Burning Topic: కనిష్క విమాన విధ్వంసం ఖలిస్థానీలపనే: 41 ఏళ్ల తర్వాత అధికారికంగా ఒప్పుకున్న కెనడా!
Burning Topic: ఎయిరిండియా కనిష్క విమాన ప్రమాదం జరిగిన 41 ఏళ్ల తర్వాత కెనడా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
Burning Topic: కనిష్క విమాన విధ్వంసం ఖలిస్థానీలపనే: 41 ఏళ్ల తర్వాత అధికారికంగా ఒప్పుకున్న కెనడా!
Burning Topic: 80వ దశకంలో పంజాబ్ కేంద్రంగా కొనసాగిన ఖలిస్థానీ వేర్పాటువాద ఉద్యమం భారత్ నేలపై అంతరించి రెండు దశాబ్దాలు గడిపోయింది. అయితే విదేశాల్లోని ఆ సంస్థ మద్దతుదారులు ఈ ఉద్యమం చల్లారకుండా నిరంతరం భారత దేశాన్ని చికాకుపరుస్తున్నారు. ముఖ్యంగా కెనడా దేశం ఖలిస్థానీలకు స్వర్గధామంగా మారింది. ఆ దేశం మొదటి నంచి ఈ విషయంలో మెతక వైఖరి అవలంభిస్తోంది. తమ దేశంలో ఖలిస్థానీల కార్యకలాపాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ పరోక్షంగా మద్ధతు ఇస్తోంది. అయితే ఇటీవలి కాలంలో కెనడా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిన్టలు కనిపిస్తోంది. ఎయిరిండియా కనిష్క విమాన ప్రమాదం జరిగి 41 ఏళ్లు గడిచిన తర్వాత తొలిసారిగా ఆ ఘటనలో ఖలిస్థానీ ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారికంగా అంగీకరించింది కెనడా. ఇన్నాళ్లుగా భారత్ చేసిన ఫిర్యాదులను పట్టించుకోని ఆ దేశం, ఇప్పుడు ఆనాటి దారుణ మారణ కాండకు ఖలిస్థానీ సంస్థే కారణమని స్పష్టం చేసింది.
1985 జూన్ 23న కెనడా నుంచి లండన్ మీదుగా భారత్‌కు వస్తున్న కనిష్క ఎయిరిండియా విమానం ఐరిష్ కోస్ట్ వద్ద గాలిలోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 329 మంది చనిపోయారు. అందులో 268 మంది కెనడా పౌరులు, 24 మంది భారతీయులు ఉన్నారు. చనిపోయిన కెనడా పౌరులలో కూడా ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. దీంతో ఈ ప్రమాద ఘటన ఇరు దేశాల్లోనూ విషాదం నింపింది. ఈ విమానాన్ని ఖలిస్థాన్ ఉగ్రవాదులు సూట్‌కేసు బాంబులతో గాల్లోనే పేల్చేశారని తేలింది. ఈ ఘటన జరిగిన కొంత కాలానికి ఉగ్రదాడి జరిగిన కొన్ని నెలల తర్వాత నిషేధిత తీవ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా సంస్థకు చెందిన ఉగ్రవాదులు తల్వీందర్ సింగ్ పర్మార్, ఇంద్రజీత్ సింగ్ రియాత్‌లను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. పర్మార్‌పై భారత్‌లో అప్పటికే హత్యకేసులు ఉన్నాయి. కెనడాలోనే దాక్కున్న పర్మార్‌ను తమ దేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది.
కాగా ఆనాటి కెనడా ప్రధాని పిరె ట్రూడో భారత ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చారు. తల్వీందర్ సింగ్ పర్మార్‌ను వెనకేసుకువచ్చారు. ఇందర్‌జిత్‌సింగ్‌కు మాత్రమే 15 ఏళ్ల జైలు శిక్ష విధించి అందరినీ వదిలేశారు. ఈ విమాన ప్రమాదం జరగటానికి ముందే ఉగ్రవాదులు విమానదాడులకు పాల్పడే అవకాశం ఉందని భారత నిఘావర్గాలు సమాచారం ఇచ్చినా కెనడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగార కీలక ఆధారాలను సైతం కెనడా అధికారులు దాచేశారని ఆరోపణలున్నాయి. ఈ ప్రమాదంపై విచారించిన జస్టిస్ జాన్ మేజర్ కమిషన్ కూడా కెనడా నిఘా విభాగాన్ని, పోలీసులను, అధికారులను తీవ్రంగా తప్పుపట్టింది. ఉగ్రవాదులు బాంబులు తయారు చేస్తున్నారనే సమాచారం ఉన్నా పిరె ఇలియట్ ట్రూడోకు ముందే తెలిసినా చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత లభించిన కొన్ని కీలక ఆధారాలను సైతం కెనడా అధికారులు దాచేశారని అంటుంటారు.
