Off The Record: ఉద్యోగాలు అన్ని కమ్మ వాళ్లకే ఇచ్చావు?
Off The Record: ఏపీ మెగా డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం.
Off The Record: ఉద్యోగాలు అన్ని కమ్మ వాళ్లకే ఇచ్చావు?
Off The Record: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నియామక ప్రక్రియ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కోర్టుల్లో కేసులు, పేపర్ లీక్ ఆరోపణలు, ఫిజికల్ వెరిఫికేషన్‌పై విమర్శలు, హారిజంటల్ రిజర్వేషన్ల అమలుపై సందేహాలు... ఇలా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు తెరపైకి వచ్చాయి. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది.
ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది. వైసిపి చేస్తున్న ఆరోపణలను సంబంధిత అధికారులు మీడియా ముఖంగా ఖండిస్తూ, సమావేశాలు నిర్వహించి మరీ వివరణ ఇస్తున్నారు. నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోర్టుల్లో వచ్చిన అంశాలకు సమాధానాలు ఇచ్చామని, ప్రతి ఆరోపణకు సంబంధించి క్లారిటీ అందించామని చెబుతున్నారు. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి రాజకీయ, సామాజిక.. వ్యక్తిగత ప్రాధాన్యతలకు తావులేదని, అర్హతలు మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే ఎంపికలు జరిగాయని పేర్కొంటున్నారు.
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన పోస్టులపై కొత్త వివాదం మొదలైంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే అధిక సంఖ్యలో పోస్టులు దక్కాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని వైసీపీ అనుకూల వర్గాలు ప్రస్తావించగా... అది వాస్తవాలకు విరుద్ధమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఉద్దేశపూర్వకమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అధికార పార్టీ నేతలు విమర్శలతో సమాధానం చెప్తే, సంబంధిత ప్రభుత్వ అధికారులు మీడియా సమావేశాలతో క్లారిటీ ఇస్తున్నారు.
ప్రభుత్వ వర్గాల వివరాల ప్రకారం... స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. అందులో ఓసీ వర్గానికి కేవలం 42 పోస్టులు మాత్రమే కేటాయించినట్లు చెబుతున్నారు. ఆ 42 మందిలో 16 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, 10 మంది రెడ్డి సామాజిక వర్గానికి, 9 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినవారని వివరించారు. అలాగే వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ వర్గాలకు చెరో ఇద్దరు, మైనారిటీ వర్గం నుంచి ఒక అభ్యర్థి ఎంపికైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కల ప్రకారం ఒకే వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న ఆరోపణలు సరైనవి కావని ప్రభుత్వం వాదిస్తోంది...
రాజకీయ వాదోపవాదాల మధ్య ఉద్యోగం రాని అభ్యర్థుల ఆశలు ఊగిసలాడుతున్నాయి. డీఎస్సీ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ...ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థుల దృష్టి మాత్రం నియామకాల ప్రక్రియపైనే ఉంది. అసలు ఎవరు చెప్పేది నిజం.. ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు తమకు అన్యాయం జరిగిందా లేక ప్రభుత్వం చెబుతున్నట్టు పారదర్శకంగానే భర్తీ చేపట్టారా అన్న సందిగ్ధంలో పడిపోయారు.
ఐతే ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపాలని ప్రభుత్వం చెబుతుండగా... నియామక పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. రాజకీయ విమర్శలు ఎంత జరిగినా... నియామక ప్రక్రియపై మాత్రం ప్రభుత్వం పూర్తి క్లారిటీగా ఉంది.
మెగా డీఎస్సీ. కూటమి సర్కార్ ఏర్పాటులో ఈ హామీ గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. యువత, నిరుద్యోగులను తమవైపు తిప్పుకోవడంలో మెగా డీఎస్సీ హామీ బాగా పని చేసింది. అన్నట్టుగానే.. కూటమి సర్కార్ 16వేల పోస్టులతో డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌తో నియామక ప్రక్రియ చేపట్టింది. ఐతే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పారదర్శకంగా భర్తీ చేపట్టలేదని, అందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది. ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షం చేస్తుంది నిరాధారణ ఆరోపణలు అని.,, కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని వాధిస్తోంది. దానికి తోడు స్పోర్ట్స్ కోటా కూడా వివాదమై కూర్చొంది. ఇప్పుడు దీని మీదనే.. అధికార,ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
డీఎస్సీ-2025 చుట్టూ సాగుతున్న ఈ రాజకీయ రగడకు తెరపడాలంటే వాస్తవాలు, అధికారిక గణాంకాలు, న్యాయపరమైన అంశాలే కీలకం. ఆరోపణలు, ప్రతిఆరోపణల కంటే ఉద్యోగార్థుల భవిష్యత్తు ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో ముందు ముందు వేచి చూడాలి మరి.




