Off The Record: పొలిమేర వార్.. రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి..
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది.
Off The Record: పొలిమేర వార్.. రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి..
Off The Record: ఒకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. మరొకరు కేంద్రమంత్రి. ఇద్దరూ హైపొజిషన్‌లో ఉన్న ప్రత్యర్థి లీడర్లు. అందులోనూ రాష్ట్రంలో పార్టీని లీడ్ చేస్తున్న నేతలే. ఇంకేముంది. వారి మధ్య ఇప్పుడు హైఓల్టేజ్ వార్ నడుస్తోంది. ఒకరి ఆరోపణలకు ఒకరు, ఒకరి విమర్శలకు మరొకరు ధీటైన కౌంటర్లు, సవాళ్లతో పొలిటికల్ అగ్గి రాజేస్తున్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ధాన్యం కొనుగోళ్లు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఇలా ఏ అంశం తీసుకున్నా సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్‌ల మధ్య వారే కనిపిస్తోంది.
తెలంగాణ అభివృద్ధి కాళ్లల్లో కిషన్ రెడ్డి కట్టెలు పెడుతున్నారని రేవంత్ విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో తిరిగి "తెలంగాణలో నన్ను ఆపే మొనగాడు పుట్టలేదు, నీ తాటాకు చప్పుళ్లకు భయపడే కేసీఆర్ ను కాదు బీజేపీ కార్యకర్తను అంటూ కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇలా సవాళ్లు..ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య రాజకీయం పోరు మరింత ముదిరింది... పల్లెల్లో చెప్పుకునే ముచ్చట లాగా.."ఒకరు రాయి వేస్తే... మరొకరు బండరాయి విసిరినట్టుగా" రాజకీయ వాతావరణం మారిపోయింది. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గుజరాత్‌లో సబర్మతి, ఢిల్లీలో యమునా, యూపీలో గంగా రివర్ ఫ్రంట్‌లను అభివృద్ధి చేసినప్పుడు...మూసీని అభివృద్ధి చేయొద్దా? అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దితే యువతకు ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కానీ తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడితే... వెంటనే తిరిగి "హామీలు అమలు చేయలేక రాజకీయ నిరాశ, నిస్పృహతో సీఎం మాట్లాడుతున్నారు అంటూ కిషన్ రెడ్డి ఎదురుదాడి చేశారు.
రీజనల్ రింగ్ రోడ్ కోసం ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లానని... తాను ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసిన వెంటనే కిషన్ రెడ్డి పోయి నిధులు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. నిధులు ఇస్తే క్రెడిట్ రేవంత్ రెడ్డికి పోతుందనే భయం, రాజకీయ స్వార్థంతో అభివృద్ధి కాకుండా కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారని సీఎం మండిపడ్డారు. ఇప్పటికమ వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన పురోగతి కనిపించలేదని ఫైర్ అయ్యారు.. ప్రజలు ఓట్లు వేసింది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే కాదు... కేంద్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా..ఓట్లు వెయ్యనిదే మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారా ? అంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు అంశంలోనూ కేంద్రం బాధ్యత తీసుకోవాలని... లేదంటే బీజేపీ నేతల ఇంటి ముందు వడ్లు పోస్తామనడం మరింత అగ్గి రాజేసింది. అంతేకాదు.. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య వివాదంలో ఉన్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు జరవివాదంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్ మెంట్ కోరితే ఇవ్వడం లేదని, అసలు అపాయింట్మెంట్ ఇవ్వొద్దని కిషన్ రెడ్డే చెప్పినట్టు సమాచారం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. అదే విధంగా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతామనడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది..."ఈ నెల 15 తర్వాత కిషన్ రెడ్డి సంగతి చెబుతామన్న హెచ్చరిక వెనుక అసలు అర్థం ఏమిటి..? అది కేవలం రాజకీయ విమర్శేనా..?లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి సంకేతమా..? ఇక నీలాగా 12 పార్టీలు మారలేదు..పుట్టింది బీజేపీలోనే చచ్చేది బీజేపీలో అంటూ కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు.. దీంతో సీఎం రేవంత్ తనదైన శైలిలో సెటైరికల్ డైలాగులు పేల్చారు. నువ్వు బీజేపీలో ఉంటే ఏమి లాభం లేదని సొంత బీజేపీ నేతలే అంటున్నారు.. అలాగే చీకట్లో బీఆర్ఎస్ తో కుమ్మక్కై కేటీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి నడుచుకుంటారని బీజేపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారనడం రచ్చ రేపింది. "కలిసి వస్తే అభివృద్ధి... అడ్డుకుంటే రాజకీయాలే" అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం రేవంత్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటమే తన లక్ష్యమన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయని... కానీ ఆరు గ్యారంటీలు మాత్రం సచివాలయం గేటు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. రైతు భరోసా, రైతు బోనస్, దళిత, బీసీ సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అలాగే దళిత 12లక్షల కోట్ల హామీ, బీసీ లక్ష కోట్లు హామీ నెరవేర్చకపోతే నీ ఇంటిని ముట్టడిస్తారు, అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటిని సైతం ముట్టడిస్తారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. ఒకవైపు అభివృద్ధి అంశాలు... మరోవైపు రాజకీయ సవాళ్లు.. ఇద్దరు నేతల మాటల యుద్ధం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రేవంత్, కిషన్‌రెడ్డిల మధ్య పొలిటికల్ డైలాగ్ వార్‌తో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి వరకు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతల ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా కనిపిస్తుండే. గత పదేళ్ల పాలనలో అంతా అవినీతే. అప్పులు అంటూ విమర్శలు చేసే వారు. కానీ సడన్‌గా రాజకీయ వాతావరణ మారింది. ఇప్పుడు రేవంత్ లక్ష్యం అంతా.. బీజేపీ ముఖ్యనేతలపైకి మళ్లింది. కిషన్‌రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో పొలిటికల్ లైమ్ లైట్ నుంచి బీఆర్ఎస్ ను సైడ్ చేయాలనే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లీడర్లు వ్యవహరిస్తున్నారా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వడ్ల కొనుగోలు జాప్యంలో..కాంగ్రెస్ సర్కార్ పై కొంత వ్యతిరేకవ వచ్చింది. దీంతో ఆ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకోవడానికి.. కేంద్రంలోని బీజేపీని బద్నాం చేసేలా సీఎం గేమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి పనుల జాప్యానికి.. కేంద్రమే కారణం అని.. ప్రజల దృష్టిని కేంద్రంపైకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా అన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాజకీయంగా ట్రైయాంగిల్ ఫైట్ ఉంటే అది అధికార పార్టీకే లాభం అని అందుకే.. ఫోకస్ బీజేపీపై షిఫ్ట్ అయ్యేలా.. రేవంత్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి...ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధమా..? లేక తెలంగాణ భవిష్యత్ రాజకీయాల దిశను నిర్ణయించే ఆధిపత్య పోరా..?జూన్ 15 తర్వాత రాజకీయ సమీకరణాలు మారతాయా..? అభివృద్ధి అంశాలు ముందుకు వస్తాయా..?లేక ఆరోపణలు, ప్రత్యారోపణలే సరిపోతుందా? మరి ఈ పోరులో పైచేయి ఎవరిది..? ప్రజల తీర్పు ఎవరికి..? అభివృద్ధి గెలుస్తుందా..? రాజకీయాలు గెలుస్తాయా..? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ రాజకీయ ఎటు మలుపులు తిరుగుతోందో చూడాలి మరి.




