Off The Record: ఖమ్మంలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందా?
Off The Record:తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన హెచ్చరికలు
Off The Record: ఖమ్మంలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందా?
Off The Record: పేరుకే తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు మిత్రపక్షాలు. కానీ రెండు పార్టీలు కలిసి సాగే పరిస్థితి కనిపించడం లేదు. పరిపాలన నచ్చకనా లేక పదవుల పంపకంలో తేడా కొట్టిందా తెలియదు కానీ కామ్రేడ్ల పెద్దన్న సాంబశివరావు మాత్రం.. కొన్ని రోజులుగా హస్తం సర్కార్‌పై చిర్రుబుర్రులాడుతున్నారు.
మెల్లమెల్లగా విమర‌్శల దాడిని పెంచుతున్నారు. మమ్మల్ని విస్మరిస్తే.. బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే మీకూ పడుతుందని శాపనార్థాలు కూడా పెడుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఇరు పార్టీలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తుండటం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రోజు రోజుకు కాంగ్రెస్, సిపిఐ మధ్య గ్యాప్ మరింత పెరుగుతుందనే గుసగుసలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన
మున్సిపల్, అంతకు ముందు జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వారే విడివిడిగా పోటీ చేశారు..ఆ సమయంలోనూ ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరి విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఫలితాలో ఎవరికి సరైన మెజార్టీ రాకపోవడంతో కొత్తగూడెం
కార్పొరేషన్ మేయర్ పదవిని రెండున్నర సంవత్సరాల ఒప్పందంతో సిపిఐకి ఇచ్చింది.. రెండు పార్టీలు ఐక్యత దెబ్బ తినకుండా పార్టీలు సమన్వయం పాటించాయి. అయితే గత కొద్ది కాలంగా రెండు పార్టీల వారు తమ పార్టీల అధిష్టానం పిలుపు మేరకు పనిచేసుకుంటున్నాయి..
ఈ నేపథ్యంలో అటు కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజా చైతన్య యాత్రను సిపిఐ చేపట్టింది..యాత్రలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
కాంగ్రెస్ పార్టీ.. సీపీఐని తక్కువ అంచనా వేస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామంటూ సినిమా డైలాగుతో రెచ్చిపోయారు. కాంగ్రెస్ తనకు తానే పాడే కట్టుకుంటామంటే చేసేదేమీ లేదని,,
సిపిఐ ఎప్పుడూ ప్రజాపక్షమే తప్ప ప్రభుత్వ పక్షం కాదని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల తరఫున తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు..దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య దుమారం
రేగింది. సిపిఐని, కూనంనేని సాంబశివరావును.. కాంగ్రెస్ పార్టీ ఏం అవమానాలకు గురి చేసిందో చెప్పాలని, కొత్తగూడెం మేయర్ పదవిని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉన్నా తీసుకోకపోవడం సీపీఐని అవమాన పరచడమా అంటూ కూనంనేనిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎటాక్ చేశారు.
నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య సయోధ్య సాధ్యమేనా అనే చర్చ స్థానిక ప్రజల్లో వినబడుతుంది.. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెంలో సింగిల్ గా పోటీ చేసే ప్రయత్నం చేస్తుందన్న ఊహాగానాలతోనే కూనంనేని కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంకోవైపు సిపిఐ కార్యదర్శి సాబీర్ పాషా.. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని పలువురు కార్పొరేటర్లు బహిరంగ ఆరోపణలు చేయగా.. దానిపై ఎమ్మెల్యే కూనంనేని ఫైర్ అయ్యారు.
నియోజకవర్గంలో తాను లేని సమయంలో ప్రజా సమస్యలు చూసుకునేందుకు పార్టీ నేతలు ఉంటారని, దాన్ని అలుసుగా తీసుకుని అబద్ధపు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని తెలిపారు. ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం సైతం కాంగ్రెస్ వర్గాల్లో వినబడుతుండగా..
స్థానిక సీపీఐ ఎమ్మెల్యే కాంగ్రెస్‌పై బురద జల్లి పార్టీని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు హస్తం శ్రేణుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్, సిపిఐ క్యాడర్ల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. రెండు పార్టీల స్థానిక కేడర్ల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్, సిపిఐ పొత్తుకు ఎలాంటి ముప్పు లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వంపైకి చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగిందని మరి కాంగ్రెస్, సిపిఐ అధిష్టానాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాల్సినదే.




