Off The Record: బీఆర్ఎస్‌కు సవాల్‌గా మారిన ఖైరతాబాద్ ఉపఎన్నిక!

Off The Record: దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం. బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి లేదా సాయికిరణ్ యాదవ్ రేసులో ఉన్నట్లు ప్రచారం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Sept 2026 7:36 AM IST
Off The Record
X

Off The Record: బీఆర్ఎస్‌కు సవాల్‌గా మారిన ఖైరతాబాద్ ఉపఎన్నిక!

Off The Record: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా కన్పిస్తోంది. దీంతో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.

ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో ఉప యుద్ధం జోష్ షురూ అయ్యింది. ఇదే సమయంలో ఉప ఎన్నిక బీఆర్ఎస్‌ను కలవర పెడుతోందట‌.

ఉప ఎన్నికల పేరెత్తితేనే ఆ పార్టీ నేతల్లో కంగారు పుడుతోందట. ఎందుకంటే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చాయి. ఈనేపధ్యంలో ఖైరతాబాద్‌ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని గులాబీ పార్టీ ఫిక్స్ అయిందట.

గత రెండు బైపోల్స్‌లో ఎదురైన ఫలితాల తర్వాత.. ఖైరతాబాద్‌లో అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నిన్నటి వరకు దానం నాగేందర్‌పై న్యాయ పోరాటం చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు అదే నియోజకవర్గాన్ని తిరిగి దక్కించుకునే పనిలో పడాల్సిన పరిస్థితి ఎదురైంది. అందుకే.. అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేయాలని బీఆర్ఎస్ భావిస్తోందట.

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అందరి కంటే ఎక్కువగా దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి‌.

ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన విష్ణుకు నియోజకవర్గంతో ఉన్న పాత పరిచయాలు, పీజేఆర్ కుటుంబానికి ఉన్న రాజకీయ అనుబంధం తమకు కలిసొస్తుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కూడా పీజేఆర్ కుమారుడు విష్ణు వర్ధన్ పేరు బలంగా వినిపించింది. గతంలో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన దాసోజు శ్రవణ్.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.

నియోజకవర్గంతో తనకు ఉన్న అనుబంధంతోపాటు.. బీసీ సామాజిక సమీకరణాలు కూడా తమకు అనుకూలంగా మారుతాయని విష్ణు వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే బైపోల్స్ రేసులో మరో పేరు బలంగా వినిపిస్తోంది. అదే మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్. గతంలోనే ఖైరతాబాద్ ఉపఎన్నిక వస్తే సాయికిరణ్‌ను బరిలోకి దింపాలని తలసాని ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది.

సంక్రాంతి సందర్భంగా ఖైరతాబాద్ పరిధిలో జరిగిన కార్యక్రమాల విషయంలోనూ తలసాని, దానం వర్గాల మధ్య పోటాపోటీ కనిపించిందన్న చర్చ అప్పట్లో జరిగింది.

దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తన తనయడు సాయి కిరణ్‌ను బరిలో దించేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. తన కుమారుడికి టికెట్ ఇస్తే గెలిపించుకుని వస్తానని తలసాని పట్టుదలతో ఉన్నారట.

2014పార్లమెంట్ ఎన్నికల్లో తలసాని సాయికిరణ్ యాదవ్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి సాయికిరణ్ యాదవ్ గులాబీ దళంలో యాక్టివ్ మోడ్‌లో ఉంటున్నారు.

ఎవరికి స్థానికంగా బలం ఉంది..? ఎవరికి కేడర్ నడిపించే సామర్థ్యం ఉంది..? ఎవరి సామాజిక సమీకరణాలు కలిసొస్తాయి..? కాంగ్రెస్ అభ్యర్థిని ఢీకొట్టేందుకు ఎవరు సరైన అభ్యర్థి..?

ఇలాంటి అంశాలన్నింటినీ బేరీజు వేసిన తర్వాతే అభ్యర్థిని ఫైనల్ చేయాలని గులాబీ అధిష్టానం భావిస్తోందన్న చర్చ జరుగుతోంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేలు అకాల మరణంతో ఉప ఎన్నికలొచ్చాయి.

ఆ బైపోల్స్‌లో సింపథీనే బీఆర్ఎస్ నమ్ముకుంది. అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక పరిస్థితి వేరు. దానంపై అనర్హత వేటుతో ఉపఎన్నిక రానుంది. దీంతో గత బైపోల్స్ అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుని..

చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై సర్వేలు, ఫీడ్‌బ్యాక్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు.. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే దానం నాగేందర్ అనర్హతపై స్పందిస్తూ.. ఖైరతాబాద్ ఉపఎన్నికలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలకూ ఇదే గతి పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో.. బీఆర్ఎస్‌కు ఖైరతాబాద్ బైపోల్ కేవలం మరో ఎన్నిక మాత్రమే కాదన్న చర్చ మొదలైంది.

ఫిరాయింపులపై బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయ పోరాటానికి ఇదే నియోజకవర్గంలో ప్రజా తీర్పు తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

అందుకే.. అభ్యర్థి విషయంలో ఒక్క చిన్న తప్పిదం కూడా చేయకూడదని గులాబీ పార్టీ భావిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఖైరతాబాద్ బరిలో దిగే గులాబీ అభ్యర్థి ఎవరన్నదే ఇప్పుడు అసలైన చర్చ.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్