Off The Record: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ బిగ్ షాక్?
Off The Record: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహాలు మరియు నాయకత్వంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Off The Record: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ బిగ్ షాక్?
Off The Record: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటి నుంచే షురూ అయ్యింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. అందుకు ప్రధాన కారణం లేకపోలేదు. ఆ పార్టీ అధినేత కేసీఆర్.. మాజీలు, తాజా ఎమ్మెల్యేలకు క్లాస్ పీకడమేకాక.. ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయకపోతే నో టికెట్ అని గట్టి వార్నింగ్ ఇవ్వటమేనట. అవును.. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో చాలా మందికి టిక్కెట్ల భయం పట్టుకుందట. మాజీ ఎమ్మెల్యేలతోపాటు కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ ఈ హెచ్చరికలు చేశారు. ఫలితంగా గులాబీ నాయకుల్లో గుబులు మొదలైందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రావాలంటే అంత ఆశామాషీ కాదని చర్చించుకుంటున్నారు కారు పార్టీ నేతలు. వచ్చే జూన్‌లో సభ్యత్వ నమోదు ప్రారంభించి.. ఆ తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. గ్రామాలలో యాక్టివ్‌గా ఉండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు నిత్యం ప్రజలతో మమేకం అయ్యే వారికి మాత్రమే అవకాశాలు ఉంటాయని తేల్చి చెప్పేశారు కేసీఆర్.
ఐతే పార్టీ పునర్నిర్మాణంపై మాట్లాడుతున్న సందర్బంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీ నేతలు ఏంచేసినా చూసీచూడనట్లు వదిలేశానని చెప్పిన గులాబీ బాస్.. ఇకపై అలా కుదరదని కుండబద్ధలు కొట్టారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని నిర్మోహమాటంగా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో నిరంతరం జనంలో ఉండే వారికే అవకాశాలు దక్కుతాయని చెప్పడంతో ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. వచ్చే ఎన్నికల్లో కారు గుర్గుపై టికెట్ దక్కాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిందేనన్న సంకల్పం చేసుకోవాల్సిందేనంటున్నారన ఆశావహులు. గత ఎన్నికల్లో చేసిన కొన్ని పొరపాట్లు ఇక చేయదలుచుకోలేదనే కేసీఆర్ కామెంట్ చేయడం హాటా టాపికైంది. కేసీఆర్.. ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారోనన్న గుసగుసలు మొదలయ్యాయట గులాబీ శ్రేణుల్లో. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లలో అప్పుడే ఆందోళన మొదలైందని.. పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 30 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చాలనే చర్చ జరిగినా కేసీఆర్... సిట్టింగులవైపే మొగ్గుచూపారు. ఇలా మార్చాలనుకున్న వారంతా ఓటమిపాలయ్యాక దానిపై పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతోందట.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 30 మంది సిట్టింగులను మార్చాలని కేసీఆర్ భావించారు. పార్టీలో ముఖ్య నేతల నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ చివరి నిమిషంలో ఏమాత్రం మార్పులు చేయకుండా సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇచ్చారు. కానీ అలా మారుద్దామని అనుకున్న సిట్టింగు ఎమ్మెల్యేలంతా ఓటమిపాలయ్యారు. అందుకే ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లకు టిక్కెట్లు కష్టమేనన్న సంకేతాలు ఇప్పటినుంచే అధినేత కేసీఆర్ ఇచ్చేశారన్న చర్చ జరుగుతోంది. దీంతో గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో అప్పుడే గుబులు మొదలైందట. సుమారు 50 శాతం ఎమ్మెల్యే అభ్యర్ధులు తమకు టిక్కెట్ వచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చారట. ఇందులో మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు సైతం ఉండటంతో ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొందట.
ఇప్పటికే రెండు, మూడుసార్లు ఎన్నికలలో పోటీ చేసిన వారు లోకల్‌గా పాతుకుపోయారు. అయితే కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలని చాలామంది నేతలు మొరపెట్టుకుంటున్నారట. ఇప్పటినుంచే కమిటీలు వేసి యాక్టివ్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎవరైతే ప్రజల్లో ఉండి యాక్టివ్‌గా ఉంటారో వారికి టికెట్ ఇవ్వాలని అధినేత భావిస్తునట్టు సమాచారం. యువతకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గతం నుంచి పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆయా నియోజకవర్గాలలో యాక్టివ్‌గా పని చేస్తారో వారికి పార్టీ గుర్తింపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. గులాబీ అధినేత సూచనలతో కొంతమంది నేతలు ఇప్పటికే గ్రౌండ్‌లోకి వెళ్లి ప్రజలు, రైతుల పక్షాన యుద్ధప్రాతిపదికన పోరాటాలు మొదలుపెట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటేనే గెలవడం ఈజీగా ఉంటుందని అధినేత సూచనలతో ఎంతమంది నేతలు ప్రజల మధ్య ఉంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి పాతవారికి కాకుండా ఎంతమంది ఆశావహులకు అధినేత టిక్కెట్లు ఇవ్వబోతున్నారన్నది కాలమే నిర్ణయించాలి.




