Off The Record: నోరు అదుపులో పెట్టుకోండి..?

Off The Record: బిఆర్ఎస్ పార్టీ నేతల దూకుడుకు కేటీఆర్ కళ్లెం! బాల్క సుమన్ అరెస్ట్ తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటి?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2026 6:38 AM IST
Off The Record
X

Off The Record: నోరు అదుపులో పెట్టుకోండి..?

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్షంగా గట్టిగా కొట్లాడుతోంది బీఆర్ఎస్ పార్టీ. అగ్రనేతలతో పాటు.. తాజా ఎమ్మెల్యేలు, మాజీలు సైతం స్థానికంగా ఫైట్ చేస్తున్నారు. ఐతే ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో కొంతమంది నేతల తీరు, మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. అవి ఆయా నేతలకు కష్టాలు తెచ్చిపెట్టడమే కాదు.. ఇటు పార్టీనీ ఇబ్బందులకు గురి చేసేలా ఉంటున్నాయి. నేతల దూకుడు రాజకీయాలు ఒక్కోసారి సృతి మించి పార్టీకి నష్టం చేస్తున్నాయట. నేతల్ని సమర్థించలేక, ఇటు ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టలేక పార్టీ ఇరుకున పడుతోందట.

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులు, అనంతరం జరిగిన అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన సింగరేణి అనుబంధ సంఘం మీటింగ్‌లో.. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలని వారిని ఉసిగొల్పేలా బాల్క సుమన్ మాట్లాడం

వివాదాస్పదంగా మారింది. ప్రత్యర్థి పార్టీల నుంచే కాదు ప్రజల నుంచి కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రజా ప్రతినిధి నోటి వెంట ఇలాంటి మాటలు ఏంటి..? ప్రజలకు ఆదర‌్శంగా ఉండాల్సిన నేతలు.. ఏం మేసేజ్ ఇస్తున్నారు. ప్రజాస్వామంలో దాడులకు తావు ఉండకూడదన్న అభిప్రాయాలు వినిపించాయి. ఆయన వ్యాఖ్యలు హింసాత్మక చర్యలను ప్రోత్సహించేలా ఉన్నాయన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా.. దీన్ని పెద్దగా డిఫెన్స్ చేసుకోలేకపోయింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశముందని భావించిన బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైంది.

ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ లీడర్ల భాష, ప్రజా వేదికలపై వారి వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువ నాయకులు, సోషల్ మీడియా వేదికలపై చురుకుగా ఉండే నేతలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసినట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పార్టీ యువ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల విమర్శలకు రాజకీయంగానే ప్రతిస్పందించాలని, ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, దర్యాప్తు సంస్థలు లేదా పరిపాలనా వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు అత్యంత సంయమనం పాటించాలని ఆయన సూచించినట్లు పార్గీ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొందరు మంత్రులు, అలాగే మంత్రిపదవుల కోసం ప్రయత్నిస్తూ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేస్తే వాటికి రాజకీయంగా ధీటుగా సమాధానం ఇవ్వాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత విమర్శలకు ప్రతిస్పందించే క్రమంలో పార్టీ నాయకులు చట్టపరమైన లేదా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకునేలా వ్యవహరించకూడదని కూడా ఆయన హెచ్చరించినట్లు సమాచారం. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నేతలపై కేసులు నమోదవడం, అరెస్టులు జరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పార్టీ నాయకత్వం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

వడ్లు, మొక్కజొన్నల కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ.. బీఆర్ఎస్‌ పోరుబాట పట్టింది. అగ్రనేతలు కేటీఆర్, హరీష్‌రావుతో పాటు.. స్తానికంగా ఎక్కడిక్కడ గులాబీ శ్రేణులు కొనుగోలు కేంద్రాల బాట పట్టారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఐతే ఈ విషయంలో గులాబీ పార్టీకి మైలేజ్ వస్తున్న క్రమంలో.. బాల్క సుమన్ అలా మాట్లాడం ఇష్యును ఒక్కసారిగా డైవర్ట్ చేసింది. కాంగ్రెస్ నేతలు బాల్క సుమన్‌తో పాటు.. బీఆర్ఎస్ పార్టీపై మాటలు తూటాలు పేల్చడంతో.. కారు పార్టీ డిఫెన్స్‌లో పడింది. బాల్క సుమన్ ఇంటెన్షన్ వేరైనా, ఏ సందర్భంలో అలా మాట్లాడినా.. అవి వివాదాస్పదంగా మారడంతో.. కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది. వెంటనే బాల్క సుమన్ అరెస్ట్‌తో.. ధాన్యం కొనుగోలులో బీఆర్ఎస్‌కు రావాల్సిన మైలేజ్ పక్కాదిరి పట్టినట్టైంది.

బాల్క సుమన్‌కు సంబంధించిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీయగా, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పోరాటాన్ని మరింత వ్యూహాత్మకంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఆ పార్టీ అంతర్గత సమావేశాల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అంతకు ముందు పార్టీ ఎమ్మెల్యే పాడీ కౌషిక్ రెడ్డి సైతం ఇలా దూకుడుగా వెళ్లి వివాదాలు రాజేయడంతో ఆయనకు సైతం కళ్లెం వేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఫైలేట్ రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ లో దొరకడం కూడా పార్టీకి నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నేరుగా కేటీఆర్ ప్రెస్ మీట్ లో ఫైలేట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ప్రకటించారు. మొత్తంగా చూస్తే బాల్క సుమన్ వ్యవహారం బీఆర్ఎస్‌కు రాజకీయంగా ఒక హెచ్చరికగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడుతూనే, నాయకుల వ్యాఖ్యలు చట్టపరమైన వివాదాలకు దారితీయకుండా చూసే దిశగా పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. చూడాలి దూకుడుగా ఉన్న నేతలకు ఏ విధంగా కళ్ళెం వేయనుందొ.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story