Off The Record: ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్.. ఇన్‌ఛార్జుల నియామకంలో కొత్త రూల్స్!
Off The Record: ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ కీలక భేటీ. రాబోయే రెండేళ్ల కార్యాచరణ, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం, మరియు సభ్యత్వ నమోదుపై బీఆర్ఎస్ శ్రేణులకు గులాబీ బాస్ దిశానిర్దేశం.
Off The Record: ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్.. ఇన్‌ఛార్జుల నియామకంలో కొత్త రూల్స్!
Off The Record: తెలంగాణలో విపక్ష కారు పార్టీ గేర్ మార్చిందా..? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా దూకుడు పెంచిందా..? ఆ పార్టీ అధినేత రీలోడ్ అయ్యారా..? బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేస్తు్న్నారా..? పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంపై ఫోకస్ పెట్టారా..? కొత్త సభ్యులను చేర్చుకోవాలని, ముఖ్యంగా మెంబర్‌షిప్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారా..? పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, కొత్తగా ఇన్‌ఛార్జుల నియామకం, పార్టీ కమిటీల బలోపేతంపై గులాబీ బాస్ దృష్టి సారించారా..? ఇంతకీ బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమై.. ఏం చర్చించారు..?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ కీలక నేతలతో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహం, పార్టీ పునర్వ్యవస్థీకరణ, ప్రజల్లో బీఆర్ఎస్ బలోపేతంపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రెండేళ్లు పార్టీకి అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. ఈ సమయాన్ని పూర్తిగా ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తూ ఉద్యమ కార్యాచరణకు వినియోగించాలని సూచించారట. తెలంగాణలో ప్రతి జిల్లాకు ప్రత్యేక సమస్యలు ఉన్నాయని, వాటిని గుర్తించి జిల్లాల వారీగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారట. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆవేదనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారట. ప్రజాసమస్యల కోసం ఎంత గట్టిగా పోరాడితే, ప్రజల ఆదరణ కూడా అంత బలంగా లభిస్తుందని కేసీఆర్ హితవు పలికారట.
పార్టీ నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. నియోజకవర్గాలు, జిల్లాలకు ఇంచార్జీల ఎంపికలో కేవలం పేరుకే కాకుండా నిజంగా పని చేసే నాయకులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. గత పదేళ్లలో పార్టీ పదవులు పొందని కేడర్‌కు ఈసారి ప్రాధాన్యం కల్పించాలని సూచించారట .కుటుంబ, వ్యక్తిగత పరిచయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, గ్రౌండ్ లెవెల్‌లో యాక్టివ్‌గా పని చేసే వారినే ముందుకు తీసుకురావాలని నాయకత్వానికి ఆదేశాలు ఇచ్చారు. యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల్లో చురుకుగా పనిచేస్తున్న వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ సూచించారట. పార్టీకి నిజంగా అంకితభావంతో పనిచేసే వారే భవిష్యత్‌లో నాయకత్వంగా ఎదగాలని ఆయన స్పష్టం చేశారట.
పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన కేసీఆర్.. ఎంతమందికి సభ్యత్వం ఇచ్చామన్నది కాదు.. పార్టీకీ నిరంతరం కనెక్ట్‌గా ఉండే యాక్టివ్ కేడర్ ఎంతమంది ఉన్నారన్నదే అసలు బలమని వివరించారట. క్రియాశీలకంగా పనిచేసే వారికే యాక్టివ్ మెంబర్‌షిప్ ఇవ్వాలని కఠిన ఆదేశాలు జారీ చేశారట గులాబీ బాస్. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ వ్యవస్థ బలమైన కనెక్టివిటీతో పనిచేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారట. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని తెలిపారు. ఇక త్వరలో జరగనున్న జిల్లా పరిషత్, మండల పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత దృఢంగా తయారు చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజల మధ్యే పార్టీ భవిష్యత్ ఉందని, ఉద్యమమే బీఆర్ఎస్‌కు మళ్లీ బలాన్నిస్తుందని ఆయన నేతలకు చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సలహాలు, సూచనలు గులాబీ శ్రేణుల్లో ఏమేరకు మార్పు తీసుకొస్తాయో..? కారు ఏమేరకు దూకుడు పెంచుతుందో..? రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తుందోనన్నది చూడాలి.




