Off The Record: పాంచజన్యంతో జోరు మీదున్న కవిత!

Off The Record: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత దూకుడు. కుటుంబ రాజకీయ విమర్శల నుంచి ప్రజా సమస్యల వైపు మలుపు. కోస్గి వేదికగా తదుపరి పాంచజన్య సంకల్ప సభ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Sept 2026 8:55 AM IST
Off The Record
X

Off The Record: పాంచజన్యంతో జోరు మీదున్న కవిత!

Off The Record: తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో.. కల్వకుంట్ల కవిత ప్రధానంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీశ్‌రావుపై కూడా విమర్శలు చేశారు. దీంతో కుటుంబ రాజకీయాల నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది.

అయితే.. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో కవిత తన విమర్శల పరిధిని మరింత విస్తరించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటివరకు బీఆర్‌ఎస్ చుట్టూనే సాగిన కవిత రాజకీయ పోరాటం..

ఇక రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలపైనా ఫోకస్ పెంచనుందా..? అన్న చర్చ జరుగుతోంది. పార్టీని కేవలం విమర్శలకే పరిమితం చేయకుండా.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రశాంత్‌రెడ్డిని శకునితో పోలుస్తూ కవిత చేసిన వ్యాఖ్యలతో.. కవిత రాజకీయ గేరును మార్చారా? అన్న చర్చ మొదలైంది. కేవలం కుటుంబం, బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలకు పరిమితం కాకుండా.. ప్రజా సమస్యలే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, సామాజిక న్యాయం.. ఈ ఐదు అంశాలనే ‘పాంచజన్యం’గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కవిత. ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఈ అంశాలపై ఉద్యమాలు, సభలు నిర్వహిస్తూ.. పార్టీకి ప్రజల్లో గుర్తింపు తీసుకురావడంపై కవిత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పాంచజన్యం సభలను పార్టీ విధానాలను ప్రజలకు వివరించే వేదికలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక.. తదుపరి పాంచజన్య సంకల్ప సభకు కోస్గి వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలోనే భారీ సభ నిర్వహించనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం పార్టీ కార్యక్రమమేనా..? లేక అధికార కాంగ్రెస్‌కు.. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచే రాజకీయ సవాల్ విసిరే వ్యూహమా..?

అన్న చర్చ ఊపందుకుంది. నిజామాబాద్‌లో వచ్చిన స్పందనను కొనసాగిస్తూ.. కోస్గి సభకు కూడా భారీగా జన సమీకరణ చేయడంపై పార్టీ దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు. కోస్గి తర్వాత ఇతర జిల్లాల్లోనూ పాంచజన్య సభలు నిర్వహించి.. పార్టీని క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నది కవిత వ్యూహంగా కనిపిస్తోంది.

ఇక MPTC, ZPTC, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం తెలంగాణ రక్షణ సేనకు కీలక రాజకీయ పరీక్షగా మారనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మండల, జిల్లా స్థాయిలో పోటీ చేయడంతోపాటు.. పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీ ఉనికిని చాటుకునేలా వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా హైదరాబాద్‌లో GHMCతోపాటు CMC, MMCల్లోనూ పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పార్టీని విస్తరించేందుకు కవిత ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఎక్కడ పార్టీకి బలమైన కేడర్ ఉంది..?

ఎక్కడ స్థానికంగా ప్రభావం ఉన్న నాయకులు ఉన్నారు..? ఏయే ప్రాంతాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి..? అనే అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే.. భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎంతవరకు ప్రభావం చూపగలదో ఒక అంచనాను ఇచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా.. తెలంగాణ రక్షణ సేనతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కవిత.. పాంచజన్యం పేరుతో ప్రజా సమస్యలను ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు. నిజామాబాద్ తర్వాత కోస్గి.. ఆ తర్వాత మరిన్ని ప్రాంతాల్లో వరుస సభలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

MPTC, ZPTC నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుండటంతో.. పార్టీ విస్తరణపై కవిత ఎంత సీరియస్‌గా ఉన్నారన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోనూ పోటీకి దిగితే.. తెలంగాణ రక్షణ సేనకు అది మరో కీలక రాజకీయ అడుగు కానుంది.

మరి పాంచజన్యం ఎజెండాతో కవిత ప్రజల్లో ఎంతమేరకు ఆదరణ సంపాదిస్తారు..? ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన ఎలాంటి ప్రభావం చూపనుంది..? మరో ప్రాంతీయ రాజకీయ శక్తిగా ఎదిగే దిశగా కవిత వేసే అడుగులు ఫలిస్తాయా..? అన్నది ఆసక్తికరంగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్