Off The Record: మంత్రి పదవిపై కోమటిరెడ్డి సీరియస్!
Off The Record: సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
Off The Record: మంత్రి పదవిపై కోమటిరెడ్డి సీరియస్!
Off The Record: అయనంతే సీతయ్య ఎవరి మాట వినరు. ఎవరికి లొంగరు అన్నట్టు ఉంది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తీరు. సాధారణంగా పార్టీపై కొంత అసంతృప్తి ఉన్నా నేతలు పెద్దగా నోరు తెరిచి మాట్లాడరు. సొంత ప్రభుత్వంపై గానీ, పార్టీపై గానీ బహిరంగ విమర్శలు అస్సలు చేయ్యరు. కానీ రాజగోపాల్‌రెడ్డి తీరే వేరు. ఆయన ముందు ఏ రూలూ పనికి రాదు. ఎన్నికల టైంలో హైకమాండ్ ఇచ్చిన మంత్రి పదవి హామీ నెరవేరలేదన్న అసమ్మతితో ఉన్న రాజగోపాల్‌రెడ్డి.. రోజు రోజుకు తన విమర్శల డోస్ పెంచుతూపోతున్నారు. ఏకంగా రాష్ట్ర నాయకత్వంతోనే ఢీకొంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక ఆర్నెళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న రాజగోపాల్‌రెడ్డి.. ఆ తర్వాత నుంచి తిరుగుబాటు జెండా ఎగరేయడం ప్రారంభించారు. నియోజకవర్గంలో అనుకున్న మేర అభివృద్ధి పనులు జరగడం లేదని, నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకే వెళ్తున్నాయని, మునుగోడు కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని,, ఇలా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించిన రాజగోపాల్‌రెడ్డి.. తాజాగా పార్టీలో ప్రకంపనలు రేపేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్లు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారని, దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన అంటే పేదల కోసం పనిచేయాలని, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు లేదా ఇతర ప్రభావశీలుల ప్రయోజనాల కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు, పేదలకు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రభుత్వంలో గుర్తింపు దక్కాలని డిమాండ్ చేశారు. ఇదే ఇప్పుడు హస్తం పార్టీలో.. హాట్ టాపిక్‌గా మారింది. ఎవరిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం, పార్టీ పెద్దలతో రాజగోపాల్‌రెడ్డికి మరింత చెడిందా..? పార్టీ లైన్‌ను దాటి ఎందుకిలా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నది ప్రభుత్వ విధానాలపై విమర్శ మాత్రమేనా? లేక మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే ఇలా మాట్లాడుతున్నారా? లేక రీజన్ ఇంకేమైన ఉందా అన్న చర్చ నడుస్తోంది.
గతంలో సీఎం రేవంత్‌రెడ్డిపై బహిరంగ విమర్శలు చేశారు రాజగోపాల్‌రెడ్డి. మరో పదేళ్లు తానే సీఎంను అన్న రేవంత్ వ్యాఖ్యలపై, అలాగే ప్రభుత్వ విధానాలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే ఒకరిద్దరికి కేబినెట్ పదవితో పాటు.. ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన మొదటి నుంచే విమర్శిస్తూ వస్తున్నారు. ఐతే గతంలో ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా సీరియస్‌గా స్పందించిన సందర్భం ఉంది.
కానీ కఠిన చర్యలు తీసుకునే బదులు కాంగ్రెస్ నాయకత్వం చాలాసార్లు ఈ వ్యవహారాన్ని రాజకీయంగా మేనేజ్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. తాజా పరిణామాల్లో మాత్రం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్వరం కాస్త కఠినంగా వినిపించింది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎవరైనా సరే గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదే సమయంలో కీలకమైన విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిన విషయం తనకు కూడా తెలుసని చెప్పారు. అయితే పదవి ఇవ్వాలా? వద్దా? ఎప్పుడు ఇవ్వాలి? అన్నది హైకమాండ్ నిర్ణయమని స్పష్టం చేశారు.
ఇక్కడే కాంగ్రెస్‌లోని అసలు చిక్కు బయటపడుతోంది.
మంత్రి పదవి హామీ నిజమైతే.. దాన్ని అమలు చేయకుండా ఎంతకాలం రాజగోపాల్‌రెడ్డిని నియంత్రించగలరు?
అదే సమయంలో..
హామీ ఉందన్న కారణంతో పార్టీ క్రమశిక్షణను పక్కనపెట్టి ప్రభుత్వంపై ఎవరైనా బహిరంగంగా విమర్శలు చేస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకుంటుందా?
మంత్రి పదవి అంశంపై స్పష్టత ఇచ్చి, రాజగోపాల్‌రెడ్డితో చర్చలు జరిపి వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేయవచ్చు. ఇది కాంగ్రెస్‌కు రాజకీయంగా తక్కువ నష్టం కలిగించే మార్గం. కానీ ఉన్నవి రెండు మంత్రి పదవులు మాత్రమే. వాటికీ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. దానికి తోడు జిల్లా, సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకోవాలి కాబట్టి హైకమాండ్ ఎటూ తేల్చలేకపోతుంది.
రెండోది క్రమశిక్షణ చర్య.
బహిరంగంగా ప్రభుత్వాన్ని, పార్టీ నాయకత్వాన్ని పదేపదే విమర్శిస్తే షోకాజ్ నోటీసు నుంచి పార్టీ పరమైన చర్యల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఆ చర్యలు ఎలా ఉంటాయి. కేవలం నోటీసులకే పరిమితం అవుతారా లేక ఇంకేమైన సంచలన నిర్ణయాలు ఉంటాయా..? గతంలో ఆయన వ్యాఖ్యలపై క్రమశిక్షణ వ్యవహారం చర్చకు వచ్చిన సంగతి కూడా ఉంది. కానీ నల్గొండ లాంటి కీలకమైన జిల్లాలో రాజకీయంగా పట్టున్న రాజగోపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవడానికి పార్టీ సాహసిస్తుందా అన్నది సందేహమే. మూడోది.. బుజ్జగింపుల మార్గా్న్ని ఎంచుకోవడం. కాబట్టి ఇప్పటికైతే "రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారా?" అనే ప్రశ్న కంటే "కాంగ్రెస్ ఆయన అసంతృప్తిని ఎలా మేనేజ్ చేస్తుంది?" అనేదే కీలకం. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు.. హైకమాండ్ దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్తామని ప్రకటించారు. దీంతో బంతి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది .
మంత్రి పదవి ఇచ్చి రాజగోపాల్‌రెడ్డిని సంతృప్తిపరుస్తారా?
లేక బహిరంగ విమర్శలకు క్రమశిక్షణ చర్యలతో చెక్ పెడతారా?
లేక.. రెండింటికీ మధ్యలో మరో రాజకీయ రాజీ ఫార్ములాను సిద్ధం చేస్తారా?
ఇది తేలాలంటే కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే తదుపరి నిర్ణయమే కీలకం.




