Off The Record: ఏపీలో గెంటేసిన కంపెనీకి తెలంగాణాలో పెద్దపీట ఎందుకు?

Off The Record: కరీంనగర్ మున్సిపాలిటీలో బయో మైనింగ్ కాంట్రాక్ట్ చుట్టూ పెను వివాదం నెలకొంది

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 May 2026 6:43 AM IST
Off The Record
X

Off The Record: ఏపీలో గెంటేసిన కంపెనీకి తెలంగాణాలో పెద్దపీట ఎందుకు?

Off The Record: వడ్డించేవాడు మనవాడైతే.. ఏ బంతిలో కూర్చుంటే ఏంటి..? అన్న చందంగా మారిందట కరీంనగర్ మున్పిపాలిటీలో బయోమైనింగ్ పరిస్దితి. జనేశ్వర బయో మైనింగ్ కంపెనీకి కరీంనగర్ అత్తారిళ్లు కంటే ఎక్కువ మర్యాదలు చేస్తున్నారట అధికారులు. అందుకు బలమైన కారణం లేకపోలేదంటున్నారు పరిశీలకులు. సదరు కంపెనీకి ఓ బడా నాయకుడి అండదండలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ డంపింగ్ యార్డులో చెత్తని బయో మైనింగ్ చేసేందుకు పక్క రాష్ట్రానికి చెందిన జనేశ్వర బయో మైనింగ్ సంస్థకు ఏరికోరికాంట్రాక్ట్ అప్పగించారు మున్సిపల్ అధికారులు. ఆంధప్రదేశ్‌లోని 17 మున్సిపాలిటిల్లో బయో మైనింగ్ పనులు సరిగా చేయలేదంటూ అక్కడి ప్రభుత్వం టెర్మినేట్ చేసిందట. ఏపీ ప్రభుత్వం వద్దనుకున్న సంస్థకే తెలంగాణ సర్కార్ పెద్దపీట వేయడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రం గెంటివేసిన సంస్థను తెలంగాణ రాష్ట్రం అక్కున చేర్చుకోవడం ఏంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అదే బయో మైనింగ్ చేసేందుకు రెడ్ కార్పెట్ వేసి మరీ నిధులు విడుదల చేశారు. అయితే కరీంనగర్ మున్పిపల్ అదికారులు జనేశ్వర్ బయో మైనింగ్ కంపెనీకి ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక పెద్ద కథే ఉందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన ఓ మంత్రి స్థాయి వ్యక్తి పైరవీతోనే ఈ టెండర్‌ జనేశ్వర కంపెనీకి దక్కిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ మంత్రిస్థాయి నాయకుడి అండదండలు ఉండటంతో... అప్పగించిన పని పూర్తి కాకముందే వచ్చిన టెండర్‌లో సగం డబ్బులు ఇప్పటికే చెళ్లించేశారట అధికారులు. ఓ వైపు జీతాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నకరీంనగర్ మున్సిపల్ అదికారులు.. ఈ కంపనీకేమో అడగ్గానే బిల్లు విడుదల చేశారట. ఇక కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇటీవలే ఈ సంస్థ అధినేతపై ఓ కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కూడా ముందుకెళ్లకుండా.. సదరు మంత్రిస్థాయి నాయకుడి నుంచి ఫోన్లు వచ్చాయన్న టాక్ వినపడుతోంది. అలా బయోమైనింగ్ కోసం కరీంనగర్‌కు తీసుకొచ్చిన జనేశ్వర్ కంపెనీకి మట్టి కూడా అంటకుండా చూసుకుంటున్నారట ఇక్కడి నాయకులు, అధికారులు.

నిజానికి కరీంనగర్ మున్సిపలిటీలో బీజేపీ అధికారంలోకి వచ్చేకంటే ముందే ఈ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు అధికారులు. కానీ ఆ తరువాత ఈ కంపెనీ కథ తెలిసిన తర్వాత కూడా బీజేపీ మేయర్ సైతం ఈ విషయంలో కాస్త చూసీచూడనట్టుగా వ్యవహారించడంతో అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోందట. జనేశ్వర కంపెనీపై కేసులు, వివాదాలు అన్నీ తెలిసినా కూడా.. ఆ కంపెనీతో పనిచేయిస్తున్నామంటూ చెబతున్నారట మేయర్. అలా ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి స్థాయి నాయకుడు, మరోవైపు కొత్త బీజేపీ పాలకవర్గం నిద్ర నటిస్తోందని టాక్. కంపెనీ పుట్టినప్పటి నుంచీ పని సరిగా చేసినట్టుగా ట్రాక్ రికార్డ్ లేదని ఏపీ ప్రభుత్వం టెర్మినేట్ చేస్తే.. అదే కంపెనీ తెలంగాణలో ఎలా పూర్తి పని చేస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనేశ్వర్ కంపెనీపై అంత ప్రేమ చూపించేంతా అవసరం ఏముందన్న చర్చ కరీంనగర్ వాసుల్లో జరుగుతోంది.

కరీంనగర్ మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ సమస్య అత్యంత తీవ్రతరంగా మారింది. నిత్యం పొగతో జనం నరకం చూస్తున్నారు. ఇలాంటి సమస్య తీర్చేందుకు పాలకులు పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలాంటి వివాదస్పద కంపనీలకు ఈ విషయంలో వత్తాసు పలుకుతూ కరీంనగర్ వాసులను మభ్యపెట్డడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. కొత్త పాలకవర్గం ఇప్పటికైనా ఓ మంచి సంస్థకు బయోమైనింగ్ ప్రక్రియ అప్పగించాలని.. డంపింగ్ సమస్య త్వరగా తీర్చాలని జనం డిమాండ్ చేస్తున్నారు. మరి వివాదాల కంపెనీపై సదరు మంత్రి స్థాయి నాయకుడిలానే బీజేపీ పాలకవర్గం కూడా ఫీల్ మై లవ్ అని ప్రేమ చూపిస్తోందా..? లేక కరీంనగర్ జనంపై ప్రేమతో సమస్య తీర్చే కంపెనీకి అప్పగిస్తారా చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story