలర్స్‌లో నెగిటివ్ కావడం ఎందుకనే బిగ్ లీడర్స్ సైలెంట్‌గా ఉన్నారా..? అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కాంగ్రెస్, జనసేన,బీజేపీల మధ్య సాగుతున్న ఈ లొల్లి వెనుక అసలు కథ వేరే ఉంది అంటున్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ మొత్తం ఎపిసోడ్‌ను 'పక్కా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా'గా అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని, నిరుద్యోగ, సాగునీటి సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్–పవన్ కళ్యాణ్ కలిసి ఈ డ్రామాకు తెరలేపారని అనుమానం వ్యక్తం చేశారు. ఒక పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణలో శాంతిభద్రతల సమస్య ఎలా వస్తుందని, అంతగా భయపడేలా ఉంటే ఈ ప్రభుత్వం చేతగానితనానికి అది నిదర్శనమని జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఇక కేటీఆర్ కూడా పవన్ కల్యాణ్ పై స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో 11 రోజులు అన్నం తినని పవన్ కల్యాణ్ గురించి తెలంగాణకు తెలుసని .. ఫ్రెండ్లీగా వస్తె హైద్రాబాద్ బిర్యానీ తినిపించి పంపుతామని...కానీ ఇక్కడ పాలనలో వేలు పెడితే ఊరుకోమని అన్నారు. జనసేన ఆల్రెడీ ఇక్కడ పోటీ చేసిందని.. కొత్తగా పోటీ చేసేది ఏముందని అన్నారు..తెలంగాణకు అసలైన O G కేసీఆర్ అని అన్నారు కేటీఆర్...
ఐతే పవన్ కళ్యాణ్ వేసిన ఈ పొలిటికల్ అడుగు వెనుక చాలా పెద్ద ముందస్తు వ్యూహమే దాగుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్క ప్రెస్‌మీట్‌తో తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కించడంలో వంద శాతం సక్సెస్ అయ్యారు పవన్ కల్యాణ్. దీనిపై కాంగ్రెస్, BRS స్పందించగా... బీజేపీ మాత్రం ఎక్కడ స్పందించకుండా అచితూచి అడుగులు వేస్తుంది. నిజానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్, ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని భావించాయి. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొన్ని చోట్ల కలిసి పోటీ చేసి.. కొన్ని చోట్ల దూరంగా ఉన్నాయి.
అయితే రానున్న ట్రై కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసే బరిలోకి దిగబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత బెంగాల్‌లో కాలుమోపింది బీజేపీ. రానున్న ghmc ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఒక ట్రయల్ రన్ వేసి ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేస్తుందట. కూటమిలో టీడీపీని కలుపుకుంటే ప్రత్యర్థి పార్టీలు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే అవకాశం ఉంది. అది రాజకీయంగా తమకు నష్టం చేస్తుందని కమలం నేతలు భావిస్తున్నారట. కనుక బయట నుండి సపోర్ట్ తీసుకుంటూ తెలంగాణలో ముందుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చ నడుస్తుంది.




