Off The Record: కోనసీమలో ఇంచార్జి లేక జనసేన ఆగమాగం
Off The Record: కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి ఇన్‌ఛార్జ్‌లు లేకపోవడం వల్ల సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎందుకు మందకొడిగా సాగుతోంది?
Off The Record: కోనసీమలో ఇంచార్జి లేక జనసేన ఆగమాగం
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది జనసేన పార్టీ. మిత్రపక్షంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గంలో బూతు స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ సభ్యత్వాల నమోదును
ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి పట్టున్న జిల్లాగా పేరుపొందిన కోనసీమ జిల్లాలో భారీ స్థాయిలో సభ్యత్వాలు వస్తాయని ఆశించింది. ఐతే స్థానిక లీడర్ల తీరు వల్ల..ఆ స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయలేకపోయారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
కోనసీమ జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా పేరున్న కాపు ఓటర్లు.. జనసేనకు అతిపెద్ద బలంగా చెప్పుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు ఎక్కువగా ఉండడంతో భారీ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వం నమోదు అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ.. ఊహించిన స్థాయిలో లక్ష్యాన్ని చేయలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే దీనికి ప్రధాన కారణాలు జిల్లాలోని పలు నియోజవర్గాల్లో పార్టీకి ఇప్పటికి ఇన్చార్జిలను నియమించకపోవడమేనట. అలాగే స్థానిక నాయకుల మధ్య విభేదాలు, అలాగే జనసైనికులు... పవన్ అభిమానుల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో, అలాగే విభిన్న రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ గా పేరుపొందిన ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇంచార్జీలు కరువయ్యారట. అమలాపురం, ముమ్మిడివరంలో జనసేన పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అమలాపురంలో 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు శెట్టిబత్తుల రాజబాబు నియోజకవర్గం ఇంచార్జీగా వ్యవహారించారు. ఎన్నికల ముందు జరిగిన రాజకీయ పరిణామాలు రిత్యా ఆయన జనసేన పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లారు. అప్పటి నుండి రెండు సంవత్సరాలు గడుస్తున్నా,,ఇప్పటికీ అక్కడ శాశ్వత ఇంచార్జీ ఎవరూ లేరు. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలో 2019 ఎన్నికలో జనసేన పార్టీ తరపున పోటీచేసిన పితాని బాలకృష్ణకి 33 వేలకి పైగా ఓట్లు నమోదయ్యాయి. అదే 2024లో ముమ్మిడివరం అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా టీడీపీకి ఇవ్వడంతో పితాని బాలకృష్ణ పార్టీని విభేదించి వైసీపీలో జాయిన్ అవ్వడంతో అప్పటి నుంచి ముమ్మిడివరంలోనూ జనసేనకి ఇంచార్జ్ లేకుండా పోయారు.
జనసేన పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో జనసేనాని ఎందుకు శాశ్వత ఇంచార్జీలను నియమించలేకపోయారు. ఇది పూర్తిగా జనసేన పార్టీ అదినాయకత్వం లోపంగా చెప్పొచ్చు. ఇక్కడ కేడర్‌ను సమన్వయం చేస్తూ.. పార్టీని నడిపించే ఇన్చార్జిలు లేకపోవడంతో ఆ ప్రభావం జనసేన పార్టీ సభ్యత్వ నమోదుపై పడిందని స్థానిక జనసైనికులు చెబుతున్నారు. మరోవైపు కోనసీమ జిల్లాలో రాజోలు, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ఫర్వావాదు అన్నట్టు జరిగిందట. ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేతో పాటు.. ఇంచార్జీలు ఉండడం వల్లే.. సభ్యత్వాల నమోదులో లక్ష్యాన్ని కొంతమేర సాధించగలిగారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కోనసీమ జిల్లాలోని మిగతా నియోజవర్గాల్లో.. స్థానిక నాయకుల మధ్య విభేదాల కారణం చేత కూడా కొన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు మందకోడిగా సాగుతున్నాయని చెబుతున్నారు. పవన్ ఫ్యాన్స్‌ను సమన్వయం చేసే విషయంలో విఫలమయ్యారని, కొన్ని ప్రాంతాల్లో పవన్ అభిమానులకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కారణం చేత కూడా పార్టీకి మంచి పట్టు్న్న ప్రాంతంలో అనుకున్నంత స్థాయిలో ఉద్యమి నీరుగారిందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి.. ఇన్చార్జులు లేని చోట శాశ్వత ఇన్చార్జీలను నియమించాలని కేడర్ కోరుతోంది.
అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్,,అలాగే జనసైనికుల మధ్య సరైన సఖ్యత ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కోనసీమ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా ఉన్న లోపాలను సరిదిద్దాలని సూచిస్తున్నారు. ఆదిశగా బలమైన నిర్ణయాలు తీసుకోవాలని, జిల్లాలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని డెవలప్ చేసేందుకు కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని అధినేతను కోరుతున్నారు.
వీరిలో మహిళలకు ప్రాధాన్యం పెంచాలని, జనసేనను గ్రామాలకు, పట్టణాలకు విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలంటున్నారు. ఈ అంశాలన్నీ సమర్థవంతంగా ఇంప్లిమెంటు చేయడం ద్వారా జిల్లాలో ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీని డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




