Big Debate: ఆన్‌లైన్ ఫుడ్ ప్రేమికులకు హెచ్చరిక: మీరు తినే ఆహారం ఎంతవరకు సేఫ్?
Big Debate: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే ఆహారం ఎంతవరకు సేఫ్? క్లౌడ్ కిచెన్‌ల నాణ్యత, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు, వినియోగదారుల హక్కులపై ప్రత్యేక కథనం.
Big Debate: నేటి ఆధునిక జీవనశైలిలో చిన్నచిన్న అవసరాల నుంచి రోజువారీ భోజనం వరకు ప్రతిదానికీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లపై ఆధారపడటం ఒక అలవాటుగా మారింది. అయితే, మనం తెప్పించుకుంటున్న ఆహారం ఎంతవరకు నాణ్యమైనది? ఎంతవరకు సురక్షితమైనది? అనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎస్టాబ్లిష్డ్ రెస్టారెంట్లతో పాటు ఇటీవల ఊరుపేరు లేని 'క్లౌడ్ కిచెన్లు' పెరిగిపోవడం, వాటి పారిశుధ్యం ప్రశ్నార్థకంగా మారడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాప్‌లలో ఆకర్షణీయమైన ఫోటోలు చూసి చాలామంది ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు. కానీ, ఆయా హోటళ్లకు అసలు ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయా? అక్కడ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయాలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సరిగ్గా వెరిఫై చేస్తున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల నిల్వ ఉంచిన ఆహారాన్ని ఉప్పు, కారాలు దట్టించి సరఫరా చేస్తున్నారని, ఇది వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.




