Off The Record: జమ్మలమడుగులో తోడి కోడళ్ళదే హవా!

Off The Record: జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల్లో దేవుగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య నెలకొన్న ఆసక్తికర రాజకీయ సమీకరణాలు మరియు కోడళ్ల మధ్య పోటీపై ప్రత్యేక కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Oct 2026 7:57 AM IST
Off The Record
X

Off The Record: జమ్మలమడుగులో తోడి కోడళ్ళదే హవా!

Off The Record: కథా నేపథ్యం ఏమిటంటే.. జమ్మలమడుగు రాజకీయాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న రెండు ప్రముఖ కుటుంబాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక వైపు దేవుగుడి నారాయణ రెడ్డి కుటుంబం. ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు కోడళ్లు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ బరిలో నిలిచేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు. వీరు కేవలం కూటమి పార్టీల నాయకుల సతీమణులే కాదు, ఒకే ఇంటికి చెందిన కోడళ్లు కూడా కావడం విశేషం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కనుక జమ్మలమడుగు చైర్మన్ స్థానం ఓసీ మహిళకు రిజర్వ్ అయ్యి.. కూటమి పొత్తుల్లో భాగంగా.. తెలుగుదేశం పార్టీకి సీటు దక్కితే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి సతీమణి జ్యోతి బరిలోకి దిగాలని చూస్తున్నారట. ఒకవేళ సీటు భారతీయ జనతా పార్టీకి దక్కితే, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సతీమణి అరుణమ్మ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట.

అంటే, కూటమిలో ఏ పార్టీకి సీటు దక్కినా.. చైర్మన్ పీఠం మాత్రం దేవుగుడి కుటుంబం చేతిలోనే ఉండాలనే వ్యూహంతో వీరు ముందుకు వెళ్తున్నారన్న మాట. జమ్మలమడుగు అనగానే గుర్తొచ్చే మరో బలమైన పేరు.. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబం. దాదాపు మూడు దశాబ్దాలుగా దేవుగుడి నారాయణరెడ్డి కుటుంబానికి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబానికి మధ్య నడిచిన ఫ్యాక్షన్ రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధ్యలో కొద్దికాలం సద్దుమణిగినట్లు కనిపించినా, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ కుటుంబాలు మళ్లీ రాజకీయ విరోధులుగా మారిపోయాయి. ఇప్పుడు కూటమి రాజకీయాల్లో భాగంగా బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి, ఆయన అన్న కుమారుడైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి కలిసి ఒక వైపు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీ తరఫున పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబం నిలబడింది.

కేవలం ఎమ్మెల్యే స్థానాలకే కాదు.. ఏకంగా జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ స్థానానికి కూడా ఈ రెండు కుటుంబాల కోడళ్ల మధ్యే ప్రధాన పోటీ నడవనుండటం విశేషం. ఒకవైపు కూటమి తరఫున దేవుగుడి కుటుంబ కోడళ్లు సిద్ధమవుతుంటే, వారికి దీటుగా బరిలో నిలిచేందుకు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబం అంటే వైసీపీ నేత సతీమణి కూడా వ్యూహాలు రచిస్తున్నారట. అయితే జమ్మలమడుగు నియోజకవర్గంలో మొత్తం.. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల రెండు మున్సిపాలిటీలు. పొత్తుల సర్దుబాటులో భాగంగా ఈ రెండింటిలో ఒకటి బీజేపీకి, మరొకటి తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో కనుక జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ స్థానం ఓసీ మహిళకు రిజర్వ్ అయితే మాత్రం.. రాష్ట్రంలోనే ఈ ఎన్నికల ఫలితాలు అత్యంత ఉత్కంఠభరితంగా, సంచలనంగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంకా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఎన్నికల పొత్తుల తుది రూపు ఖరారు కాలేదు. సీట్ల కేటాయింపు జరగనేలేదు. అయినప్పటికీ, జమ్మలమడుగులో మాత్రం రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కడపలో మంత్రులు, ఎన్నికల పరిశీలకులు ఆశావహుల వినతులు స్వీకరిస్తూ హడావిడి చేస్తుంటే... జమ్మలమడుగు గడ్డపై మాత్రం ఫ్యాక్షన్ ప్రత్యర్థుల ఇళ్ల కోడళ్లు మున్సిపల్ పీఠం కోసం అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ రాజకీయ రణరంగంలో చివరికి ఎవరి గెలుపు జెండా ఎగురుతుంది..? వీరు అనుకుంటున్నట్లుగానే సమీకరణాలు మారుతాయా..? లేదా మరేదైనా సంచలనం సృష్టిస్తుందా..? వెయిట్ అండ్ సీ.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్