Burning Topic: వాతావరణ మార్పులతో అంతరిస్తున్న పక్షులు!

Burning Topic: జిమ్ కార్బెట్ జాతీయ పార్క్‌లో ఆందోళనకరంగా తగ్గుతున్న పక్షి జాతుల సంఖ్య. పర్యావరణ మార్పులు, మానవ జోక్యమే కారణమంటున్న నిపుణులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Nov 2026 7:50 AM IST
Burning Topic
X

Burning Topic: వాతావరణ మార్పులతో అంతరిస్తున్న పక్షులు!

Burning Topic: ప్రకృతి మాత పచ్చటి ముసుగు వేసుకున్నట్లు ఉంటుంది అక్కడి దృశ్యం. దట్టమైన వృక్షాల అడవులు, విశాలమైన పచ్చికభూములు, కొండలు గుట్టలు, నదీ లోయలతో కను విందు చేస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పాదాల చెంత విస్తరించిన సుప్రసిద్ధ జాతీయ ఉద్యానవనం ఇది. ప్రఖ్యాత ఆంగ్లో ఇండియన్ వేటగాడు, ప్రకృతి ప్రేమికుడు జిమ్ కార్బెట్ పేరుతో ఏర్పాటైన ఈ పార్క్ దాదాపు 520.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. చుట్టుపక్కల ఉండే బఫర్ జోన్లు అటవీ ప్రాంతాలను మొత్తంగా కలుపుకుంటే దీని మొత్తం వైశాల్యం దాదాపు 1,288 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ పార్క్ గుండా ప్రవహించే రామ్‌గంగ, కోసి, సోనానది వంటి ప్రవాహాలు ఈ అడవికి మరింత అందాన్ని, జీవకళను చేకూరుస్తాయి. నగరాల రణగొణ ధ్వనులకు దూరంగా జంతువులు, పక్షుల కూతలు, ఆకుల కదలికల మధ్య ప్రకృతితో మమేకమయ్యే ఒక ప్రశాంతమైన అనుభూతిని ఈ పార్క్ కలిగిస్తుంది.

పెద్ద పులుల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనంలో దట్టమైన పొదల్లోంచి నిశ్శబ్దంగా నడిచివచ్చే రాయల్ బెంగాల్ టైగర్ రాజసాన్ని చూడటం ఒక మరపురాని అనుభూతి. దేశంలో పులుల రక్షణ కోసం 1973లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక సేవ్ టైగర్ ప్రాజెక్టును మొట్టమొదట ఇక్కడి నుంచే ప్రారంభించారు. అంతరించిస్తున్న పులులను వేటగాళ్ల నుండి రక్షించడానికి, వాటి సంతతిని వృద్ధి చేయడానికి ఈ పార్కును ప్రధానంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 250 దాకా పులులు ఉన్నాయి. అంతే కాదు గుంపులు గుంపులుగా తిరిగే దాదాపు 1,100 ఏనుగులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వీటితో పాటు చిరుతపులులు, చీతల్, సాంబార్, మొరిగే జాతుల జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు వంటి ఎన్నో జంతువులు ఉన్నాయి. దాదాపు 50కి పైగా రకాల క్షీరద జాతులు, 25 జాతుల సరీసృపాలు, 580 పైగా విభిన్న దేశీయ, వలస పక్షి జాతులు సంచరిస్తుంటాయి.

కాగా జిమ్ కార్బెట్ పార్కు పులుల సంరక్షణలో ఈ పార్క్ ఎంతో విజయవంతమైనప్పటికీ, పక్షుల మనుగడకు మాత్రం కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక్కడి పక్షి జాతులు ఎంతో అద్భుతంగా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఒకప్పుడు పక్షుల కిలకిలరావాలతో కళకళలాడిన ఈ అడవిలో.. ఇటీవల కాలంలో పక్షి జాతుల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోతోందని పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కప్పుడు ఈ అడవి అంతటా విస్తరించి కనిపించిన మయూరాలు (Peacocks), అడవి కోళ్లు (Jungle Fowl), ఎర్ర అడవి కోళ్లు ( Kalij pheasants), తీతువు పిట్టలు (Lapwings) వంటి సాధారణంగా కనిపించే పక్షుల సంఖ్య కూడా ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టిందని నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం ఈ జాతీయ ఉద్యానవనం మీద పడిన కారణంగానే ఇక్కడ పక్షుల జనాభా క్షీణిస్తోందని తెలుస్తోంది.

