BurningTopic: లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు

BurningTopic: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన మరునాడే పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Jun 2026 7:10 AM IST
BurningTopic
X

BurningTopic: లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు

BurningTopic: అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందంపై సంతకాల తడి ఆరక ముందే పశ్చమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.. యుద్ధం ముగింపునకు కుదిరిన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్‌గా సంతకాలు చేసిన మరునాడే ఇజ్రాయెల్ షాక్ ఇచ్చింది., అర్ధరాత్రి వేళ దక్షిణ లెబనాన్‌లోని నబాతియే ప్రాంతంపై ఇజ్రాయెల్‌ దళాలు భీకర దాడులు జరిపాయి. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ వెల్లడించింది. నబాతియే నగరంతో పాటు క్ఫర్ జౌజ్, క్ఫర్ రేమాన్, జెబ్డైన్ పట్టణాలపై బాంబుల వర్షం కురిసింది. ఇటు క్ఫర్ టిబ్నిట్, రేహాన్ హైట్స్ ప్రాంతాలపై వరుసగా వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది. తమ దేశానికి ముప్పు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఈ ఆపరేషన్‌ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

తాజా పరిణామాలు అమెరికా-ఇరాన్‌ మధ్య జరిగిన నూతన ఒప్పందాన్ని నీరుగార్చేలా ఉన్నాయి. శాంతి ఒప్పందంలో లెబనాన్‌ అంశాన్ని కూడా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి.. ఆ ప్రాంతాన్ని వీడాలని ఒప్పందంలో పేర్కొన్నారు. దీన్ని ఇజ్రాయెల్‌ ముందునుంచీ వ్యతిరేకిస్తోంది. హిజ్బుల్లా నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు పూర్తిగా తొలగిపోయేంతవరకు దక్షిణ లెబనాన్‌ నుంచి వెనక్కి వెళ్లబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకూ ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వైదొలగబోమని వెల్లడించారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్‌ దళాలు దాడులను ముమ్మరం చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని ఇజ్రాయెల్ తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పశ్చిమాసియాలో కాల్పుల విమరణ అమలులో ఉన్న సమయంలోనే హిజ్బుల్లాలను లక్ష్యం చేసుకొని లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూ వచ్చింది. ఈ దాడుల్లో దాదాపు 5 వేల మంది మరణించగా.. సాధారణ పౌరులే ఉన్నారనని చెబుతూ ఇజ్రాయెల్‌పై లెబనాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులు ఆపకపోతే ఒప్పందానికి ముందుకు రామని.. అవసరమైతే భీకర యుద్ధం చేస్తామని ఇరాన్‌ హెచ్చరిస్తూ వచ్చింది. దీంతో ఈ విషయంలో మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్‌ మధ్య మాటల యుద్ధం సైతం నడిచింది. ఒకానొక టైంలో దాడులు ఆపాలంటూ నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు సైతం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే.. అవేవీ పట్టించుకోకుండా నెతన్యాహు ఇంతకాలం లెబనాన్‌పై పరిమిత దాడులు జరిపిస్తూ వచ్చారు. ఇజ్రాయెల్‌లో రాజకీయ ఒత్తిళ్లే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కీలక లక్ష్యాలు నెరవేరక ముందే యుద్ధం నిలిపేస్తే ఇరాన్ ఫ్రాక్సీలు మళ్లీ పుంజుకుంటాని ఇజ్రాయెల్ వాదన.

ఈ అనూహ్య పరిణామంలో అమెరికా-ఇరాన్‌ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం తాలుకా కీలక సమావేశం వాయిదా పడింది. ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పర్యటనను వాయిదా వేశారు. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఖరారు చేయడమే ఈ భేటీ లక్ష్యం. అయితే ఏర్పాట్లకు సంబంధించిన సమస్యల కారణంగానే వాన్స్ పర్యటన రద్దు నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. అది పూర్తి కాగానే వెంటనే అమెరికా ప్రతినిధి బృందం బయలుదేరేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే ప్రయాణంపై వాన్స్ సందేహాలు వ్యక్తం చేయడంతో సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని ఇరాన్ ప్రతినిధులు తెలిపారు. దీంతో.. తాత్కాలిక కాల్పుల విరమణ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే ఇరాన్–అమెరికా మధ్య 60 రోజుల తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఈ కాలంలోనే శాంతి చర్చలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం అమలు చేసే దశలో కీలకమైన ఈ భేటీ రద్దు కావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందంలోని తొలి దశ అమలుకు అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఇరుపక్షాలు అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సాంకేతిక స్థాయిలో చర్చలు జరపనున్నట్లు తెలిపారు.ఇరాన్‌కు సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన శాంతి ప్రణాళిక ఇప్పటికే అమెరికా ప్రజలకు ప్రయోజనాలు అందిస్తోందని వాన్స్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి గుండా ఒక్క రోజులోనే 1.25 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగిందని, ఇది ఘర్షణ ప్రారంభమైన తర్వాత అత్యధికమని చెప్పారు.

మరోవైపు తమ అణు స్థావరాలను తనిఖీ చేసేందుకు ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థను ఇరాన్ ఆహ్వానించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలులో భాగంగా, టెహ్రాన్ వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను గుర్తించడం, వాటి పరిస్థితిని అంచనా వేయడం, తదుపరి చర్యలను ప్రారంభించడం కోసం ఈ తనిఖీలు జరగనున్నట్లు ఆయన అమెరికా చట్టసభ సభ్యులకు నిర్వహించిన రహస్య సమావేశంలో వెల్లడించారు..ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్‌ గట్టి హెచ్చరికలు చేసింది. ఒప్పంద సంబంధించిన చర్చల నేపథ్యంలో అమెరికా దాని భాగస్వాములు దురుద్దేశంతో వ్యవహరించినా, ఒప్పందాన్ని ఉల్లంఘించినా, తమ స్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్ ఘాలిబఫ్‌ పేర్కొన్నారు. యుద్ధంలో ఇప్పటికే గట్టి దెబ్బ తిన్నారు మళ్లీ అదే దారిలో నడిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు.

కాగా నిరాశతో కూరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ శాంతి ఒప్పందం కోసం తమపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వ్యాఖ్యానించారు. అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఆయన ఆమోదం తెలిపారు. భవిష్యత్తులో ముఖాముఖి చర్చలు జరపడం శత్రు దేశ అభిప్రాయాలను అంగీకరించడం కాదని స్పష్టం చేశారు. అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఖమేనీ నుంచి వచ్చిన తొలి స్పందన ఇదే కావడం విశేషం. యుద్ధం ప్రారంభ సమయంలో జరిగిన దాడిలో గాయపడిన తర్వాత ఆయన ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఒప్పందంపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నా.. ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి అధ్యక్షుడు పెజెస్కియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చిచెప్పారు. ఈ ఒప్పందం కోసం తమ నేతలు మాత్రం నిబద్ధతో కృషి చేశారని వెల్లడించారు.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story