Off The Record: శ్రీకాకుళం మేయర్‌పై పవన్ సూపర్ ప్లాన్!

Off The Record: శ్రీకాకుళం నగర కార్పొరేషన్ మేయర్ స్థానం జనసేనకు కేటాయించగా, బీసీ మహిళా అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధారాణి పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Oct 2026 7:55 AM IST
Off The Record
X

Off The Record: శ్రీకాకుళం మేయర్‌పై పవన్ సూపర్ ప్లాన్!

Off The Record: శ్రీకాకుళం నగర కార్పొరేషన్ ఎన్నికలు కోర్టు వివాదాల కారణంగా ఇన్నాళ్లు జరగలేదు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ మేయర్ సీటు కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన ఖాతాలోకి వెళ్లడం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. దీంతో మేయర్ అభ్యర్థిత్వంపై కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టైంది.

బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ మేయర్ స్థానానికి జనసేన నేత డాక్టర్ దానేటి శ్రీధర్ సతీమణి దానేటి రాధారాణిని పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. నగర రాజకీయాల్లో వినిపిస్తున్న అన్ని ఊహాగానాలకు ఇదే సమాధానంగా మారిందంటున్నారు. ముఖ్యంగా అభ్యర్థి మార్పు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా భరోసా ఇవ్వడంతో ఇక చర్చలకు తావులేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు ఈ నిర్ణయం టీడీపీ వర్గాల్లోని కొందరు ఆశావహులకు నిరాశ కలిగించినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి బరిలోకి దిగనున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థిని ఎదుర్కోవాలంటే మేయర్ సీటు టీడీపీకే ఇవ్వాలని కొందరు నేతలు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే జిల్లా స్థాయి చర్చలు, అధిష్టానం వద్ద జరిగిన సంప్రదింపుల తర్వాత కూడా కూటమి నిర్ణయమే ఫైనల్ అని తేలడంతో మార్పుల అవకాశాలు లేకుండా పోయాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా, అభ్యర్థిత్వం ఖరారైందన్న సంకేతాలతో డాక్టర్ దానేటి శ్రీధర్ ఇప్పటికే రాజకీయ కార్యాచరణను వేగవంతం చేసినట్లు సమాచారం. నగరంలోని వివిధ వర్గాల ప్రతినిధులు, సామాజిక సంస్థలు, కూటమి నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. అధికారిక ప్రకటన కోసం వేచి చూడకుండా గ్రౌండ్ లెవెల్‌లో ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

అటు జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులను సమన్వయం చేస్తూ వార్డు వారీగా సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు మొదలైందట. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ వంటి కూటమి ముఖ్య నేతల మద్దతుతో ఎన్నికల వ్యూహాలు అమలు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

కూటమి అభ్యర్థిగా రాధారాణిని గెలిపించడమే లక్ష్యంగా జనసేన కేడర్ ఇప్పటికే రంగంలోకి దిగిందని చెబుతున్నారు. "శ్రీకాకుళం తొలి మేయర్ జనసేన నుంచే రావాలి... అది పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా ఇవ్వాలి" అనే నినాదంతో శ్రేణులు ముందుకు సాగుతున్నాయట. మరోవైపు వైసీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి కూడా బలమైన పోటీ ఇచ్చే అవకాశముండటంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారబోతోందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ "వికసిత్ భారత్", ముఖ్యమంత్రి చంద్రబాబు "స్వర్ణాంధ్ర", డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ "గ్రీన్ అండ్ క్లీన్ శ్రీకాకుళం" విజన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే అజెండాతో రాధారాణి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక ప్రచార వీడియోలు, వార్డు స్థాయి సమావేశాలు, భారీ బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలన్న ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయట.

ఇప్పటివరకు సాగిన అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ఒక విషయం మాత్రం స్పష్టమైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. శ్రీకాకుళం మేయర్ సీటు జనసేనదే... అభ్యర్థి రాధారాణియే... ఇక పోరు మాత్రం రాధారాణి వర్సెస్ లక్ష్మీదేవిగానే ఉండబోతోందన్న చర్చ నగర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్