జిమ్ కార్బెట్ పార్కులో మానవ కదలికలు నిశబ్ద వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయని చెబుతున్నారు. పర్యాటకుల సందడి రోజు రోజుకీ పెరిగిపోతోంది. సఫారీ వాహనాల శబ్దాల కారణంగా పక్షుల ప్రశాంతతకు భంగం కలుగుతోంది. అడవుల క్షీణత, పర్యావరణ మార్పుల వల్ల పక్షులకు అవసరమైన కీటకాలు, పండ్లు, గింజలు లభించడం తగ్గింది. పక్షులు గూళ్లు కట్టుకోవడానికి అనువైన చెట్లు కూడా తగ్గిపోతున్నాయి. సహజసిద్ధమైన అడవుల స్థానంలో పైనాపిల్ వంటి మోనోకల్చర్ తోటలు పెరగడం లేదా అడవులు పొదలుగా మారడం వల్ల అడవి పక్షులకు మనుగడ కష్టంగా మారింది. పార్క్ చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యవసాయంలో వాడే పురుగుల మందులు, కాలుష్యం పక్షుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పక్షుల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలు తాత్కాలికమా?జీవవైవిధ్యం ఏదైనా పెద్ద మార్పును సూచిస్తోందా అనే దానిపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు.

మొత్తం మీద జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనంలో పక్షుల జనాభా తగ్గడానికి ప్రధానంగా నాలుగు అంశాలను నిపుణులు అంచనా వేస్తున్నారు.. అవి.. అడవుల విస్తీర్ణం లేదా నాణ్యత దెబ్బతినడం.. 2. వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పులు.. 3. పక్షులకు అవసరమైన కీటకాలు, గింజలు వంటి ఆహార లభ్యత తగ్గడం.. 4. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుతున్న నిర్మాణాలు, మానవ కార్యకలాపాలు.

జిమ్ కార్బెట్ పార్కులో పక్షులు ఇలా వేగంగా తగ్గిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించడానికి, తగిన సంరక్షణా చర్యలు చేపట్టడానికి తక్షణమే ఒక సమగ్రమైన శాస్త్రీయ పరిశోధన జరగాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. దీనిపై అటవీ శాఖ అధికారులు ఈ అంశంపై స్పందిస్తూ.. క్షేత్ర స్థాయిలో పని చేసే తమ సిబ్బంది నుండి నివేదికలు సేకరిస్తామని, పరిస్థితి తీవ్రతను బట్టి అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరోవైపు జిమ్ కార్బెట్ పార్కులో పసిఫిక్ గోల్డెన్ ప్లవర్ పక్షి ఇటీవలి కాలంలో సందడి చేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రాంతంలో తొలిసారిగా ఈ అరుదైన వలస పక్షి కనిపించిందని అధికారులు చెబుతున్నారు పసిఫిక్ గోల్డెన్ ప్లవర్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన వలస పక్షులలో ఒకటి. సంతానోత్పత్తి కాలంలో వీటి ముఖం, రొమ్ము , పొత్తికడుపు భాగం నల్లగా మారి, వీపు భాగం ప్రకాశవంతమైన బంగారు-పసుపు రంగు మచ్చలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. సంతానోత్పత్తి లేని సమయాల్లో ఇవి కాస్త మసక బూడిద-గోధుమ రంగులోకి మారుతాయి. పసిఫిక్ గోల్డెన్ ప్లవర్ పక్షి అలాస్కా, సైబీరియా, ఆర్కిటిక్ సహా భూమిపై అత్యంత శీతల ప్రాంతాలకు చెందినది. చలికాలం రాగానే అక్కడి నుంచి దాదాపు 12,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ దీవులతో పాటు భారత దేశానికి వలస వస్తుంది. ఈ అరుదైన పక్షి సందడిపై జిమ్ కార్బెట్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్