Jordar Varthalu: తోటి కానిస్టేబుల్ కి శ్రీమంతం చేసిన పోలీసులు
Jordar Varthalu: జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా జరిగిన సీమంతం వేడుక. తోటి మహిళా కానిస్టేబుల్ సవితకు తండ్రిలా అండగా నిలిచిన ఎస్‌హెచ్‌ఓ గడ్డం మల్లేష్ మరియు సిబ్బంది.
Jordar Varthalu: తోటి కానిస్టేబుల్ కి శ్రీమంతం చేసిన పోలీసులు
Jordar Varthalu: ఈ వీడియో సూస్తుంటే పోలీసులంత ఈ అక్క శ్రీమంతం కార్యక్రమానికి పోయినట్టున్నదని అన్పిస్తున్నదిగదా. పోలీసులు ఆ కార్యానికి పోవుడుగాదు., పోలీసులే దగ్గరుండి మరీ తోటి మైళా కానిస్టేబుల్ కు ఈ శ్రీమంతం కార్యాన్ని జేశిర్రు. పట్నం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల డ్యూటీ జేశే సవిత అనే కానిస్టేబుల్ కు పాపం శిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమయ్యిర్రట. కన్నోళ్లు ఉంటే శ్రీమంతం కార్యాన్ని జర్పిత్తురు. వాళ్లు లేరుగావట్టి., నాకా భాగ్యం లేదనుకుని బాధవడ్తున్న సవితక్క ఆనందాన్ని రొండింతలు పెంచే పని ముంగటేస్కున్నడు జీడిమెట్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గడ్డం మల్లేశ్ సారు. కన్నతండ్రి లెక్క అయినే దగ్గరుండి మరీ శ్రీమంతం కార్యాన్ని జేయించిండు. దినాం పన్జేశే పోలీస్ స్టేషన్నే సవితక్కకు పుట్టిల్లును జేశి ఈ వేడుక నిర్వహించిండు. తల్లి అయినంక పొందే ఆనందాన్ని ముందుగాల్నే పొందేతట్టు జేశిండు. ఆ స్టేషన్ల పన్జేశే తోటి సిబ్బంది మొత్తం తోడవుట్టినోళ్ల లెక్క మారి సంబురాన్ని రెట్టింపు జేశిర్రు. కన్నోళ్లు లేరన్న లోటు తెల్వకుంట జేశి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీర, గాజులు, స్వీట్లు అన్నీ తీస్కచ్చి ఘనంగ జేశిర్రు శ్రీమంతం కార్యాన్ని. పండంటి బిడ్డకు జన్మనియ్యాల్ని అందరు నిండు మన్సుతోని ఆశీర్వదించిర్రు.
ఈ అక్క ఇంత గొప్పగ జెప్తున్నదంటే ఆ సారు ఎంత మంచిగ సూస్కున్నడనేది దీన్ని వట్టే అర్థమైతున్నది. మొదటి రోజు నుంచే ఏం టెన్షన్ లేకుంట పన్జేస్కొమ్మని జెప్పేదట. డెలివరీ అయ్యేరోజు గుడ డ్యూటీ చెయ్యాలని అనుకున్నదంటెనే ఆ సారు మంచితనం ఎసొంటిదనే తెలుస్తున్నది.
ప్రతీ ఆడివిల్లకు తల్లి అవ్వడమనేది ఎంతో సంతోషాన్నిస్తది. ఆ కోరిక నెరవేరుతున్న ఆనందంల ఇంత బ్రమ్మాండంగ కార్యక్రమం జేశినందుకు సంతోషంతోనే మస్తు దుఖ:పడ్డదిట్ల. మరిగ బాస్ అంటే కింద పన్జేటోల్లను రాచిరంపాన పెట్టినట్టు జేసుడేగాదు వాళ్ల కష్టసుఖాల్ల సుతం తోడుండేటోళ్లని నిరూపించిన మల్లేష్ సారును మన జోర్దార్ తర్పున సుతం తారీఫ్ జేస్తున్నం. ఇగీ సారును ఆదర్శంగ తీస్కోని కడ్మ సార్లు గుడ తోటి ఉజ్జోగులతోని గిట్లనే తోడునీడ లెక్కన ఉండాల్నని కోరుకుంటున్నం.




