Burning Topic: పాకిస్తాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం?
Burning Topic: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలతో ఇజ్రాయెల్ మరియు పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
Burning Topic: పాకిస్తాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం?
Burning Topic: ఒకవైపు అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు నిర్వహించి అంతర్జాతీయంగా మంచి పేరు కొట్టేయాలని పాకిస్తాన్ తాపత్రయ పడుతుంటే.. మరోవైపు అక్కడి నేతలే ఆ దేశ ప్రతిష్టను మసకబారుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటేందుకు ఉబలాటపడే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. లెబనాన్ మీద దాడి చేసిన ఇజ్రాయెల్ మీద అభ్యంతకరంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అత్యంత వివాదాస్పదంగా మారిపోయింది.. ఇంతకీ ఖవాజా పెట్టిన పోస్టు ఏంటో చూడండి..
‘ఇజ్రాయెల్ మానవాళికి శాపం. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతుండగా.. లెబనాన్‌లో మారణహోమానికి పాల్పడుతోంది. అమాయక పౌరులను ఆ దేశం పొట్టనపెట్టుకుంటుంది. తొలుత గాజా.. ఆ తర్వాత ఇరాన్.. ఇప్పుడు లెబనాన్‌లో రక్తపాతాన్ని కొనసాగిస్తూనే ఉంది. యూదుల భారాన్ని వదిలించుకునేందుకు పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటుచేసినవారు నరకంలో కాలిపోవాలని ప్రార్థిస్తున్నా’ అని ఖవాజా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈసందర్భంగా ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్నారు. (Khawaja Asif Tweet)
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు అసహ్యం, అంగీకరించలేనివంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం మండిపడింది. ఇజ్రాయెల్ నాశనం కావాలంటూ.. ఖవాజా పిలుపునివ్వడం అత్యంత దారుణమైన చర్యగా పేర్కొంది. కొనసాగుతోన్న శాంతి చర్చల్లో తటస్థ పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్న దేశం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం సహించరానిదని స్పష్టంచేసింది. శాంతి చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తగదని, ఇది పాకిస్తాన్ నిష్పాక్షికతపై అనుమానాలు కలిగిస్తోందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గడియాన్ సార్ కూడా ఆసిఫ్ వ్యాఖ్యలను ఖండించారు. "శాంతి చర్చలు జరుపుతున్నామని చెప్పుకుంటూ, ఇదే సమయంలో యూదులపై విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం" అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ తన భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కాగా తన వ్యాఖ్యలపై వ్యతిరేకత రావడంతో ఖవాజా ఆసిఫ్ ఆ పోస్టును తొలగించేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ జోక్యంతోనే ఖవాజా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మంత్రుల బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల తమ దేశ మధ్యవర్తిత్వ పాత్రకు ప్రాధాన్యం తగ్గి.. శాంతి ప్రక్రియకు అంతరాయం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఖవాజాపై మునీర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పాక్ తటస్థ పాత్రను ఇలాంటి చర్యలు పాకిస్తాన్ తటస్థ పాత్రను దెబ్బతీస్తాయని భావించి ఉంటారని అంటున్నారు. శాంతి చర్చల ప్రక్రియ విఫలమైతే గల్ఫ్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగితే ఇంధన ధరలు భగ్గుమంటాయి. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ పరిస్థితిని ఈ పరిణామాలు మరింత దిగజార్చుతాయనే ఆందోళన కూడా మునీర్ జోక్యానికి కారణం కావొచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ పౌర ప్రభుత్వం మీద పట్టు సాధించిన మునీర్ అమెరికా అధ్యక్షునికి కూడా దగ్గర కావడం తెలిసిందే. పాక్ విదేశాంగ విధానాన్ని కూడా ఆయనే నియంత్రిస్తున్నారని చెబుతున్నారు
ఇదిలా ఉంటే లెబనాన్‌లో కాల్పుల విరమణ లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. హిజ్బుల్లాపై పూర్తి స్థాయి దాడులు కొనసాగుతాయి. దేశ భద్రత పునరుద్ధరించే వరకు ఆగం అని ఆయన వెల్లడించారు. తాజాగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు కొత్త దాడులు ప్రారంభించాయని కూడా సమాచారం. హిజ్బుల్లాపై లాంచ్ సైట్లపై దాడులు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అదే సమయంలో లెబనాన్‌తో నేరుగా చర్చలు ప్రారంభించాలని నెతన్యాహు తన మంత్రివర్గానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ చర్చల ముఖ్య ఉద్దేశ్యం హిజ్బుల్లాను నిరాయుధీకరణతో పాటు ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య శాంతి ఒప్పందం సాధించడమేనని ఆయన తెలిపారు. కాగా లెబనాన్ ప్రభుత్వం కూడా చర్చలకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కాల్పుల విరమణే ప్రస్తుత పరిస్థితికి ఏకైక పరిష్కారమని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అన్నారు. ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావవ వ్యక్తం చేశారు
కాగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తిస్తుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు.ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేశారు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ లెబనాన్ కూడా ఈ ఒప్పందంలో భాగమని పేర్కొనడం వివాదానికి దారి తీసింది. ఈ ప్రకటనను అమెరికా, ఇజ్రాయెల్ ఖండించాయి. మొత్తం మీద, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇప్పటికే ఉన్న సందేహాలు ఆసిఫ్ వ్యాఖ్యలతో మరింత పెరిగాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉద్రిక్తతలతో ఉన్న ప్రాంతంలో ఈ తాజా వివాదం పరిస్థితిని మరింత కఠినతరం చేసే ప్రమాదం కనిపిస్తోంది. శాంతి చర్చలు విజయవంతమవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమాసియా యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇప్పటికే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. లెబనాన్ విషయంలో స్పష్టత లేకపోవడం ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణం. లెబనాన్‌కు కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందని పాకిస్తాన్ తొలుత ప్రకటించగా.. ఆ మాట చెప్పడానికి ఆ దేశానికి ఏ అర్హత ఉందంటూ ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా గతంలో ఖతర్, టర్కీ దేశాలను ముందుంచి గాజా విషయంలో హమాస్‌తో ఒప్పందాలు సాధించింది. ఇప్పుడు పాకిస్తాన్‌ను ఉపయోగించుకుంటోంది. అయితే పాకిస్తాన్‌కు అంత సీన్ లేదని. అది నమ్మదగ్గ దేశం కాదని అంటోంది ఇజ్రాయెల్.
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఆగిపోవడానికి తామే కారణమని పాకిస్తాన్ తెగ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇరాన్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట కాస్త క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చైనా పాత్ర కీలకమని చెప్పి పాకిస్తాన్ గాలి తీసేశారు.




