Off The Record: జగన్ రాజకీయ వ్యూహాలు మారాయా ?
Off The Record: ఏపీలో త్వరలో ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ జాతీయ పొత్తులు, వామపక్షాలతో సయోధ్య, స్థానిక ఎన్నికల కొత్త వ్యూహాలపై దృష్టి పెడుతున్నారనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.
Off The Record: జగన్ రాజకీయ వ్యూహాలు మారాయా ?
Off The Record: ఏపీలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. వైసీపీ రాజకీయాల కేంద్రం పూర్తిగా మారిపోయిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలే వైఎస్ జగన్ ప్రధాన అజెండా కాగా... ఇప్పుడు జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఒకవైపు కేంద్రంలోని రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార కూటమిని ఎదుర్కొనేందుకు కొత్త రాజకీయ వ్యూహాల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ భవిష్యత్ రాజకీయ మార్గరేఖ ఎలా ఉండబోతోందన్న చర్చ ఆసక్తికరంగా మారింది. గతంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన జగన్.. ప్రస్తుతం ఆ పార్టీపై పూర్తి స్థాయి దాడి చేయడం తగ్గించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కొన్ని జాతీయ అంశాల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలతో వైసీపీ వైఖరి దగ్గరగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు... బీజేపీ, ఎన్డీయేతో పూర్తిస్థాయి సాన్నిహిత్యం కూడా ప్రస్తుతం కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో జగన్ కొత్త పొత్తుల కోసం అవకాశాలను పరిశీలిస్తున్నారా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
మరోవైపు లెఫ్ట్ పార్టీలతో సంబంధాలపైనా చర్చ సాగుతోంది. రైతు సమస్యలు, సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాల్లో వైసీపీ వైఖరి కొంతవరకు లెఫ్ట్ పార్టీల అభిప్రాయాలకు దగ్గరగా ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.
భవిష్యత్తులో జాతీయ రాజకీయ సమీకరణాలు మారితే.. ప్రాంతీయ పార్టీలతో పాటు లెఫ్ట్ శక్తుల మద్దతు కూడా కీలకంగా మారే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ముందుగానే అన్ని అవకాశాలను తెరిచి ఉంచుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఉద్యమాలతో ప్రాచుర్యంలోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు జగన్ సంఘీభావం తెలిపారు.
మరోవైపు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ, గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిందంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మాజీ సీఎం జగన్‌ను వెనుకేసుకొచ్చారు. ఏపీలో ఓట్ల తొలగింపు, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సక్రమంగా జరగలేదని, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందని.. అదే జగన్ ఓటమికి కారణమంటూ మంత్రి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం.. తోబుట్టువు వైఎస్ షర్మిల వ్యవహారం. ఆమె ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా జగన్, షర్మిల మధ్య రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయిలో కొనసాగాయి. ఇరు పక్షాల నుంచి మాటల యుద్ధం కూడా జరిగింది.
కానీ భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ విభేదాలు రాజకీయాలకు అడ్డంకి కాకూడదన్న భావన కొందరు నేతల్లో కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రత్యక్ష ఘర్షణల కంటే రాజకీయ మర్యాదలు పాటించే ధోరణి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఇది నిజంగా సయోధ్య సంకేతమా..? లేక కేవలం రాజకీయ అవసరాల దృష్ట్యా అనుసరిస్తున్న వ్యూహమా..? అన్నది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. తాజా షర్మిల కూతురు పెళ్లి విషయంలో చెల్లెలుకు జగన్ రాసిన లేఖ కూడా ఈ సందర్భంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ఏపీ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం వైసీపీకి ప్రధాన సవాల్ తిరిగి ప్రజల్లో బలాన్ని పెంచుకోవడం. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ కేడర్‌ను యాక్టివ్‌గా ఉంచడం, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను ఉధృతం చేయడం వంటి అంశాలపై పార్టీ దృష్టి పెట్టింది.
కానీ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైతే సరిపోదని.. జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు, మద్దతు అవసరమవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయనే ప్రచారం ఉంది. రాజకీయంగా చూస్తే జగన్ ముందు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేసి తిరిగి అధికార పోరాటానికి సిద్ధం అవడం. రెండోది... రాష్ట్ర స్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా మిత్రపక్షాల వేదికను నిర్మించుకోవడం.
ఇందులో రెండో మార్గాన్నే జగన్ పరిశీలిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో దేశ రాజకీయాలు సంకీర్ణ ప్రభుత్వాల వైపు వెళితే ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అందుకే కాంగ్రెస్‌తో దూరం తగ్గించడం, లెఫ్ట్ పార్టీలతో సంభాషణకు అవకాశం ఉంచుకోవడం, జాతీయ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించడం వంటి అంశాలను కొందరు జగన్ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా చూస్తున్నారు. అయితే ఈ చర్చలన్నీ ప్రస్తుతం రాజకీయ విశ్లేషణల స్థాయిలోనే ఉన్నాయి. ఎలాంటి అధికారిక కూటమి సంకేతాలు గానీ, రాజకీయ ఒప్పందాలు గానీ ఇంకా బయటకు రాలేదు.
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జగన్.. నెక్స్ట్ లెవెల్ వ్యూహరచన చేసినట్టు అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం వామపక్షాలతోపాటు కాంగ్రెస్ పార్టీ మద్దతును జగన్ కోరినట్టు తెలుస్తోంది. అధికార కూటమి అభ్యర్థులను ఓడించేందుకు అవసరమైతే వైసీపీ తరఫున డమ్మీ అభ్యర్థులను సైతం రంగంలోకి దించేందుకు కూడా జగన్ స్కెచ్ వేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులోభాగంగానే.. విజయవాడ కూటమి మేయర్ అభ్యర్థిని ఓడించేందుకు ఇండింపెండెంట్‌గా బరిలో నిలిచిన మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకు వైసీపీ.. పరోక్ష మద్దతు ఇస్తోందన్న ప్రచారం కూడా లేకపోలేదు.




