Burning Topic: జైషే స్థావరం మళ్లీ రెడీ.. పాక్‌ ప్రభుత్వం భారీ నిధులు!

Burning Topic: భారత వైమానిక దళం దాడుల్లో ధ్వంసమైన జైషే మొహమ్మద్ హెడ్‌క్వార్టర్స్ పునర్నిర్మాణం. పాక్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నట్లు నిఘా వర్గాల వెల్లడి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Aug 2026 7:55 AM IST
Burning Topic
X

Burning Topic: జైషే స్థావరం మళ్లీ రెడీ.. పాక్‌ ప్రభుత్వం భారీ నిధులు!

Burning Topic: పాకిస్థాన్‌ అంటేనే ఉగ్రవాదులకు స్వర్గధామం. ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ, సైన్యం మద్దతుతో భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హర్కతుల్ ముజాహిదీన్ పని చేస్తు్న్నాయి. అల్‌ఖైదా, హక్కానీ నెట్‌వర్క్‌ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు కూడా అక్కడ ఉన్నాయి.

భారత్ ఆధారాలతో సహా వీటిని బయట పెట్టినా, అవన్నీ నిరాధారమని బుకాయించడం పాకిస్థాన్‌‌కు పరిపాటి అయింది. పైగా తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు అంతర్జాతీయ వేదికలపై తామే ఉగ్రవాద బాధితులమని బుకాయిస్తూ వస్తోంది.

అయితే పాకిస్థాన్ కటప స్వరూపాన్ని బయట పెట్టే మరో ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గతేడాది భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో పూర్తిగా ధ్వంసమైన జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన స్థావరాన్ని మళ్లీ పునర్నిర్మించారు. ఇందు కోసం పాకిస్తాన్‌ భారీగానే నిధులు కేటాయించడం బయటకు వచ్చింది.

2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టడం తెలిసిందే. నాటి దాడిలో పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్‌లో నిషేధిత జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన మర్కజ్‌ సుభాన్‌ అల్లా ప్రధాన కార్యాలయం తీవ్రస్థాయిలో ధ్వంసమైంది.

భారత వైమానిక దళం ఉగ్రవాద స్థావరాలను, శిక్షణ కేంద్రాలను నేలమట్టం చేసింది. ముష్కరులకు భారీగా నష్టం వాటిల్లింది. అత్యంతక కచ్చితంత్వంతో జరిగిన నాటి దాడిలో జైషే మొహమ్మద్‌ వ్యవస్థాపకుడు మసూద్ అజర్‌ కుటుంబానికి చెందిన 10 మందితో పాటు, మరో నలుగురు సన్నిహిత సహచరులు మరణించారు.

ఈ ఘటనతో పాకిస్థాన్‌ ఉగ్రమూలాల గురించి ప్రపంచానికి తెలిసింది. ఇంతా జరిగినా ఆ దేశానికి ఏమాత్రం బుద్ధి రాలేదు. ఇప్పుడు ధ్వంసమైన జైషే మొహమ్మద్‌ భవనాన్ని తిరిగి నిర్మించారు. పనులన్నీ పూర్తయి మళ్లీ ఉగ్ర కార్యకలాపాలను సాగించేందుకు సిద్ధమైంది.

జైషే మహమ్మద్ స్థావరం ఇప్పుడు కొత్త హంగులతో తిరిగి పునరుద్ధరించబడింది. దాడుల వల్ల ఏర్పడిన నష్టం బయటకు కనిపించకుండా పూర్తిగా మరమ్మతులు చేశారు.సముదాయానికి ఆనుకుని దెబ్బతిన్న నిర్మాణాలను కూడా తొలగించి, వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

కాగా పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆర్థికంగా అండదండలు అందించినట్లు నిఘా వర్గాల సమాచారం. దాదాపు 25 కోట్ల పాకిస్థానీ రూపాయలను నగదు వాయిదాల రూపంలో అందించినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు రూ.11 కోట్లను ప్రత్యేకంగా సెంట్రల్‌ హాల్‌ పునర్నిర్మాణం కోసం ఖర్చు చేశారు.

ఆపరేషన్‌ సింధూర్‌ జరిగిన 15 నెలల తర్వాత ఈ పునర్నిర్మాణం పూర్తయింది. పాకిస్థాన్ జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోకపోగా స్వయంగా భవన పునర్నిర్మాన పనులకు అర్థిక సాయం అందించడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి

భారత్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్కజ్‌ సుభాన్‌ అల్లా హెడ్‌ క్వార్టర్‌ను జైషే మొహమ్మద్‌ తమ కార్యకర్తల నియామకం, శిక్షణ, సిద్ధాంతాల బోధన కోసం ఉపయోగిస్తోంది. ఈ 18 ఎకరాల ‘ఉస్మాన్‌–ఓ–అలీ క్యాంపస్‌’ ప్రాంగణంలో ఒక మసీదు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.

వాస్తవానికి జైషే మొహమ్మద్‌ను పాకిస్తాన్‌ ప్రభుత్వం కేవలం అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో 2002లో∙నిషేధించినప్పటికీ ఆ సంస్థ పాక్‌ నుంచే తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకోవడం, పుల్వామా ఆత్మాహుతి దాడి తదితర వ్యూహాలు ఇక్కడే పన్నినట్లు సంబంధిత వర్గాలు చెబుతుంటాయి.

ఆపరేషన్ సిందూర్ తర్వాత జైష్-ఎ-మొహమ్మద్‌, ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల కేంద్రాలను ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌కు తరలించినట్లు అప్పట్లో నివేదికలు వచ్చాయి మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రదారి లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు కోర్టు సమన్లు జారీ చేసే దిశగా భారత్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.

నాటి దాడిలో 26 మంది పైగా అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో NIA హఫీజ్‌ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో అతడిపై ఇప్పటికే జమ్మూలోని ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌లో ఉన్నందున భారత దర్యాప్తు సంస్థలు నేరుగా అతడికి కోర్టు నోటీసులు అందజేయడం సాధ్యం కాదు.

అందుకే పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక వ్యవస్థ ద్వారా కోర్టు సమన్లు అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఒక నిందితుడికి కోర్టులో హాజరై తన వాదన వినిపించే అవకాశం ఇచ్చినట్లు చట్టపరమైన రికార్డులో నమోదు చేశారు. హఫీజ్‌ సయీద్‌ కోర్టుకు హాజరుకాకపోతే, తదుపరి దశగా అతడిని "ప్రొక్లెయిమ్డ్ అఫెండర్" గా ప్రకటించే ప్రక్రియకు మార్గం సుగమం అవుతుంది.

ఇక 2008 నవంబర్ 26న జరిగిన ముంబయి ఉగ్రదాడుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌లుగా నిషేధిత లష్కరే తోయిబా వ్యవస్థాపకులు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ సహా మొత్తం ఆరుగురు ప్రధాన నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చేసేందుకు ముందడుగు పడింది.

ఆ పరారీలో ఉన్న నిందితులపై కోర్టు జారీ చేసిన ప్రకటన ఉత్తర్వుల్ని అందజేసేందుకు ముంబయి పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఈ ఉగ్రవాదులకు ఇంటర్‌పోల్ ద్వారా నోటీసుల్ని జారీ చేయాలని ముంబయి పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన హఫీజ్‌ సయీద్‌ ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసుల్లో అతడికి శిక్ష పడిన తర్వాత పాకిస్థాన్ అధికారుల అదుపులోనే ఉన్నాడని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story