Off The Record: మళ్ళీ భగ్గుమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!
Off The Record: తెలంగాణలోతమిళనాడు తరహా రాజకీయాలు ప్రత్యామ్నాయ శక్తుల నిర్మాణంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Off The Record: మళ్ళీ భగ్గుమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!
Off The Record: తెలంగాణ పాలిటిక్స్‌లో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసే నాయకుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. పదవులు ముఖ్యం కాదు, తనకు సిద్ధాంతాలే ముఖ్యం అని నమ్మే నాయకుడు ఆయన. మునుగోడు అభివృద్ధే లక్ష్యంగా గతంలో సొంత పార్టీలకే షాకిచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన రాజకీయ లక్ష్మణ రేఖను మరింత విస్తరించారు.
"అవినీతి ఎమ్మెల్యేలు, డిపాజిట్ రాని ఎమ్మెల్యేలు, పాచిపోయిన ఎమ్మెల్యేలు నాకు అవసరం లేదు" అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రత్యర్థులకే కాదు, రాజకీయ వర్గాలకే దిమ్మతిరిగేలా చేశాయి. పదవి కోసం రాజీ పడకుండా, తన సిద్ధాంతాల కోసం ఏకంగా పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర ఆయనది.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో వస్తున్న క్షీణతను గమనించిన ఆయన, ఇకపై కేవలం ఒక పార్టీ సరిహద్దులకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. రాజగోపాల్ రెడ్డి తాజా ప్రసంగంలో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే.. "తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు తరహాలో మారబోతున్నాయి" అని అనడం.
అసలు తమిళనాడు పాలిటిక్స్ అంటే ఏమిటి..? అక్కడ ప్రాంతీయ అస్తిత్వం, బలమైన ప్రజా ఉద్యమాలు, సినీ లేదా మాస్ లీడర్ల ప్రభావం, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలు బలంగా ఉంటాయి. జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ భావాలు, ప్రజల సంక్షేమం చుట్టూ అక్కడ రాజకీయం నడుస్తుంది.
మరి తెలంగాణలోనూ అలాంటి సంస్కృతిని తీసుకురావాలని ఆయన భావిస్తున్నారా..? సంప్రదాయ పార్టీల అధిపత్య రాజకీయాలకు భిన్నంగా ఒక కొత్త రాజకీయ సమీకరణానికి, ప్రత్యామ్నాయ శక్తి నిర్మాణానికి ఆయన తెరలేపుతున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.
డబ్బు, అధికారం, కులం, మతం చుట్టూ తిరిగే ప్రస్తుత రాజకీయాలపై రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓటర్ల ముందు తిరిగే నాయకులు, గెలిచిన తర్వాత ప్రజలకు ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులం పేరుతో రాజకీయంగా ఎదిగి, ఆ తర్వాత ప్రజల సొమ్మును వసూలు చేసుకునే నాయకులను ఇకపై తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పదవి అనేది కేవలం గర్వానికి ప్రతీకగా లేదా కిరీటంగా భావించవద్దని, అది ప్రజల పట్ల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
సహచర ఎమ్మెల్యేల తీరును, ఎన్నికల తర్వాత మారుతున్న నాయకుల ద్వంద్వ వైఖరిని ఆయన ఎత్తిచూపిన తీరు చూస్తుంటే, పాలిటిక్స్‌లో ఒక ప్రక్షాళన జరగాలని ఆయన బలంగా కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది.
ఇకపై కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులు సైతం ఇకపై చట్టసభలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఆకాంక్షించారు.
ఈ క్రమంలోనే ఏపూరి సోమన్నను చట్టసభలకు పంపిస్తానని, తాను మాటిస్తే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం డబ్బున్నవారే కాకుండా, నిజాయితీపరులు, యువకులు, సామాన్యులు కూడా రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే మహా ఆకాంక్షను ఆయన వ్యక్తంచేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూనే నియోజకవర్గ నిధుల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీయడం రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక శైలి. అయితే తాజా వ్యాఖ్యలు కేవలం నియోజకవర్గ సమస్యల పరిధిని దాటి రాష్ట్ర స్థాయి నాయకత్వ ప్రత్యామ్నాయం గురించేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది భవిష్యత్తులో కొత్త పార్టీ ఏర్పాటుకు సంకేతమా..? లేక కాంగ్రెస్‌లోనే ఉంటూ ఒక కొత్త ప్రజా ఉద్యమ రాజకీయానికి తెరతీస్తున్నారా..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఏది ఏమైనప్పటికీ, ఆయన వేస్తున్న ప్రతి అడుగు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అనూహ్యమైన రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ క్షణంలో ఏ సమీకరణాలు మారుతాయో ముందే ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. సరిగ్గా అలాంటి అంచనాలకే అంతుచిక్కకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేస్తున్న ప్రతి అడుగు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త పునాదులు వేస్తోందంటున్నారు.
పాత పద్ధతులకు స్వస్తి పలికి, ప్రజల పక్షాన నిలిచే కొత్త తరహా రాజకీయాలకు ఆయన తెరలేపుతారా..? లేక ఈ వ్యాఖ్యలు కేవలం తాత్కాలిక సంచలనాలకే పరిమితమవుతాయా..? మరి రాజగోపాల్ రెడ్డి మాస్టర్ ప్లాన్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతుందనేది కాలమే నిర్ణయించాలి.




