Off The Record: మళ్ళీ జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్!

Off The Record: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ త్వరలో మళ్లీ కీలక పాత్ర పోషిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Oct 2026 7:50 AM IST
Off The Record
X

Off The Record: మళ్ళీ జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్!

Off The Record: "మూడేళ్లుగా తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన బీఆర్ఎస్.. ఇప్పుడు మరోసారి జాతీయ రాజకీయాల ప్రస్తావన ఎందుకు తెస్తోంది..? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారా..? లేక ఇది కేవలం రాజకీయ సందేశమేనా..?" అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలవాలని కేసీఆర్ ప్రయత్నించారు.

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరణకు ప్రయత్నాలు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో రాజకీయ ఫలితాలు రాలేదు. తెలంగాణ వెలుపల బలమైన సంస్థాగత నిర్మాణం ఏర్పడకపోవడంతో పాటు జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలు కూడా అనుకూలించలేదు.

ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం పార్టీ రాజకీయ దిశనే మార్చేసింది. జాతీయ రాజకీయాల కన్నా రాష్ట్రంలో పార్టీని తిరిగి బలోపేతం చేయడంపైనే దృష్టి కేంద్రీకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, రైతు సమస్యలు, సాగునీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై పోరాటాలకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో జాతీయ రాజకీయాల ప్రస్తావన క్రమంగా వెనక్కి వెళ్లిపోయింది.

అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. దేశంలో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు ప్రజల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయాయని, ప్రత్యామ్నాయ రాజకీయాల అవసరం ఉందనే వాదనను బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం తెలంగాణలో తిరిగి అధికారం సాధించడమే. అలాంటి సమయంలో జాతీయ రాజకీయాల అంశాన్ని ప్రస్తావించడం వెనుక అసలు ఉద్దేశమేంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ చర్చను మళ్లీ బీఆర్ఎస్ చుట్టూ కేంద్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నమా..? లేక నిజంగానే కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయబోతున్నారా..? అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

మరోవైపు, గత అనుభవాల దృష్ట్యా ఈసారి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందన్నదీ ఆసక్తికరంగా మారింది. కేవలం నాయకత్వ స్థాయిలో జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమవుతుందా..? లేక ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ, జాతీయ అంశాలపై ప్రత్యేక కార్యాచరణ, రాజకీయ సమీకరణాల దిశగా అడుగులు వేస్తుందా..? అన్నది చూడాల్సి ఉంది.

మరి కేటీఆర్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ సందేశానికే పరిమితమా..? లేక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రీఎంట్రీకి ఇది సంకేతమా..? అన్న ప్రశ్నలకు రానున్న రోజుల్లోనే సమాధానం దొరకనుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్