Off The Record: కొత్తగూడెం బీఆర్ఎస్ లో మూడుముక్కలాట!
Off The Record: భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ రేసు తీవ్రతరమైంది. పలువురు నాయకులు పోటీలో నిలవడంతో ఆసక్తికరంగా మారిన గులాబీ రాజకీయం.
Off The Record: కొత్తగూడెం బీఆర్ఎస్ లో మూడుముక్కలాట!
Off The Record: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ అశావహులు స్పీడ్ పెంచారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయ ఉద్దండులు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మారుతున్న రాజకీయ పరిస్థితులతో తన కొడుకు వనమా రాఘవను రంగంలోకి దింపారు. ఎలాగైనా తన కొడుకుకు రాజకీయ వారసత్వం దక్కుతుందని ఊహించినప్పటికీ వెంకటేశ్వరరావుపై గులాబీ దళంలో కొందరు చేసిన కుట్రలు ఫలితంగా ఆ పార్టీ అధిష్టానం రాఘవను దూరం పెట్టిందనే చర్చ కొనసాగుతోంది.
మరోవైపు గత కొంతకాలంగా కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్‌గా రాజ్యసభ సభ్యుడు వద్ధిరాజు రవిచంద్రను గులాబీ పార్టీ అధిష్టానం నియమించిందట. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదట. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రాంతంలో బీఆర్‌ఎస్ పట్టు నిలుపుకోకపోవడంపై అధిష్టానం సైతం కొత్త దారులు వెతుకుతోందట. ఇక గత ఎన్నికల్లో తాత గెలుపు కోసం ప్రచారంలో పాల్గొని కేడర్‌లో జోష్ పెంచిన వనమా రాఘవ కూతురు డాక్టర్ వనమా అలైఖ్యను బరిలోకి దించాలని వనమా కుటుంబం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ కేడర్లో గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు రాజ్యసభ సభ్యుడు వద్ధిరాజు రవిచంద్ర సైతం కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్నారనే టాక్ సైతం వినబడుతోంది.
అయితే ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ఎక్కువ ఉండటంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారా లేదా అనే ప్రశ్న సైతం తలెత్తుతోందట.
ఇదిలా ఉంటే గులాబీ దళంలో జిల్లాకు చెందిన నేతలకే కొత్తగూడెం టికెట్ దక్కుతుందని.. లోకల్, నాన్ లోకల్ చర్చ కేవలం ప్రచారం మాత్రమేనని చెబుతున్నారట.
ఇక కొత్తగూడెం బీఆర్‌యస్ టికెట్ రేసులోకి జిల్లాకు చెందిన తాండ్ర వెంకటేశ్వరరావు అనే ఎన్ఆర్ఐ బరిలో ఉంటారంటూ తాజాగా సంకేతాలు ఇస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీలకు తోఫాలు అందజేయడం, విద్యార్థులకు ఏసీ కంప్యూటర్ లాబ్స్, తాగునీటి అవసరాలకు నిధులు ఇవ్వటం, కరోనా కష్ట కాలంలో ఆహార పదార్థాల సరఫరా, విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ అందించటం, గణేష్ ఉత్సవాలకు సహాయం అందించడం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాండ్ర వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఆయన కూడా పోటీలో ఉంటారనే టాక్ రీసౌండ్ చేస్తోంది. దీనికి తోడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న తాండ్ర వెంకటేశ్వరరావుకు టికెట్ పక్కా అనే ప్రచారం నియోజకవర్గంలో ఊపందకుంది.
మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు సైతం మళ్లీ గులాబీ గూటికి వస్తారని, ఫలితంగా ఆయనకే టికెట్ ఖాయమనే ప్రచారం కూడా లేకపోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌యస్ గెలిచిన ఏకైక సీటు కొత్తగూడెం. బీఆర్ఎస్ తరపున జలగం ఆ ఎన్నికల్లో గెలిచారు. దీంతో ఆయనను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించిన టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో కారు పార్టీ హైకమాండ్ ఉన్నట్టు కేడర్ బలంగా నమ్ముతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కనీసం రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ కొత్తగూడెం ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ టికెట్ రేసు టాప్ గేర్‌లో నడుస్తోంది. రేసులో ఉన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, వనమా అలైఖ్య, తాండ్ర వెంకటేశ్వరావు, జలగం వెంకటరావులలో ఎవరిని గులాబీ టికెట్ వరిస్తుందోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.




