Off The Record: కరీంనగర్ చైర్మన్ పదవి కోసం ఇద్దరు నరేంద్రుల పోటీ!
Off The Record: కరీంనగర్ సుడా చైర్మన్ పదవి కోసం ఇద్దరు నరేందర్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ. జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య అధిపత్య పోరుగా మారిన నామినేటెడ్ పీఠం.
Off The Record: కరీంనగర్ చైర్మన్ పదవి కోసం ఇద్దరు నరేంద్రుల పోటీ!
Off The Record: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి సారిగా సుడా చైర్మన్ పదవిని దక్కించుకున్న నాయకుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. రెండేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో ఇప్పుడు మరోసారి అదే పదవి కోసం ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈసారి ఆయనకు పోటీగా మరో నరేందర్ రెడ్డి రంగంలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి కూడా సుడా చైర్మన్ పదవిపై గురిపెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో మరికొందరు నేతలు ఈ పదవిని ఆశిస్తున్నప్పటికీ.. అసలు పోటీ మాత్రం ఈ ఇద్దరు నరేంద్రుల మధ్యనే కొనసాగుతోందని అంటున్నారు.
ఇంతలో సుడా చైర్మన్ పదవి చుట్టూ మరో రాజకీయ కోణం తెరపైకి వచ్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య అధిపత్య పోరుకు ఈ నియామకం కీలకంగా మారిందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పోటీలో ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.. మంత్రి శ్రీధర్ బాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన అండతోనే గతంలో సుడా చైర్మన్ పదవి దక్కించుకున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇప్పుడు కూడా అదే మద్దతుతో మరోసారి అవకాశం కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే గతంలో సుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దూరంగా ఉన్నారనే ప్రచారం కార్యకర్తల్లో వినిపించింది. ఈ నేపథ్యంలో మరోసారి శ్రీధర్ బాబు వర్గానికే ఆ పదవి దక్కకుండా.. తన ప్రభావాన్ని చాటుకునేందుకు పొన్నం ప్రభాకర్ కూడా తనకు అనుకూల వ్యక్తిని ఎంపిక చేయించేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అందుకే ఈ నియామకాన్ని ఇద్దరు మంత్రుల మధ్య ప్రతిష్టాత్మక పోరుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్ రెడ్డి తన ప్రయత్నాలను జిల్లా స్థాయికి పరిమితం చేయకుండా నేరుగా అధిష్ఠానంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ఆయన.. అప్పట్లో పార్టీ అంతర్గత పరిస్థితుల వల్ల నష్టపోయాననే భావనలో ఉన్నారట. అందుకే ఇప్పుడు సుడా చైర్మన్ పదవితో తనకు రాజకీయంగా న్యాయం చేయాలని ఢిల్లీ స్థాయిలో విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం.
అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులతోనూ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇద్దరి మద్దతు కూడగట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒకవైపు అధిష్ఠానం, మరోవైపు సీఎం వర్గం, ఇంకోవైపు జిల్లా నాయకత్వం.. ఇలా అన్ని మార్గాల్లో తన అవకాశాలను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారనే చర్చ జరుగుతోంది.
వాస్తవానికి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఆశించిన స్థాయిలో బలం పెంచుకోలేకపోయింది. జిల్లాలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు చెందినవారు కాగా, ఎంపీ స్థానంతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున స్థానికంగా బలమైన రాజకీయ వేదికగా నిలిచే అవకాశం ఉన్న పదవిగా సుడా చైర్మన్ పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పదవిని చేపట్టే నాయకుడికి ప్రోటోకాల్ పరంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం తరఫున జిల్లాలో కీలక ప్రతినిధిగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు.. భవిష్యత్తులో అసెంబ్లీ టికెట్ రేసులో కూడా ముందంజలో నిలిచే అవకాశం ఉంటుందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అందుకే ఈ పదవిపై ఆశావహుల దృష్టి కేంద్రీకృతమైందని చెబుతున్నారు.
మరి కరీంనగర్ రాజకీయాల్లో కీలకంగా మారిన సుడా చైర్మన్ పదవి ఎవరికి దక్కబోతోంది..? ఇద్దరు నరేందర్‌ల మధ్య పోరులో పైచేయి ఎవరిది..? అంతకంటే ముఖ్యంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య ప్రతిష్టాత్మక పోరులో విజయం ఎవరిని వరించబోతోంది..? దీపావళి నాటికి రానున్న నామినేటెడ్ పదవుల జాబితా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది.




