Off The Record: ఐ డోంట్ కేర్.. కేసీఆర్ సెంటిమెంట్ తో దెబ్బకొట్టిన కవిత..!
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం! కవిత కొత్త పార్టీ TRS ప్రకటనతో బిఆర్ఎస్ లో కలకలం.
Off The Record: ఐ డోంట్ కేర్.. కేసీఆర్ సెంటిమెంట్ తో దెబ్బకొట్టిన కవిత..!
Off The Record: కవిత పార్టీ పెట్టడం ఒక చర్చ అయితే.. దానికి టీఆర్ఎస్ పేరును ఎంచుకోవడం మరో ఎత్తు. టీఆర్ఎస్ అనే సెంటిమెంట్‌ను వాడుకోవడానికే కవిత ఆ పేరు పెట్టారని, ఇది కేసీఆర్‌కు డాటర్ స్ట్రోకేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ అనౌన్స్ కార్యక్రమంలో కవిత ఎక్కువగా కేసీఆర్‌ను, అందులోని ముఖ్య లీడర్లనే టార్గెట్ చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ కన్నా..బీఆర్ఎస్ గురించే నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడారు. కేసీఆర్ మన మనిషి కాదు.. మారిన మనిషి, మర మనిషి అంటూ ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌లోని లోపాలను ఎత్తి చూపినందుకే తనను అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న ఆక్రోశంలో కవిత మాటల్లో వ్యక్తమైంది.
రాజకీయంగా కవిత నుంచి బీఆర్ఎస్‌కు ఎదురయ్యే సవాళ్లు ఏంటి అనే చర్చ పక్కన పెడితే.. అసలు టీఆర్ఎస్ పేరు వల్ల ఏమైన నష్టం జరుగుతుందా అన్న ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం..ఈ అంశాన్ని చాలా లైట్‌గా తీసుకున్నట్టు కనిపించింది. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్‌లో.. నకిలీ బిస్లరీ, ఒరిజినల్ బిస్లరీ వాటర్ బాటిల్‌ను, అలాగే కోల్‌గోట్‌కు డమ్మీగా వచ్చే పేస్ట్‌ను పోస్టు చేసి సెటైరికల్‌గా రిప్లై ఇచ్చింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ సెటైర్లు ప్రారంభించింది. అంతేకాదు కవిత ప్రకటించిన టిఆర్ఎస్ అనేది పార్టీ కాదని.. అది తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ మాత్రమే అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట.
కవిత టిఆర్ఎస్ పేరును ప్రకటించింది కానీ ఆ పార్టీకి సింబల్ ఏది అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టిఆర్ఎస్ కు సంబంధించి సింబల్ రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం లేకపోలేదు. ఐతే తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ అంటే కేసిఆర్ అనుకుంటారు తప్ప.. కవిత అనుకోరని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. టిఆర్ఎస్ అంటే తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీగా చెప్పుకుంటారు తప్ప.. కవిత కొత్తగా వచ్చి టిఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళితే ప్రజలు నమ్మరని.. రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఇలాగే వచ్చి పోయాయి అంటూ గులాబీ నేతలు కవితని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రీసెంట్ గా బీఆర్ఎస్ కండువా కప్పుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బిఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని తెలియజేశారు. కేసీఆర్ పై కవిత చేస్తున్న కామెంట్లను వెనక్కి తీసుకోవాలంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.. అదే సమయంలో పటోళ్ల కార్తిక్ రెడ్డి టిఆర్ఎస్ అనే పేరును గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ టిఆర్ఎస్ అనే పేరుని యాక్సెప్ట్ చేయదని సూచించారు. గతంలో పార్టీ పెట్టిన ఆల నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, విజయశాంతి, షర్మిల పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలుసు అన్నారు బాల్క సుమన్. కొత్త పార్టీ పెట్టిన కవిత... ప్రతిపక్షాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ను ప్రశ్నించాలి కానీ.. ప్రతిపక్షాన్ని తిట్టడమేంటని మండిపడ్డారు. దీన్ని బట్టే ఆమె ఎవరికోసం పార్టీ పెట్టారో అర్థమవుతుందన్నారు.
కవిత పెట్టిన టీఆర్ఎస్ పేరుతో బిఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలే అవకాశాలు లేకపోలేదు. గతంలో జరిగిన ఎన్నికలను గమనిస్తే కారు గుర్తును పోలిన రోటి మేకర్, రోడ్డు రూలర్ గుర్తులతో కొంతమంది గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.. ఆ సమయంలో ఎన్నికల కమిషన్‌కు వెళ్లి బిఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. అదే తరహాలో ఇప్పుడు బిఆర్‌ఎస్‌కి ఏమైన ఓట్లు చీలుతాయా అనే చర్చ జరుగుతుంది. ఐతే బిఆర్ఎస్ అంటే కారు గుర్తు ఉంటుంది కాబట్టి ఓట్లు చీలే అవకాశం లేదని ఇంకొంత మంది చర్చించుకుంటున్నారు. కవిత పార్టీకి ఏ సింబల్ వస్తుందనే ఆసక్తి కూడా నెలకొంది.. ఒకవేళ ఎన్నికల టైంలో ఈవీఎంపై వరుసగా పేర్లు వచ్చినా, సింబల్స్ వచ్చినా కారు గుర్తు అనేది కేసీఆర్ పార్టీ అని ప్రజలకు తెలుసు కాబట్టి ఓట్లు చీలదని మరికొందరి అభిప్రాయంగా వినపడుతుంది.
చాలామంది కార్యకర్తలు బిఆర్ఎస్ పేరును టిఆర్ఎస్ గా మార్చాలని ఇప్పటికే పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేటీఆర్ గతంలో స్పందిస్తూ కేసిఆర్ నిర్ణయం మేరకు పార్టీ పేరు మార్పుపై ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిపారట. ఇప్పుడు కవిత టిఆర్ఎస్ గా పేరును ప్రకటించడంతో.. బీఆర్ఎస్.. మళ్లీ తన మాతృసంస్థ ఐన టీఆర్‌ఎస్‌గా అవతరిస్తుందా? టెక్నికల్‌గా అది సాధ్యమేనా.. అందుకు ఈసీ రూల్స్ ఒప్పుకుంటాయా.
అనే చర్చ కూడా ప్రారంభమైంది. ఒకవేళ టిఆర్ఎస్ గా పేరు మార్చుకొని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని బిఆర్ఎస్ భావిస్తే ఎలాంటి అడుగులు వేయబోతుంది అనే ఆసక్తి నెలకొంది.. ఇదే సమయంలో కవిత పార్టీ ఎక్కడ కూడా బిఆర్ఎస్ ఓట్లను చీల్చదు అనే ఇంకో అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి బిఆర్ఎస్ పార్టీ ఓటు చీలకుండా ఏ విధంగా జాగ్రత్తలు వహించబోతుంది అనే ఆసక్తి రేపుతుంది.




