Burnning Topic: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్ ఫైర్..అణు యురేనియం అమెరికాకు అప్పగింత
Burnning Topic: ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందం. డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో 10 రోజుల పాటు యుద్ధానికి విరామం.
Burnning Topic: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్ ఫైర్..అణు యురేనియం అమెరికాకు అప్పగింత
Burnning Topic: పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా శత్రుత్వంతో రగిలిపోయిన ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య ఎట్టకేలకు శాంతి చిగురించింది. రెండు దేశాల మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకిరానుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషియల్ వేదికగా ప్రకటించారు. లెబనాన్ అధ్యక్షుడు జోసేఫ్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడానని తెలిపారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమక్షంలో ఇరుదేశాల నేతలు సమావేశమయ్యారు. 34 ఏళ్ల తర్వాత వాషింగ్టన్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు భేటీ కావడం విశేషం. తాను ప్రపంచవ్యాప్తంగా తాను 9 యుద్ధాలను పరిష్కరించానని, ఇది తాను పరిష్కరించబోయే పదో యుద్ధం కానుందని ట్రంప్ తెలిపారు. తదుపరి చర్చల కోసం శ్వేతసౌధానికి రావాలని ఔన్, నెతన్యాహూలను ఆహ్వానించానని వెల్లడించారు.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈ నెల 22తో ముగియనుంది. ఇరు దేశాలు రెండో విడత శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్‌దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరేందుకు లెబనాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ అంగీకారం దోహదపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్‌తో లెబనాన్ చర్చలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హెజ్‌బొల్లా సాయుధులు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఓవైపు కాల్పులు మరికొన్ని గంటల్లో ఆగిపోతాయని ట్రంప్ చెబుతుంటే మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ బలగాలు పరస్పర కాల్పుల్లో బిజీగా కనిపించాయి. ఇరువైపులా కాల్పులు, బాంబుల మోత మోగింది. ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులోని ప్రాంతాలపై హిజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడిచేసింది. లెబనాన్‌లోని బీరూట్ సహా టైర్, నబాతేహ్, బిన్ట్ జబేయిల్‌లపై ఇజ్రాయెల్ దాడులను ఉధృతంచేసింది.
ఇక హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 10 వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. తమ బెదిరింపులకు బయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లాయని అమెరికా తెలిపింది. కాగాహార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ నౌకాశ్రయాలు, తీరప్రాంతాలు లక్ష్యంగా చేపట్టిన దిగ్బంధంలో భాగంగా ఓ వాణిజ్య నౌకను తమ నావికాదళ హెలికాప్టర్ పక్కకు మళ్లించిన దృశ్యాలను అమెరికా సైన్యం విడుదల చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ షేర్ చేసిన ఈ వీడియోలో యూఎస్‌ఎస్ మైఖేల్ మర్ఫీ నౌకలోని ఒక నావికుడి ఆడియో సందేశం ఉంది. ఒమన్ గల్ఫ్ మీదుగా ఆ డిస్ట్రాయర్ నౌకకు చెందిన హెలికాప్టర్ ఎగురుతున్నట్లు ఈ ఫుటేజీలో కనిపిస్తోంది.
ఇక హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై పొంచి ఉన్న ముప్పుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకాయానంపై దాడులు అసహ్యకరమని, అక్కడ సురక్షిత నావిగేషన్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో జరిగిన చర్చల్లో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే హర్మూజ్ విషయంలో సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. వాణిజ్య నౌకలపై దాడులు జరగడం వల్ల భారతీయ సముద్ర సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని హరీశ్ తెలిపారు. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ న్యాయాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానం, వాణిజ్య రవాణా నిర్బంధం లేకుండా సాగేందుకు అంతర్జాతీయ చట్టాలను కచ్చితంగా పాటించాలని హరీష్ పర్వతనేని సూచించారు.
మరోవైపు ఇరాన్‌పై త్వరలోనే విజయం సాధించబోతున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇతర దేశాల్లో దశాబ్దాల పాటు యుద్ధభూమిలో ఉండాల్సి వస్తే.. ఇరాన్‌లో మాత్రం రెండు నెలలే ఉండి విజయానికి అడుగు దూరంలో ఉన్నామని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ట్రంప్ పునరుద్ఘాటించారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. . ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని చెప్పారు. ఒప్పందం కుదిరితే కాల్పుల విరమణ పొడిగింపు అవసరం లేకపోవచ్చని తెలిపారు ట్రంప్. కాగా డొనాల్డ్ ట్రంప్ గాల్లో కోటలు కడుతున్నారంటూ ఐఆర్‌ఐబీ ఎద్దేవా చేసింది. ‘‘ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది. కొన్నిసార్లు వాటిని ఒక్కసారిగా మింగేస్తుంది, కొన్నిసార్లు ఒక్కొక్కటిగా తింటుంది. ట్రంప్ కూడా అంతే. ఆయన ఊహాలోకంలో విహరిస్తున్నారు’’ అంటూ సెటైర్ వేసింది. దీనికి పర్షియన్ సామెతను జోడిస్తూ ఆయన వీడియోను పోస్టు చేసింది.




