Burning Topic: తగలబడుతున్న ఇజ్రాయెల్.. ఇరాన్ వదిలి వచ్చేస్తున్న భారతీయులు
Burning Topic: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం.
Burning Topic: తగలబడుతున్న ఇజ్రాయెల్.. ఇరాన్ వదిలి వచ్చేస్తున్న భారతీయులు
Burning Topic: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగాయి..శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగేలా ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది. రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులకు ప్రతికారంగా ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా తాము ఈ చర్యకు దిగినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడిని పసిగట్టిన ఇజ్రాయెల్ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది. లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, బంకర్లకు పరుగులు తీశారు. ఉత్తర ఇజ్రాయెల్‌లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఏప్రిల్ ప్రారంభంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌పై జరిగిన తొలి ప్రత్యక్ష క్షిపణి దాడి ఇదే. దీంతో పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది.
ఇరాన్ మొత్తం 11 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వాటన్నింటినీ గగనతలంలోనే విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరికలు కూడా పంపించినట్లు పేర్కొంది. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించింది. ఈ క్షిపణి దాడులు జరగడానికి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హిజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న దహియెహ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీరూట్‌పై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించిన టెహ్రాన్, తాజాగా రంగంలోకి దిగినట్లే స్పష్టమవుతోంది.
ఇరాన్ క్షిపణిదాడుల విషయం తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శాంతి ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని గుర్తు చేస్తూ ఇరాన్‌పై ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టకుండా ఉండాలని సూచించారు.. వారి దాడిలో ఎవరికీ ఏమీ కాలేదు. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయదని ఆశిస్తున్నా... ఒకవేళ నెతన్యాహు ఎదురుదాడి చేస్తే గత 47 ఏళ్ల నుంచి జరుగుతున్నదే కొనసాగుతుంది అని తన సందేశంలో ట్రంప్ సూచించారు. ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకునే ఏ ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించక తప్పదని పేర్కొన్నారు. తుది నిర్ణయాలు తీసుకునేది అమెరికానేనని, చర్చల దిశను నిర్ణయించేది తానేనని అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు జరిగినప్పటికీ, అమెరికా-ఇరాన్ చర్చలను కొనసాగించాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారించినప్పటికీ ఇజ్రాయెల్ ఆయన మాటను లెక్కచేయలేదు. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ భారీ దాడులు చేపట్టాయి. టెహ్రాన్‌లో పలుచోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతోపాటు తబ్రిజ్, ఇస్ఫహాన్ తదితర నగరాలు కూడా పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన సైనిక స్థావరాలు, ఇతర వ్యూహాత్మక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ చర్యను తీవ్రమైన తప్పిదంగా అభివర్ణిస్తూ.. దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఇరాన్-ఇజ్రాయెల్ తాజా ఘర్షణతో గల్ఫ్ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గాజా, లెబనాన్, సిరియా ప్రాంతాల్లో కొనసాగుతున్న అస్థిర పరిస్థితులకు ఈ పరిణామం మరింత మంటలు రాజేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించిన అనంతరం భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ ఇరాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. దేశ గగనతలాన్ని వచ్చే 72 గంటల పాటు మూసివేస్తున్నట్లు ఇరాకీ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాక్ గగనతలంలో ఒక పౌర విమానం కూలిపోయిందంటూ వస్తున్న వార్తలను అధికారులు తీవ్రంగా ఖండించారు. తమ పరిధిలో అటువంటి ప్రమాదం ఏదీ నమోదు కాలేదని స్పష్టం చేస్తూ, వదంతులను నమ్మవద్దని కోరారు.అటు సిరియా కూడా అప్రమత్తమైంది. దక్షిణ సిరియా గగనతలాన్ని 12 గంటల పాటు మూసివేయడంతో పాటు డమాస్కస్ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నేపథ్యంలో అక్కడి భారతీయులకు టెహ్రాన్‌లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్‌ను వీడాలని సూచించింది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా ప్రస్తుతానికి భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణాలను మానుకోవాలని సూచిస్తున్నాం. ఇక, ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో వెంటనే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరిస్తున్నాం’’ అని ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది.ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైన నాటినుంచి భారత్ పలుమార్లు ఇలాంటి ప్రయాణ సూచనలు జారీ చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు 1600 మందికి పైగా భారత పౌరులను ఇరాన్ నుంచి తరలించింది. ఇక, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల పశ్చిమాసియా దేశాల నుంచి దాదాపు 6 లక్షల మంది భారత పౌరులు స్వదేశానికి తిరిగొచ్చినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది.
ఒక ఇరాన్‌తో ఒప్పందానికి సమీపంలోనే ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఇరాన్ శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పారు. ఒకవేళ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే ఆ దేశ సైన్యాన్ని నాశనం చేస్తామని.. తామే ఆ దేశంలోకి ప్రవేశించి ఆ యురేనియాన్ని తీసుకొస్తామని చెప్పారు. మరోవైపు ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్ ఎన్‌సీబీ నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు అసహనానికి లోనయ్యారు. ఇరాన్‌తో యుద్ధం ఎందుకు చేశారని జర్నలిస్ట్ క్రిస్టెన్ వెల్కర్ ప్రశ్నించగా ట్రంప్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే వాదనలు సరిపోవని, స్పష్టమైన ఆధారాలు అవసరమని జర్నలిస్ట్ కొరడంతో ఇక చాలు. ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం. థ్యాంక్యూ డార్లింగ్ అని చెబుతూ ట్రంప్ పైకి లేచారు.మీడియా వ్యవహార విమర్శలు గుప్పించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.




