Off The Record: రేవంత్ టీమ్‌లో కడియంకు కీలక పదవి..?

Kadiyam Srihari: రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి వెళ్లడంతో ఖాళీ అయిన సీఎం సలహాదారు పదవికి కడియం శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వరంగల్ నేతల ఢిల్లీ పర్యటన మరియు రేవంత్ రెడ్డి వ్యూహాలపై ప్రత్యేక కథనం.

Arun Chilukuri
Updated on: 30 April 2026 6:58 AM IST
Kadiyam Srihari
X

Kadiyam Srihari: రేవంత్ టీమ్‌లో కడియంకు కీలక పదవి..?

Kadiyam Srihari: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఆయన అడుగుల్లో అడుగులు వేసి, వెంట నడిచిన నాయకుడు వేంనరేందర్ రెడ్డి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు పెద్ద పదవి దక్కింది. ముఖ్యమంత్రి సలహాదారుగా ఆయనకు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో వేం నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర మరింత పెంచడం కోసం వేం నరేందర్ రెడ్డిని పెద్దల సభకు పంపారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేశారు..

వేంనరేందర్ రెడ్డి పెద్దల సభకు వెళ్లడంతో ఇప్పుడు సీఎం సలహాదారు ఎవరు..? ఎవరిని ఆ పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు..? ఎవరి సలహాల మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపనున్నారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే మళ్లీ వరంగల్ జిల్లాకే సీఎం సలహాదారు పీఠం దక్కబోతోందనే ప్రచారం అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం శ్రీహరికి సీఎం సలహాదారు బాధ్యతలు అప్పచెబుతారని ప్రచారం జరుగుతోంది.

కడియం శ్రీహరి రాజకీయ జీవితంలో ఉపముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, MLC పదవులను నిర్వహించారు. ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనకు ఇపుడు మరింత కీలక పదవి సీఎం సలహాదారు పీఠం దక్కబోతోందని సమాచారం. అయితే కడియం శ్రీహరికి సీఎం సలహాదారు స్థానం కట్టబెట్టడంపై హస్తినలో చక్రం తిప్పుతున్నట్లుగా సమాచారం. అందులో భాగంగానే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతలు, DCC ప్రెసిడెంట్లు అంతా ఢిల్లీ బాట పట్టారు. పెద్దల సమక్షంలో మేమంతా ఒకే మాట మీద ఉన్నాం, కలిసి నడుస్తున్నాం, మా పెద్దాయనకే ఆ పగ్గాలు అప్పచెప్పాలని సంకేతాలు ఇచ్చిన్నట్లుగా ప్రచారం. కడియం శ్రీహరి కూతురు ఎంపీ కడియం కావ్య డైరెక్షన్‌లో వరంగల్ చెందిన నేతలంతా ఢిల్లీ బాట పట్టినట్లుగా తెలుస్తోంది.

ఐతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కడియం శ్రీహరివైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2023 సాధారణ ఎన్నికల్లో BRS పార్టీ నుంచి గెలిచిన ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి కాంగ్రెస్ గూటికి చేర్చుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హామీ నెరవేర్చడంతోపాటు కడియం శ్రీహరికి సీఎం సలహాదారు పీఠం అప్పజెప్పబోతున్నారని టాక్. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా కడియం శ్రీహరిని పొగడ్తలతో ముంచెత్తడం.. ఆయన సీనియారిటీ, సిన్సియారిటీ, అనుభవంపై అసెంబ్లీని తూర్పార పట్టడం ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చినట్లుగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. కడియం సీనియారిటీ, సిన్సియారిటీని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని నడపడంలో ఆ హెడ్మాస్టర్ సలహాలు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కడియం శ్రీహరికి సీఎం సలహాదారు పీఠం కట్టబోతున్నారన్న లీక్ ఇచ్చినట్టు టాక్.

అయితే ఇప్పటికే పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చం కాంగ్రెస్ అనే విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎడముఖంపెడముఖంగా ఉంటున్నట్లుగా ప్రచారం. నాడు టీడీపీలో తన వెంట నడిచిన నాయకులకు రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చెవులు కోరుకుంటున్నారట. ఇలాంటి క్రిటికల్ సమయంలో కడియం శ్రీహరికి రేవంత్ రెడ్డి ఆ సలహదారు పీఠం కట్టబెడతారా..? లేక ఇంకా ఎవరైనా సీనియర్‌ను ఆ స్థానంపై కూర్చోబెడతారా అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న నేత.. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలిగిన కడియం శ్రీహరి పేరు దాదాపుగా ఫైనల్ అయినట్లేనని ఢిల్లీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఢిల్లీ వెళ్లిన వేం నరేందర్ రెడ్డి వెంట ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలు కూడా వెళ్లడం హాట్ టాపికైంది. వీరంతా ఢిల్లీ పెద్దల దగ్గర మంత్రాంగం నడిపి.. ముఖ్యమంత్రి సలహాదారు పదవికి కడియం పేరు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి డైరెక్షన్‌లోనే వరంగల్ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. ఇంతకీ సీఎం సలహాదారు పదవి.. నిజంగా కడియంను వరించనుందా..? మరెవరైనా ఆ పదవి రేసులో ఉన్నారా..? అన్న సస్పెన్స్‌కు కొద్ది రోజుల్లో తెర పడనుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story