Off The Record: ఆరెంజ్ ఆర్మీని ఉరుకులు పెట్టిస్తున్న అరవింద్

Off The Record: జగిత్యాల రాజకీయాల్లో బీజేపీ దూకుడు. ఎంపీ అరవింద్ నేతృత్వంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు సవాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Jun 2026 6:41 AM IST
Off The Record
X

Off The Record: ఆరెంజ్ ఆర్మీని ఉరుకులు పెట్టిస్తున్న అరవింద్

Off The Record: జగిత్యాల నియోజకవర్గంలో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కంటే ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి బీజేపీ-కాంగ్రెస్ పోటాపోటీ రాజకీయాలు. కొద్ది రోజులుగా ఒక్కో అంశంపై స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ను టార్గెట్ చేస్తోంది బీజేపీ. ఎంపీ అర్వింద్ నేరుగా రాజకీయాస్త్రాలు సంధిస్తూ.. తన ఆరెంజ్ ఆర్మీని జగిత్యాలలో ఉరుకులు పెట్టిస్తున్నారట. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు స్థలం గురించి మొదలైన వివాదం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రీయ విద్యాలయానికి కనీసం ఐదు ఎకరాలు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ.. రెండు ఎకరాలు మాత్రమే ఇచ్చి కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే సంజయ్‌ను టార్గెట్ చేశారు ఎంపీ అర్వింద్. కేంద్రీయ విద్యాలయ స్థల అంశాన్ని కామన్ మ్యాన్‌లో కూడా చర్చ జరిగేలా విద్యార్థుల భవిష్యత్తుతో ఎమ్మెల్యే ఆటలాడుతున్నారనే సెంటిమెంట్ అస్త్రాలను వాడింది బీజేపీ. సాధారణంగా ప్రజల్లో పెద్దగా చర్చకు రాని విద్యా సంస్థల అంశాన్ని కూడా రాజకీయ చర్చగా మార్చడంలో బీజేపీ సక్సెస్ అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర మంత్రులను మాత్రం అన్నలుగా సంబోధిస్తూనే.. జగిత్యాల ఎమ్మెల్యే విషయంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారట ఎంపీ అర్వింద్. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉందన్న చర్చ జరుగుతోంది.

ఇక కేవీ స్థల వివాదం ముగియక ముందే.. జగిత్యాలలో అవినీతిపై చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర పోస్టర్లు అంటించారు బీజేపీ నేతలు. ఇలా మరో ఎపిసోడ్‌తో ఎమ్మెల్యే సంజయ్ బీజేపీకి టార్గెట్ అయ్యారు. ఇక తనపై పోస్టర్లు అంటించిన జగిత్యాల బీజేపీ నాయకులు గతంలో మున్సిపల్ చైర్మన్‌గా చేసిన అవినీతిపై చర్చ చేద్దామా అంటూ కౌంటర్ పోస్టర్లు అంటించారు కాంగ్రెస్ నాయకులు. కానీ తనపై అర్వింద్ చేస్తున్న ఆరోపణలు... ఇటు స్థానికంగా బీజేపీ చేస్తున్న హడావుడిని ఎమ్మెల్యే సంజయ్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అజెండాను సెట్ చేసే స్థితిలో బీజేపీ కనిపిస్తుంటే.. ఆ అజెండాకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ కనిపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందట. బీజేపీ చేస్తున్న ఈ వరుస రాజకీయ దాడులతో సంజయ్ కాస్త వెనకబడిపోయారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే.. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను చూస్తూ డీలా పడిపోయిందట గులాబీ పార్టీ. నిజానికి నిన్న, మొన్నటి వరకు నాయకత్వ సమస్యతో ఇబ్బంది పడ్డ జగిత్యాల బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బలమైన నాయకుడు వచ్చినా ఆశించినంత యాక్టివ్‌గా మారలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఉన్నపళంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ జగిత్యాలపై ఫోకస్ పెట్టేందుకు కారణం కూడా ఇదేనన్న చర్చ జరుగుతోంది. జగిత్యాలలో గులాబీ పార్టీ స్పేస్‌ను పూర్తిగా బీజేపీతో ఫిల్ చేసేందుకు ప్లాన్ చేశారట అర్వింద్. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో 40 వేల ఓట్లు సాధించింది బీజేపీ. ఇక ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి ఓట్ షేర్ సాధించింది. ఈ క్రమంలోనే జగిత్యాలలో గులాబీ పార్టీని సైడ్ చేసి.. ఆ స్థానంలోకి బీజేపీని చేర్చే వ్యవహారంలో భాగంగానే ఈ పొలిటికల్ సిరీస్‌ను అర్వింద్ డైరెక్ట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి వచ్చిన తర్వాత గులాబీ పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని శ్రేణులు భావించినప్పటికీ.. ఇప్పటివరకు ఆ స్థాయి రాజకీయ వేడి కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తన మార్క్ ధర్నాలు, లెటర్లు రాయడం, పరామర్శలతో జీవన్ రెడ్డి ముందుకు సాగుతున్నప్పటికీ.. కార్యకర్తలు ఆశించిన దూకుడు మాత్రం ఇంకా కనిపించడం లేదట. దీంతో గులాబీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

మరోవైపు జీవన్ రెడ్డిని రాష్ట్రవ్యాప్తంగా వాడుకునేందుకు గులాబీ అధిష్ఠానం ప్రణాళికలు చేస్తోందట. ఈ పరిణామాలతో పాటు.. జగిత్యాలలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేవీ స్కూల్‌కు స్థలాన్ని ప్రభుత్వం అనుకున్నట్టుగా ఇవ్వకపోవడం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారిపోయిందనే చర్చ కూడా సాగుతోంది. ఇలా అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్.. రెండూ ఒకేసారి దొరికిపోయాయన్న భావనలో ఉందట కాషాయ పార్టీ. అందుకే ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట ఎంపీ అర్వింద్. వరుసగా పొలిటికల్ కార్యక్రమాలు చేస్తూ.. తానే నేరుగా జగిత్యాలకు వస్తూ కార్యకర్తలు, నాయకులను పరుగులు పెట్టిస్తున్నారట. జగిత్యాలలో కాంగ్రెస్‌ను బలహీనపరచడం ఒక లక్ష్యమైతే.. బీఆర్ఎస్ పొలిటికల్ స్పేస్‌ను ఆక్రమించడం మరో లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలానే ఇంకాస్త పుష్ చేస్తూ.. జగిత్యాలలో పార్టీని స్ట్రీమ్‌లైన్‌లో పెట్టుకోవడంతో పాటు.. జగిత్యాలలో పోటీ అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే పరిస్థితిని తీసుకురావాలనే వ్యూహంలో ఉన్నారట ధర్మపురి అర్వింద్.

నిజానికి ప్రస్తుతం జగిత్యాల రాజకీయాల్లో బీజేపీ అజెండాతోపాటు కాంగ్రెస్ రియాక్షన్ కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం తన తదుపరి అడుగు కోసం ఎదురుచూస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అప్పటివరకు బీజేపీ ఈ జోష్‌ను కొనసాగిస్తుందా..? కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేస్తుందా..? లేక తన రాజకీయ అనుభవంతో జీవన్ రెడ్డి మళ్లీ గులాబీ జెండాను బలంగా ఎగరేస్తారా..? అనేది వేచి చూడాల్సిందే.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story