వాస్తవానికి భారత ప్రభుత్వం ఇందర్‌జిత్‌సింగ్ పర్మార్‌ను తమకు అప్పగించాలని 1982లోనే కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ పిరె ట్రూడో ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అందుకు కెనడా అధికారులు చూపిన సాకు... ఎలిజబెత్ రాణి హోదా! భారత్ ఎలిజబెత్ రాణిని కామన్వెల్త్ అధినేతగానే గుర్తిస్తోంది తప్ప.. తమ దేశ అధినేతగా గుర్తించటం లేదు కాబట్టి... భారత్, కెనడాల మధ్య కామన్వెల్త్ దేశాలకు వర్తించే నేరగాళ్ల అప్పగింత ఒప్పందం లేదని కెనడా దౌత్యవేత్తలు స్పష్టం చేశారు. కాగా పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి దొంగతనంగా అడుగుపెట్టిన పర్మార్... 1992లో పంజాబ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. ఆనాటి కెనడా ప్రధాని పిరె ట్రూడో కుమారుడే జస్టిన్ ట్రుడో.. తండ్రి మార్గంలోనే నడుస్తూ ఖలిస్తానీలకు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే 2023లో ఖలిస్థానీ వేర్పాటువాద నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనతో ఇరుదేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ స్వయంగా నాటి ప్రధాని జస్టిన్ ట్రూడోనే ఆరోపించడంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని, కిడ్నాప్ చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటి పనులు చేశారని ఆరోపించారు ట్రుడో. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను తగిన ఆధారాలు చూపాలని అడితే స్పందించలేదు. జస్టిన్ ట్రుడో తన మైనారిటీ ప్రభుత్వ మనుడగ కోసం నేషనల్ డెమోక్రటిక్ పార్టీ మీద ఆధారపడ్డారు. ఖలిస్థానీ మద్దతుదారు జగ్మీత్‌సింగ్ ఈ పార్టీకి నాయకుడు. కెనడాలో ఖలీస్థానీలు బాహటంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నా.. ఓటు బ్యాంకు రాజకీయాలతో పట్టించుకోకుండా వదిలేశారు. నిజ్జర్ హత్యతో ఆగ్రహంతో ఉన్న ఖలిస్థానీలను ప్రసన్నం చేసుకోడానికే ఆయన భారత్‌ను దోషిగా నిలిపే ప్రయత్నేం చేశారనే విమర్శలు వచ్చాయి.
కాగా గత ఏడాది ఆరంభం జస్టిన్ ట్రుడో రాజీనామాతో ఆయన స్థానంలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రి అయ్యారు. భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్దరించేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా కెనడా ప్రధాన గూఢచారి సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ తొలిసారిగా 1985 నాటి విమాన ప్రమాదం మీద ఒక ప్రకటన చేసింది. నాటి ఘటనకు ఖలిస్థానీలనే బాధ్యులని తేల్చి చెప్పింది. “కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు 1985 జూన్ 23న అమర్చిన బాంబు విమానాన్ని ధ్వంసం చేసింది. అందులో ఉన్న వారంతా మరణించారు. వారిలో ఎక్కువ మంది కెనడియన్లు. ఇది ఇప్పటికీ కెనడా చరిత్రలో అత్యంత ప్రాణాంతక ఉగ్రదాడి” అని సీఎస్ఐఎస్ తెలిపింది. దీంతో ఇన్నేళ్లుగా భారత్ చేస్తున్న ఆరోపణను కెనడా ఇప్పుడు అధికారికంగా అంగీకరించినట్లయింది. ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడా నేలపై పనిచేస్తున్నారన్న భారత వాదనకు బలం చేకూరింది.
కెనడాలో ఉన్న ఖలిస్తానీ బబ్బర్ ఖాల్సా ఉగ్రవాదులే ఆ విమానానికి పేలుడు పదార్థాన్ని అమర్చారని సీఎస్ఐఎస్ స్పష్టంగా చేసిన ప్రకటన భారత్‌కు ఎంతో కీలక విజయంగా భావిస్తున్నారు. ఖలిస్థానీ ఉద్యమం భారత్‌లో క్షీణించినా అంతర్జాతీయం ఉనికి చాటుకోవడానికి కెనడా ఇచ్చిన ఆశ్రయమే కారణం. భారత్ ఎన్నో ఏళ్లుగా ఖలిస్తానీ కార్యకలాపాలపై ఆందోళనలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఈ విషయంలో కెనడియన్ ప్రభుత్వాలు భారత్‌తో వివాదానికి దిగాయి. ట్రూడో ప్రభుత్వం అయితే కెనడియన్ పౌరులపై హింసాత్మక సరిహద్దు దాటి భారత్ అణచివేత కార్యక్రమాన్ని నిర్వహించిందని కూడా ఆరోపించింది. అయితే చాలా కాలంగా తమ భూభాగంలో పనిచేస్తున్న ఖలిస్తానీ నెట్‌వర్క్‌ల వల్ల ఏర్పడిన ముప్పును కెనడియన్ సంస్థలు ఇప్పుడు గుర్తించడం ప్రారంభించడంతో, భారత్ చెబుతున్న వాదనకు బలం చేకూరినట్లు కనిపిస్తోంది.




