Off The Record: గోదావరిపై పవన్ కళ్యాణ్ స్కెచ్!

Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల్లో గోదావరి జిల్లాలపై జనసేన ఫోకస్. ఎక్కువ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కోరుతున్న జనసేన పార్టీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Sept 2026 8:44 AM IST
Off The Record
X

Off The Record: గోదావరిపై పవన్ కళ్యాణ్ స్కెచ్!

Off The Record: ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి 32 శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉంది. ఆ పార్టీ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతుంది. అంటే అది గోదావరి జిల్లాల ఓటర్ల చలవే. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలోనే ఆ పార్టీ ఎక్కువ స్థానాలలో పోటీ చేసి గెలుపొందింది.

రెండున్నర సంవత్సరాల తర్వాత మరోసారి జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోబోతోంది. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావలంటే స్థానిక సంస్థల ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది.

గోదావరి జిల్లాల్లో మూడు కార్పోరేషన్లు, 22 మున్సిపాలిటీలలో అధిక శాతం తమకే కావాలని జనసేన పార్టీ ఓ ప్రతిపాదన టీడీపీ ముందు ఉంచుతోంది. దీనిలో భాగంగా ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోంది.

ప్రతీ కార్యకర్తను నేరుగా కలుసుకొని పార్టీ బలాన్ని అంచనా వేయనుందట. రిజర్వేషన్ల ప్రక్రియను ఆధారంగా అభ్యర్థులకు అవకాశం ఉంటుందన్న భరోసా కల్పిస్తుందట జనసేన అధిష్టానం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరులో కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతీ స్థానంలో విజయం సాధించి.. 100% స్ట్రైక్ రేటును నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జనసేన పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు.

అమలాపురం, ఏలూరు పార్లమెంట్‌ పరిధిల్లోని స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్.. జనసైనికులతో విస్తృతస్థాయిలో ఈమేరకు చర్చించారు.

స్థానిక ఎన్నికలను అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయి వరకు పక్కా ప్రణాళిక, సమన్వయంతో పని చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి అప్పలనాయుడు సూచించారు.

కూటమిలోని 3 పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య నిరంతరం సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, మూడు పార్టీల నాయకులు కలిసి పరిష్కరించుకునేలా సమన్వయ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.

జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందట. 2024లో త్యాగాలు చేశాం.. ఈసారి మాకూ అవకాశాలు ఇవ్వండి అనే నినాదంతో మున్సిపాలిటీ, కార్పోరేషన్‌లలో సింహాభాగం సీట్లు దక్కించుకొనేందుకు గోదావరి జిల్లాల సెంటిమెంట్‌ను వాడుకోనుందట.

కాపు సామాజికవర్గ ఓటర్లకు తమకు అండగా ఉన్నారని, ఇక్కడ నుంచి 2029 వరకు తమకు మద్దతుగా నిలవాలంటే స్థానికంగా జనసేన పార్టీ కూడా రాజకీయంగా మరింత బలమైన శక్తిగా ఎదగాలని కూటమి పెద్దలకు చెప్పనున్నారట ఆ పార్టీ సీనియర్లు. గోదావరి జిల్లాల సెంటిమెంట్‌లో రాష్ట్రంలో కూటమి మున్సిపాలిటీ ఎన్నికల వార్ వన్ సైడ్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి.. జనసేన కోరుకున్నన్ని సీట్లు దక్కించుకుంటుందో లేదో చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్