Off The Record: ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్ ఎవరికి!
Off The Record: దానం నాగేందర్ అనర్హత వేటుతో ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీజేపీ కసరత్తు. అభ్యర్థి ఎంపికపై పార్టీలో జోరుగా సాగుతున్న చర్చ. పూర్తి వివరాలు.
Off The Record: ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్ ఎవరికి!
Off The Record: హైదరాబాద్ రాజకీయాల్లో హాట్‌స్పాట్‌గా కనిపించే ఖైరతాబాద్.. ఇప్పుడు మరోసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లడం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం.. ఈ వ్యవహారంపై హైకోర్టు, అదే బాటలో సుప్రీకోర్టు కూడా ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది. దానం పార్టీ ఫిరాయించారని, తప్పకుండా వేటు వేయాల్సిందేనని బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా పట్టుబట్టాయి. ఈమేరకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి న్యాయపోరాటంలో విజయం సాధించారు. ఏలేటి దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు.. చివరకు దానంపై అనర్హత వేటు వేసింది.
న్యాయ పోరాటం ఫలించిన నేపథ్యంలో.. ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్ పెంచినట్లు కనిపిస్తోంది. కోర్టు కేసు గెలవడం ఒక ఎత్తు.. ఎన్నికల్లో గెలవడం మరో ఎత్తు. అయితే ఖైరతాబాద్‌లో ఎన్నికల ఫైట్ కమలానికి కొత్తేమీ కాదు. 2014లో బీజేపీ తరఫున చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా దానంపై గెలిచారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో మాత్రం దానం నాగేందర్ గెలిచారు. 2023లో దానం నాగేందర్‌కు సుమారు 67 వేల ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి సుమారు 38 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కానీ ఏడాది తిరగకముందే రాజకీయ లెక్కలు మారిపోయాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డికి 73,664 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు 57,124 ఓట్లు వచ్చాయి. అంటే ఈ సెగ్మెంట్‌లో బీజేపీకి 16,540 ఓట్ల ఆధిక్యం నమోదైంది. ఇదే బీజేపీకి వచ్చిన ఓట్లను పార్టీ బలానికి ఒక సూచికగా బీజేపీ వర్గాలు చూస్తున్నాయి. ‘అప్పుడు ఓడిపోయాం.. ఇప్పుడు పరిస్థితి మారింది’ అనే ధీమాతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు నగర ప్రాంతాల్లో యువత, ఉద్యోగులు, మధ్యతరగతి ఓటర్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలనే చర్చ కూడా ఉందని సమాచారం. ఈసారి ఖైరతాబాద్‌లో ఎవరి బలం ఎంత అన్నది ఉపఎన్నిక ఫలితాల్లో తేలనుంది.
అయితే.. ఎన్నిక అనివార్యం కావడంతో అసలు బీజేపీ అభ్యర్థి ఎవరు..? ఇదే ఇప్పుడు పార్టీలో అసలు పంచాయితీ. ఖైరతాబాద్ పేరు చెబితే ముందుగా వినిపించే పేర్లలో సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి ఒకరు. 2009 నుంచి పలు ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన చింతల.. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 ఎన్నికల్లో మాత్రం ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2009 నుంచి ఖైరతాబాద్‌లో బీజేపీ తరఫున రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న చింతల.. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంతో తనకు ఉన్న అనుబంధం, పార్టీ కేడర్‌తో పరిచయం తనకు కలిసొచ్చే అంశాలుగా ఆయన అనుచరులు భావిస్తున్నారట. ‘పాత బియ్యం రుచి వేరు’ అన్నట్టు.. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, నియోజకవర్గంపై పట్టు ఉన్న నాయకుడికే ఛాన్స్ ఇవ్వాలనే వాదన పార్టీలో లేకపోలేదట. మొత్తానికి “పాత సైనికుడినే మళ్లీ రంగంలోకి దింపుతారా..? లేక కొత్త బాణాన్ని సంధిస్తారా..?”అన్న చర్చ మొదలైందట.
ఇక ఈసారి బీజేపీ వ్యూహంలో మరో కోణం కూడా తెరపైకి వస్తోంది. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలా..? కొత్త తరం నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలా..? అన్న మీమాంస.. మరోవైపు దేశ రాజకీయాల్లో జెన్-జీ యువత చర్చకు వస్తున్న వేళ.. “యువ ముఖాన్ని ముందుకు తెస్తే ఎలా ఉంటుంది..?” అనే ఆలోచన కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధితోపాటు సర్ ప్రక్రియ స్టేట్ కమిటీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఇంద్రసేనారెడ్డి, దివంగత నేత బద్దం బాల్‌రెడ్డి కుమారుడు బద్దం మహిపాల్‌రెడ్డి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయట. అయితే ఇవన్నీ ప్రస్తుతం పార్టీ స్థాయిలో చర్చకు వస్తున్న పేర్లే తప్ప ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ చర్చల్లో వినిపిస్తున్న పేర్లే.
పార్టీ అధికారికంగా ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించలేదు. ఇదంతా టికెట్ కోసం కేవలం లెక్కలు షురూ అన్నమాట. ఈ నేపథ్యంలో సీనియర్ అనుభవమా..? యువతకు అవకాశం ఇవ్వడమా..? స్థానిక కేడర్ బలం ఎంత..? ఎవరి వెంట ప్రజలు నడుస్తారు..? ఇవన్నీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే నియోజకవర్గంలో సర్వేలు, కేడర్ అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు, గత ఎన్నికల ఓటింగ్ సరళి, స్థానికంగా అభ్యర్థి బలాబలాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ సైతం లేకపోలేదట.
ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తే.. పోటీ ఎలా ఉండబోతోందన్నదే మరో ఆసక్తికరమైన అంశం. 2023లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనిపించింది. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. దానం నాగేందర్ కాంగ్రెస్‌లో ఉండటం, న్యాయ స్థానాల తీర్పు కూడా వచ్చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ తమ తమ రాజకీయ లెక్కలు వేసుకోవడం.. ఇవన్నీ కలిపితే ఖైరతాబాద్ బైపోల్ హీట్ పుట్టిస్తోందట.
కోర్టు తీర్పు రావడంతో రాజకీయ లెక్కలతో పకడ్బందీ వ్యూహంతో బీజేపీ కసరత్తు షురూ చేసిందటా. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోవడం కేడర్ చాలా నిరాశకు గురయ్యారట. దీంతో అక్కడ జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా ఎమ్మెల్యే సీటు గెలిచి తీరాలనే కసితో పార్టీ కేడర్ ఉవ్విళ్లూరుతోందట. ఎందుకంటే ఇది సాధారణ నియోజకవర్గం కాదు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ సీటు.. దీంతో ఈ ఎన్నికను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా ఫుల్ ఫోకస్‌తో బరిలో దిగేందుకు సిద్దం అవుతున్నారట.
మొత్తానికి.. దానం నాగేందర్ వ్యవహారం ఇప్పుడు కోర్టు నుంచి పొలిటికల్ పిచ్‌కు చేరింది. ఏదిఏమైనా.. ఖైరతాబాద్‌లో ఇప్పుడు రెండు ప్రశ్నలే హాట్‌టాపిక్‌గా మారాయట. ఉప ఎన్నిక ఎప్పుడూ..? బీజేపీ టికెట్ ఎవరికి దక్కుతుంది..? ప్రస్తుతం ఇవన్నీ ప్రశ్నలే.. సమాధానం మాత్రం పార్టీ అధిష్టాన కోర్టులోనే ఉంది. మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చూడాలి.




